User Tools

Site Tools


రాక్షసుడి_తోట
				రాక్షసుడి తోట

బడిగంట కొడతారు.బయటకు రాగానే పిల్లలు రాక్షసుడి తోటలోకి దూరుతారు. చీకటి పడేదాకా అక్కడే ఉంటారు. రకరకాల ఆటలాడతారు. గుంపులు గుంపులుగా చేరి పాటలు పాడతారు. తోటలో హాయిగా పరిగెత్తుతారు. ఎగురుతారు. దూకుతారు. చెట్లెక్కుతారు. కేరింతలు కొడతారు. తోటంతా సందడి చేస్తారు.

ఆ తోట ఒక రాక్షసుడిది. అందుకే అందరూ దానిని రాక్షసుడి తోట అంటారు. రాక్షసుడంటే నిజంగా రాక్షసుడని కాదు. రెండు కొమ్ములు,పెద్ద పెద్ద కోరలు ఎమీ ఉండవు. అతను కూడా మనలాగే ఉంటాడు. కాకపోతే మహాకఠినమైన మనిషి.చాలా కోపిష్టి. ఎవరికీ వీసమెత్తు సాయం చేయడు.తన తోటలోకి ఎవరూ రాకూడదని అంటాడు.
 ఇప్పుడు రాక్షసుడు ఊళ్లో లేడు. ఎక్కడో దూరంగా ఉన్న బంధువుల ఇంటికి పోయాడు. పోయి ఆరేడేళ్లయింది. అందుకే పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు.
  రాక్షసుడి తోటంటే పిల్లలకు చాలా ఇష్టం. అందులో ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టం.
ఆ తోట చాలా అందంగా ఉంటుంది. కిందనంతా పచ్చని మెత్తని గడ్డి. చుట్టూతా ఉంది. ఇక అందులో తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మాటల్లో చెప్పలేము. తిరిగి చూడాల్సిందే. ఆడి చూడాల్సిందే.
ఆ తోటలో ఒంటినిండా పూలు పూయించుకొనే గుల్ మొహర్ చెట్లున్నాయి. సొంపుగా, నిటారుగా పెరిగే అశోక చెట్లున్నాయి. వేప,రావి, కానుగ వంటి చెట్లు ఎన్నో ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని మామిడి చెట్లు, నేరేడు చెట్లు ఉన్నాయి. ఓ ఐదారు జామచెట్లు కూడా ఉన్నాయి. ఇక చామంతులు, గులాబీలు వంటి పూల మొక్కలకైతే లేక్కే లేదు.
 అక్కడ రకరకాల పిట్టలొస్తాయి. పూలతో ఆడుకుంటాయి. పళ్ళను, కాయలను తింటాయి. కొమ్మల్లో కూచుని తియతియ్యగా పాటలు పాడతాయి.అబ్బ! వాటి పాటలు ఎంత బాగుంటాయో! పిల్లలు తమ ఆటలను కూడా ఆపి ఆ పాటలు వింటారు. అంత కమ్మగా ఉంటాయవి.
"అబ్బ! ఇక్కడ మనకు ఎంత బాగుందో!" అంటారు పిల్లలు. అంత చక్కని తోటలో ఆడుకోవడం ఎవరికి మాత్రం బాగుండదు.
ఊరికెల్లిన రాక్షసుడు ఒకనాడు తిరిగొచ్చాడు. వాడి ఇల్లు కూడా ఆ తోటలోనే ఉంది. ఆడుకుంటున్న పిల్లలు వాడి కంటపడ్డారు. ఇంకేం. మండిపడ్డాడు.
 "ఎవడ్రా అది. ఇక్కడ మీకేం పనిరా?" రాక్షసుడు కోపంగా అరిచాడు.

పిల్లలు అదిరిపడ్డారు. పొలోమంటు బయటకి పరిగెత్తారు.

“ ఇది నా తోట.నా ఒక్కడిదే. ఇందులోకి ఇంకెవడూ రాకూడదు. ఇంకోసారి ఇక్కడికి వచ్చారంటే మక్కలిరగదంతాను.” అన్నాడు రాక్షసుడు. దాంతో పిల్లలు బాగా బెదిరిపోయారు.

 రాక్షసుడు తోట చుట్టూ పెద్ద గోడ కట్టాడు. దాని బయట ఒక నోటీసు బోర్డు పెట్టాడు. అందులో పెద్ద పెద్ద అక్షరాలలో  ఇలా రాయించాడు.
  హెచ్చరిక
లోనికి వచ్చేవారు
కఠినంగా శిక్షింపబడెదరు

రాక్షసుడు ఎంత స్వార్థపరుడో కదా!

ఇప్పుడు పేద పిల్లలకు పెద్ద కష్టమొచ్చింది. ఆడుకుందామంటే ఎక్కడా ఇంత జాగా లేదు. రోడ్డు మీదే ఆడుకుందామని చూసారు. పెద్దగా దుమ్ము రేగింది. కొసదేరిన రాళ్లు బలంగా గుచ్చుకున్నాయి. ఎంతో మంది దెబ్బలు తగిలించుకున్నారు. కొన్ని రోజులకే అందరికీ విసుగుపుట్టింది. దాంతో ఆడటమే మానుకున్నారు.

బడి వదులుతారు. పిల్లలందరూ రాక్షసుడి తోట దగ్గరకు వస్తారు. దాని ఎతైన గోడలను చూస్తారు. చాలా సేపు అక్కడే నిలబడతారు. తోట గురించే మాట్లాడుకుంటారు. అందులో ఎన్నెన్ని ఆటలు ఆడుకున్నారో! అవన్నీ గుర్తు చేసుకుంటారు.

“అప్పుడు మనం ఎంత చక్కగా అడుకునేవాళ్లం. అక్కడ ఎంత బాగుండేది” ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఆ తరువాత ఉసూరుమంటూ ఇళ్లకు వెళ్లిపోతారు.

వసంత రుతువు వచ్చింది. అంటే చెట్లు చిగుర్లేసి పూలు పూసే కాలం. అన్ని తోటల్లో చిన్ని చిన్ని మొగ్గలోస్తున్నాయి. బుజ్జి బుజ్జి పక్షికూనలు కూస్తున్నాయి. అయితే రాక్షసుడి తోటలో మాత్రం ఒక్క పూవూ పూయలేదు. అసలక్కడ చెట్లకు చిగుర్లే రాలేదు.

ఆ తోటలోకి ఇప్పుడు పిల్లలెవరూ రావడం లేదు . అందుకేనేమో - మొగ్గలు విచ్చుకోవడం మానేసాయి. పిట్టలు పాటలు పాడడం మూనుకున్నాయి. ఒక అందమైన మొగ్గ ఎలాగైనా విచ్చుకుందామనుకుంది. తల పైకెత్తి చూసింది. చూడగానే నోటీసు బోర్డు కనిపించింది. పిల్లల మీద ఆ పువ్వుకు బాగా జాలి కలిగింది. అంతే. వెంటనే ముడుచుకుంది. మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఆ తోటలో ఇప్పుడు రెండే రెండు సంతోషంగా ఉన్నాయి - మంచు, చలిగాలి! “భలేభలే. పూలకాలం ఈ తోటలోకి రావడం మర్చిపోయింది. ఇక మనమిద్దరం ఎంచక్కా ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదాం” మంచు, చలిగాలి కేరింతలు కొట్టాయి. ఎడతెరిపి లేకుండా తెల్లని మంచు కురిసింది. గడ్డి మొత్తం అందులో కప్పబడింది. రివ్వురివ్వున బలంగా చలిగాలి వీచింది. చెట్లు గజగజా వణికాయి. “అబ్బ! ఇక్కడ మనకు ఎంత బాగుంది!” అంది చలిగాలి. “మనం వడగళ్ళను కూడా పిలుచుకొద్దాం. ఇంకా బాగుంటుంది” అంది మంచు. ఇంకేం. మంచు, చలిగాలితో పాటు ఇప్పుడు రోజూ రెండు మూడు గంటలు వడగళ్ళ వాన పడుతోంది. ఇటుక రాళ్లంత పెద్ద పెద్ద వడగళ్లు పడుతున్నాయి. వాటి దెబ్బకు చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. రాక్షసుడి ఇంటి పై కప్పు పెంకులతో వేసినది. ఆ పెంకులన్నీ వడగళ్ల దెబ్బకు ముక్కలయ్యాయి. “ఈ పూలు పూసే కాలం ఇంకా ఎందుకు రాలేదో? నాకేమీ అర్ధం కావటం లేదు” అనుకున్నాడు రాక్షసుడు. అర్ధం కాక తలకొట్టుకున్నాడు. కిటికీలోంచి చూస్తాడు. తోట తోటంతా తెల్లగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మంచే. నేల మీద, చెట్ల మీద, ఇంటి మీద గడ్డ పెరుగులా మంచు పేరుకుంది. “పూలకాలం ఈ రోజు కాకపోతే రేపు వస్తుందిలే” అనుకున్నాడు రాక్షసుడు. రాక్షసుడు ఎదురుచూసిన 'రేపు' వచ్చింది. 'ఎల్లుండి' కూడా వచ్చింది. ఒకొక్క రోజు వచ్చి పోతున్నాయి. వారాలు, నెలలు గడుస్తున్నాయి. అయినా ఆ తోటకి పూలకాలం రాలేదు. “ఈ రాక్షసుడు మహా స్వార్ధపరుడు. ఇక్కడకు చచ్చినా రాకుడదు” అనుకొంది వసంతం. అన్ని తోటల్లో పూలు కాయలయ్యాయి. కాయలు పళ్ళవుతున్నాయి. అయినా రాక్షసుడి తోటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అక్కడ మంచు, వడగళ్లు కురుస్తూనే ఉన్నాయి. రోజురోజంతా చలిగాలి చిందులు తొక్కుతూనే ఉంది. రాక్షసుడికి అంతా అయోమయంగా ఉంది. ఒకనాడు - అతను మంచం మీద పడుకొని ఉన్నాడు. ఏమయింది? ఎందుకిలా జరిగింది? బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి కమ్మని సంగీతం వినిపించింది. అది ఎంతో తియ్యగా ఉంది. ఏ రాజుగారి సంగీతం మునుషులో ఇటుగా పోతున్నారేమో! ఈ సంగీతాన్ని వారే వాయిస్తున్నారేమో! అనుకున్నాడు రాక్షసుడు. అయితే అసలు సంగతి అది కాదు. కిటికీ బయట తోటలో ఓ చిన్న పిట్టపిల్ల కూచొని ఉంది. ఆ బుజ్జిపిట్టే కమ్మగా పాట పాడుతోంది! రాక్షసుడికి ప్రాణం లేచి వచ్చింది. పక్షుల పాటలు, కిలకిలలు విని ఎన్నో ఏళ్ళు గడిచాయి. దాంతో ఆ బుజ్జిపిట్ట పాటలు అన్నిటికన్నా కమ్మగా అన్పించాయి. అంతలోనే, దబాదబా ఇంటిపైన పడుతున్న వడగళ్ళు ఆగిపోయాయి. చల్లగాలి కూడా చిందులేయడం మాని పక్కకు తప్పుకుంది. అంతే కాదు. కమ్మటి పూల వాసన కిటికీలోంచి దూసుకొచ్చింది. “హమ్మయ్య, ఇక పూల కాలం వచ్చేసినట్లే” రాక్షసుడు సంబరపడ్డాడు. మంచం మీది నుంచి లేచాడు. బయటకు తొంగి చూసాడు. అక్కడ ఎంత అద్భుతంగా ఉందో! ఎన్నడూ చూడనంత అందంగా ఉంది. ఎప్పుడొచ్చారో ఏమో. తోట గోడకు పడిన ఓ చిన్న కన్నంలోంచి దూరి ఎందరో పిల్లలు లోనికొచ్చారు. వారంతా చెట్ల కొమ్మల మీద కూచుని ఊగుతున్నారు. కబుర్లు చెప్పుకుంటున్నారు. కేరింతలు కొడుతున్నారు. ఏ చెట్టు మీద చూసినా పిల్లలే. చిన్న చిన్న పిల్లలు! ఆడుకుంటూ, పాడుకుంటూ, హాయిగా, తియ్యగా…. పిల్లలు మళ్ళీ రావడంతో చెట్లు పులకించిపోయాయి. మొగ్గలు నిండుగా విచ్చుకున్నాయి. కమ్మని చిరునవ్వులు రువ్వుతున్నాయి. ఆకులు అదే పనిగా తలలూపుతున్నాయి. పిల్లలకు తమ సంతోషం తెలుపుతున్నాయి. ఎన్నో రకాల పక్షులు ఆనందంగా ఎగురుతున్నాయి. తీయని పాటలు పాడుతున్నాయి. కిందన ఉన్న గడ్డిలోంచి రంగురంగుల పూలు పైకి లేచాయి. అవన్నీ చిరునవ్వులు చిందిస్తున్నాయి. అదంతా ఎంతో మనోహరంగా ఉంది. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తోంది. కన్నుల పండువగా ఉంది. అంతా మారిపోయింది. అయినా తోటలో దూరంగా ఓ మూల మాత్రం ఇంకా అప్పటిలానే ఉంది. అక్కడ ఏ పిట్టలూ లేవు. ఎలాంటి పూలు లేవు. అక్కడొక చిన్న పిల్లాడు నిలబడి ఉన్నాడు. చాలా చిన్న పిల్లాడు. చిన్న చిన్న మొక్కల కొమ్మలు కూడా వాడికి అందడం లేదు. కొమ్మలను అందుకోవాలి. అందుకోసం వాడు మాటిమాటీకి ఎగురుతున్నాడు. ఎంత ఎగిరినా ఒక్క కొమ్మా అందలేదు. దాంతో ఆ పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఆ చెట్టు దగ్గర ఇప్పటికీ మంచు పేరుకొని ఉంది. చలిగాలి శివతాండవం చేస్తున్నది. “ఎక్కు నాయనా” అంది చెట్టు పిల్లాడితో. తన రెమ్మలను మరింత కిందకు వంచింది. అయినా లాభం లేకపోయింది. పిల్లాడు వాటిని అందుకోలేకపోయాడు. రాక్షసుడు ఇదంతా చూసాడు. చెట్లకు పూలు రావడం చూసాడు. పిట్టలు పాటలు పాడటం చూసాడు. తోటలో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లలను చూసాడు. దూరంగా ఒక చెట్టు కింద ఏడుస్తూ ఉన్న పిల్లాడిని చూసాడు. ఇదంతా చూసిన రాక్షసుడి మనసు కరిగిపోయింది. “ఛీఛీ. నేను ఎంత స్వార్ధపరుడ్ని. ఇవన్నీ నా కోసమే ఉండాలని ఎంత నీచంగా అనుకున్నాను. చాలా పాపం చేసాను. నా తోటలోకి వసంతం ఎందుకు రాలేదో ఇప్పుడు అర్ధమవుతోంది” అనుకున్నాడు. ఇంతకాలం తను చేసిందానికి బాధపడ్డాడు. “ముందుగా ఆ చిన్నపిల్లాడ్ని చెట్టు ఎక్కిస్తాను. తర్వాత ఈ తోట గోడను కూలగొట్టేస్తాను. ఇక నుంచి పిల్లలందరినీ ఈ తోటలోకి రానిస్తాను. అందరినీ ఆడుకోనిస్తాను” అనుకున్నాడు. రాక్షసుడు మెట్లు దిగి, మెల్లగా ఇంటి తలుపులు తెరిచాడు. ఆనందంగా తోటవేపు నడిచాడు. అయితే…. అతడు ఇలా కనిపించాడో లేదో, పిల్లలు భయంతో వణికిపోయారు. వెంటనే అందరూ పారిపోయారు. తోటనిండా మళ్ళీ చలి, మంచు నిండిపోయాయి. పిల్లలంతా పారిపోయారు. అయినా ఆ చిన్నపిల్లాడు మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడు. ఇప్పటికీ వాడు ఏడుస్తున్నాడు. వాడి కంటి నిండా కన్నీరే. అందుకే రాక్షసుడు వాడికి కన్పించలేదు. రాక్షసుడు మెల్లగా నడిచాడు. ఆ పిల్లాడి దగ్గరకు చేరుకున్నాడు. వాడ్ని ఎత్తుకొన్నాడు. ఓ కొమ్మ మీద కూర్చోబెట్టాడు. అంతే. చిత్రంగా ఆ చెట్టుకి ఒంటినిండా పూలొచ్చాయి. ఎక్కడినుంచో గుంపులు గుంపులుగా పిట్టలొచ్చి ఆ చెట్టు మీద కూర్చున్నాయి. కమ్మగా పాటలు పాడటం మొదలెట్టాయి. ఆ పిల్లాడికి ఎంతో సంతోషం కలిగింది. ఏడుపు ఆపేసాడు. ఆనందంతో కేరింతలు కొట్టాడు. రాక్షసుడి మెడ చుట్టూ తన రెండు చేతులనూ వేసాడు. అతడి బుగ్గ మీద ముద్దుపెట్టుకున్నాడు. దూరంగా నిలబడిన పిల్లలు ఇదంతా చూసారు. రాక్షసుడు మారిపోయాడు! నిజమే? ముందు నమ్మలేకపోయారు. తర్వాత మెల్లమెల్లగా నమ్మకం కలిగింది. దాంతో పిల్లలకు చెప్పలేనంత సంతోషం కలిగింది. బిలబిలమంటూ అందరూ తోటలోకి తిరిగొచ్చారు. వారు రాగానే మళ్ళీ మంచు కరిగిపోయింది. చలిగాలి పారిపోయింది. చెట్లన్నీ పూలతో నిండిపోయాయి. “పిల్లలూ! ఇక నుంచి ఈ తోట మీది. మీ అందరిదీ” అన్నాడు రాక్షసుడు. పిల్లలు ఆనందంతో గెంతులేసారు. రాక్షసుడు ఓ పెద్ద గునపం తీసుకున్నాడు. తోట గోడను కూలగొట్టాడు. ఇప్పుడు ఆ తోట ఎంతో అందంగా ఉంది. పిల్లలతో రాక్షసుడు ఆడుకుంటున్నాడు. సాయంత్రం బజారుకు పోయే జనం ఇది చూసారు. నిండుగా పూసిన తోట. కేరింతలు కొడుతున్న పిల్లలు. వారితో కలిసి పిల్లల్లాగే ఆడుకుంటున్న రాక్షసుడు. ఎంత బాగుంది ఇదంతా! ఇంత చక్కటిది ఇదివరకెన్నడూ చూడలేదు. పిల్లలు రోజు రోజంతా తోటలో ఆడుకున్నారు. ఇంటికి పోయేముందు రాక్షసుడ్ని కలిసారు. “మీ చిన్న నేస్తం ఎక్కడున్నాడు? నేను ఎత్తుకొని చెట్టు మీద కూచోబెట్టాను చూడండి. ఆ బుజ్జిగాడు?” అడిగాడు రాక్షసుడు. “మాకు తెలీదు మామయ్యా” అన్నారు పిల్లలు. ఆ బుజ్జిగాడు అప్పుడే వెళ్ళిపోయాడని చెప్పారు. “అరెరె. సరేలెండి. రేపు ఇక్కడికి తప్పకుండా రమ్మని చెప్పండి” అన్నాడు రాక్షసుడు. అయితే…. ఆ చిన్న పిల్లాడు ఎక్కడుంటాడో ఎవరికీ తెలీదు. ఇదివరకెన్నడూ పిల్లలు ఆ బుజ్జిగాడిని చూడలేదు. అది విని రాక్షసుడు నిరాశపడ్డాడు. ఆ పిల్లాడు ఎక్కడుంటాడో! మళ్ళీ వస్తాడో రాడో! రాకపోతే ఎలా! ఏం చేయాలి? అనుకున్నాడు. వాడంటే రాక్షసుడికి ఎంతో ప్రేమ కలిగింది. ఇప్పుడు పిల్లలకు చాలా ఆనందంగా ఉంది. బడి వదులుతారు. బిలబిలమంటూ పిల్లలు తోటలోకి పోతారు. పొద్దుగూకే దాకా అక్కడే ఉంటారు. రాక్షసుడితో కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు రాక్షసుడు పిల్లలందరితో మంచిగా ఉంటున్నాడు. వారి మీద చెప్పలేనంత దయని, ప్రేమని చూపిస్తున్నాడు. అయితే…. అతనికి ఎంతో ఇష్టమైన ఆ చిన్నపిల్లాడు మాత్రం మళ్ళీ కన్పించలేదు. ఆ రోజు కనిపించడమే. ఆ తర్వాత ఇంకెవరికీ ఆ పిల్లాడు కన్పించలేదు. రాక్షసుడు ప్రతిరోజూ ఎదురు చూస్తున్నాడు. ఆ బుజ్జిగాడిని చూడాలని అతని మనసు కొట్టుకుంటోంది. ఎంతో ఆరాటపడుతున్నాడు. అయినా ఆ పిల్లాడు కన్పించడం లేదు. కొన్ని నెలలు గడిచాయి. ఏళ్ళు గడిచాయి. రాక్షసుడు ఇప్పుడు చాలా ముసలివాడయ్యాడు. ఒంట్లో కొంచెమైనా బలం లేదు. పిల్లల్తో ఆడలేకపోతున్నాడు. రోజంతా ఓ మడతకుర్చీలో కూచుంటాడు. అలా పడుకొనే తోట వంక చూస్తాడు. పచ్చని ఆకులు, రంగురంగుల పూలు, రకరకాల పళ్లు, కిలకిలమంటూ తిరిగే పిట్టలు… అన్నిటినీ మించి చెంగుచెంగున దూకుతూ ఆడుకొనే పిల్లలు!… రాక్షసుడికి కడుపు నిండిపోతుంది. “నా తోటలో అన్నిటికన్నా పూలు అందంగా ఉంటాయి. అయితే ఆ పూలకన్నా కూడా ఈ పిల్లలు అందంగా ఉంటారు. ఈ పిల్లలే లోకంలో అసలైన పూలు” అనుకుంటాడు. చలికాలం వచ్చింది. ఇప్పుడు చలికి, మంచుకి రాక్షసుడు భయపడడం లేదు. పిల్లలోస్తే చాలు. అదే ఓ పెద్ద పండుగ. ఒకనాడు….. ఎప్పటిలాగే రాక్షసుడు మడతకుర్చీలో పడుకున్నాడు. ఎన్నో ఏళ్ళ కిందట ఆ చిన్న పిల్లాడు ఆడుకున్న చెట్టుకిందే కుర్చీ వేసుకున్నాడు. అలా తోటవంక చూస్తూ కూర్చున్నాడు. పిల్లలందరినీ గుర్తు చేసుకున్నాడు. హాయిగా అన్పించింది. అంతలోనే నిద్ర పట్టింది. నిద్రలో ఒక కల వచ్చింది. అదే అందమైన తోట. ఆ తోటలో ఓ వారగా ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు నిండా పూలే. తెల్లని పూలు. పెద్ద పెద్ద పూలు. గాలికి అవి అటూ ఇటూ ఊగుతున్నాయి. కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ చెట్టు, ఆ పూలు అద్భుతంగా ఉన్నాయి. సరిగ్గా ఆ చెట్టుకిందే… ఒక చిన్నపిల్లాడు నవ్వుతూ నిలబడ్డాడు. అరె! ఆశ్చర్యం! ఆ పిల్లవాడే. ఒకప్పుడు ఏడుస్తూ నిలబడ్డ పిల్లవాడే! అబ్బ! ఎన్నాళ్లకు మళ్ళీ కన్పించాడు. రాక్షసుడికి పట్టలేనంత సంతోషం కలిగింది. “ ఓరే నా చిట్టితండ్రీ. నా బంగారు తండ్రీ. ఎన్నాళ్లకు కన్పించావురా” అంటూ రాక్షసుడు పరిగెత్తాడు. కిందపడ్డాడు. లేచాడు. పరిగెత్తి పరిగెత్తి పిల్లాడ్ని చేరుకున్నాడు. “ఎక్కడికి పోయావు చిట్టి తండ్రీ. ఇన్నాళ్లూ ఏమైపోయావురా” అన్నాడు బాధగా. “నేనెక్కడికీ పోలేదు తాతా. ఇక్కడే ఉన్నాను. ఈ పూలచెట్టుని నేనే. ఈ చెట్టుకు పూసే పూలన్నీ నేనే. ఈ చెట్లన్నీ నేనే. ఇక్కడ ఆడుకునే పిల్లలందరూ నేనే” అన్నాడు పిల్లవాడు. పిల్లాడి ఒంటి నిండా దెబ్బలున్నాయి. చేతుల మీద, తల మీద, కాళ్ల మీద… ఒంటినిండా దెబ్బల గాట్లు. అది చూడగానే రాక్షసుడికి ఏడుపొచ్చింది. “నీ వంటి మీద ఈ దెబ్బలేంటి?” అడిగాడు. “నిన్ను కొట్టిన వాడెవడో చెప్పు. వాడి తల నరికి పడేస్తాను” అన్నాడు కోపంగా. “ఈ దెబ్బలు నువ్వు కొట్టినవే” అన్నాడు పిల్లాడు. “నేనా?” “అవును నువ్వే. ఒకప్పుడు నువ్వు పిల్లలెవరినీ ఈ తోటలోకి రానివ్వలేదు. అప్పుడు వాళ్ళు రాళ్ళలోను, ముళ్లతుప్పల్లోనూ ఆడుకున్నారు. గుర్తుందా? అప్పుడు వారికి ఎన్నో దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలే ఇవి” అన్నాడు పిల్లాడు. “అయ్యో! ఎంత పని చేసాను” అన్నాడు రాక్షసుడు బాధగా. “పోనీలే. ఆ తర్వాత నువ్వు మారిపోయావుగా. అదే చాలు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది.” అన్నాడు పిల్లవాడు. “నిజంగానా?” “నీ మీద ఒట్టు” “అయితే ఇక నుంచీ రోజూ ఈ తోట కొస్తావా?” “తప్పకుండా. ఎక్కడినుంచో రావడం దేనికి? ఇక్కడే ఉండిపోతాను” పిల్లాడి మాటలకు రాక్షసుడు భోరున ఏడ్చేసాడు. సంతోషం మరీ ఎక్కువైతే అలాగే ఏడుస్తారు. “మరి నాతో ఆడుకుంటావా?” అని అడిగాడు. “ఓ… రోజూ నీతోనే ఆడుకుంటాను” రాక్షసుడికి ఇంకా సంతోషం కలిగింది. ఇద్దరూ ఆడుకుంటున్నారు. చెంగుచెంగున ఎగురుతున్నారు. తోటంతా పరిగెత్తుతున్నారు. చెట్లెక్కుతున్నారు. కొమ్మలు పట్టుకొని ఊగుతున్నారు. గెంతులేస్తున్నారు. నవ్వుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. అదొక పండగలా ఉంది. చెప్పలేనంత సందడిగా ఉంది…. కలగంటూ కంటూ రాక్షసుడు(నిద్రలోనే) చనిపోయాడు. బడి వదిలాక పిల్లలంతా తోటలోకి వచ్చారు. చెట్టు కింద రాక్షసుడు పడుకొని ఉన్నాడు. అతని ఒంటి మీద తెల్లని పెద్ద పెద్ద పూలు పడి ఉన్నాయి! రాక్షసుడి ముఖం ఎంతో సంతోషంగా ఉంది!

					పందెం

మావూరంటే నాకెంతో ఇష్టం. మావురి పక్కనే ఓ నది వుంది. వెన్నెట్లో అక్కడి ఇసకలో మేం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. పగలంతా చిట్టడవిలో తిరిగేవాళ్ళం. వెతికి వెతికి నెమలి గుడ్లు పట్టేవాళ్ళం. పక్షుల్లా అరిచేవాళ్ళం. జింకల్లా గెంతేవాళ్ళం. ఒకసారి నేనూ, నా జతగాళ్లు నది ఒడ్డుకు పోయాం. పొద్దు గూకింది. మేమంతా ఓ పడిపోయిన చెట్టు మీద కూచున్నాం. దెయ్యం కథలు చెప్పుకోవడం మొదలెట్టాం. నది వడ్డున మిణుగురులు ఎగురుతున్నాయి. ఒకసారి ఇక్కడ మిణుక్కుమంటాయి. ఒకసారి అక్కడ మిణుక్కుమంటాయి. కప్పలు ఒకటే బెకబెకలు. సొరకాయ బుర్రని వాయించినట్లు అరుస్తున్నాయి. మరో వంక కీచురాళ్ళ అరుపులు. కప్పలు, కీచురాళ్ళు పోటీ పెట్టుకున్నట్టు అరుస్తున్నాయి. వెన్నెల్లో ఊరంతా అందంగా ఉంది. ఇళ్ళలో వంటలు చేసే సమయం. ఇళ్ళ నుంచి వచ్చే పొగ ఊరి మీద మబ్బుల్లా పరుచుకొంది. మేమంతా ఒకర్ని ఆనుకుని ఒకరం కూచున్నాం. దయ్యాల కథలంటే మాటలా? ఎంత భయం. అయినా సరే వాటినే చెప్పుకుంటున్నాం. భయంతో ఒకర్ని ఒకరం బిగ్గరగా కరచుకుంటున్నాం. ఇంతలో మా అందరిలో ఎవరు మొనగాడు? దెయ్యాలంటే ఎవరికి భయం లేదు? అనే ప్రశ్న పుట్టింది. “మన అందరిలోకి నాకే భయం లేదు” అన్నాడు నాగేష్. “కాదు. నన్ను మించిన ధైర్యస్తుడు లేడు” అన్నాడు నాగరాజు. మిగతా జతగాళ్లు కూడా అదే మాట అన్నారు. దాంతో పోట్లాట మొదలయ్యింది. “అనవసరంగా ఎందుకు వాదించుకుంటారు. మనందరిలోనూ నాకున్నంత ధైర్యం ఎవరికీ లేదు. నాకన్నా ధైర్యం ఉన్నవాడు ఉంటే చెప్పుతో కొట్టించుకుంటా” అన్నాడు గట్టిగా. అందరూ నా వంక చూసారు. “నువ్వా! సరేలే, కూర్చో” అన్నాడు గిరిబాబు ఎగతాళిగా. “ఏం నమ్మకం లేదా? నువ్వొక్కడివే మొనగాడినని అనుకుంటున్నావా? ఇదిగో గిరీ. ఇప్పుడే చెప్తున్నా. నేను మీ అందరికంటే ధైర్యస్తుడ్ని. నీ కంటే కూడా” అన్నాను పౌరుషంగా. “ఉత్తుత్తి మాటలతో ఏం లాభమోయ్. దమ్ముంటే పందెం కాయి” అన్నాడు గిరిబాబు. “ఎందుకు కాయను. తప్పకుండా కాస్తాను. చెప్పు ఏమిటి నీ పందెం?” అన్నాడు. “ఊరికి దూరంగా ఓ స్మశానం ఉంది. బాగా చీకటి పడ్డాక అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఓ మోదుగ చెట్టు ఉందిగా. దాని పువ్వుని తెంపుకుని తిరిగి ఊళ్లోకి రావాలి. అంతే, ఆ పని చేయగలిగితే గెలిచినట్లు. అప్పుడు నేను అయిదు నెమలి గుడ్లు ఇచ్చుకుంటాను. నీ చేతిలో రెండు చెంప దెబ్బలు తింటాను. నువ్వు ఓడీపోతే నాకు అయిదు గుడ్లు ఇచ్చుకోవాలి. రెండు చెంపదెబ్బలు తినాలి. ఇదీ పందెం.” గిరిబాబు నన్ను రెచ్చగొట్టాడు. “అలాగే,నేను సిద్దమే” ఉద్రేకపడుతూ అన్నాను. కొంతసేపటికి చందమామ వెళ్ళిపోయాడు. అంతా చీకటిగా మారింది. “ఇక బయల్దేరు” అన్నాడు గిరిబాబు. నేను స్మశానం వేపు బయలుదేరాను. అది ఊరికి ఉత్తరం వేపున ఉంది. ఊరి నుంచి స్మశానం వరకు సన్నని కాలిబాట ఉంది. దానికి రెండు వైపులా గుబురుగా పొదలు. మంచివీ, పిచ్చివీ లెక్కలేనన్ని చెట్లు. ఊరికి దూరమవుతున్న కొద్దీ అవి మరింత గుబురుగా ఉంటాయి. మొదట్లో నాకు ఏమీ అనిపించలేదు. ధైర్యంగా ఉన్నాను. కొంత దూరం పోగానే విపరీతమైన భయం పుట్టింది. కీచురాళ్లు ఒకటే రొద పెడుతున్నాయి. “రావొద్దు, రావొద్దు, దెయ్యాలు పట్టుకుంటాయ్” అని చెబుతున్నట్టుగా అన్పించింది. ఉన్నట్టుండి ఆగిపోయాను. గాలి జోరుగా వీస్తోంది. ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకు మంటున్నాయి. చుక్కల వెలుతురు తప్ప అంతా చీకటి. అంత చీకటిలో నేను వంటరిగా ఎన్నడూ ఉండలేదు. గజగజా వణుకు పుట్టింది. ఇందాక చెప్పుకున్న దెయ్యాల కథలు గుర్తొచ్చాయి. దాంతో ఇంకా బేజారెత్తిపోయాను. ఈ చీకట్లోంచి ఏ దెయ్యమైనా వస్తుందేమో!…. ఇలాంటి ఆలోచనలతో వళ్ళంతా చెమటలు పట్టేసాయి. చెమటతో బట్టలన్నీ తడిసిపోయాయి. ఎందుకొచ్చిన పందెం. వెనక్కి తిరిగి వెళ్ళిపోతే? ఓడిపోయానని చెప్పేస్తే? ఏం జరుగుతుంది? ఏమీ మునిగిపోదుగా. మహా అయితే రెండు చెంపదెబ్బలు తినాలి. వెతికి వెతికి సంపాదించి ఐదు నెమలి గుడ్లు ఇవ్వాలి. అంతకు మించి ఇంకేం పోతుంది? ఆలోచిస్తూ నిలబడ్డాడు. వెనక్కి పారిపోవడమే మంచిదని అన్పించింది. ఇంతలో చెట్ల మధ్య అలికిడయింది. నా గుండె గుభేలుమంది. అయితే చెట్ల మధ్య నుంచి అరుణ వచ్చింది! అరుణ ఎవరో కాదు. గిరిబాబు చెల్లలే. అరుణకు, నాకు మంచి స్నేహం. అయిదారేళ్ళ నుంచి ఆ స్నేహం ఉంది. ఇలాంటి సమయంలో అరుణ కన్పించగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. “హమ్మయ్య, కన్పించావు. నేను నీ కోసమే వెతుకుతున్నాను” అంది అరుణ. “ఏమిటి సంగతి?” ఆతృతగా అడిగాను. “మా అన్న, వాడి స్నేహితులు నిన్ను ఏడిపించాలనుకుంటున్నారు. నీ కన్నా ముందే వాళ్లు స్మశానం చేరుకుంటారు. అక్కడ బాగా భయపెడతారు. నువ్వు జడుసుకుని లాగు తడుపుకుంటే చూడాలని వాళ్ళ కోరిక. అందుకే నా మాట విని వెనక్కి వెళ్ళిపో” అంది అరుణ. “అలా చేస్తే ఇంకేమన్నా ఉందా. అందరూ నవ్వుతారు. అదీగాక మీ అన్నతో పందెం కూడా కట్టాను. రెండు చెంపదెబ్బలు, ఐదు నెమలి గుడ్లు” అన్నాను బింకంగా. మనసులో మాత్రం వెనక్కి వెళ్ళిపోవాలనే ఉంది. “అయితే మా అన్న ముందు ఓడిపోవడం నీకు ఇష్టం లేదన్న మాట” అంది అరుణ. కొంచెంసేపు ఆలోచించింది. “సరే అలాగైతే నేను కూడా నీతో వస్తాను. నా దగ్గర టార్చిలైటు కూడా ఉంది” అంది. నాకు మహా సంతోషం కలిగింది. అరుణ కొన్ని మిణుగుర్లు పట్టి సీసాలో వేసింది. అదే తన దగ్గర ఉన్న టార్చిలైటు. సీసాలోని మిణుగుర్ల వల్ల కొద్ది పాటి వెలుతురు వస్తోంది. ఆ వెల్తురులో రెండడుగుల వరకు ఏముందో కన్పిస్తోంది. ఇద్దరం గోరీల వైపు నడవసాగాం. నేను అరుణ చెయ్యి పట్టుకున్నాను. అరుణ పెద్దదేమీ కాదు. చిన్న పిల్లే. నా కన్నా చిన్నదే. అయినా తను పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉందో. భయం గియం అన్నీ పోయాయి. దారంతా అరుణ మాట్లాడుతూనే ఉంది. క్షణం కూడా ఆగలేదు. తన అవ్వ నుంచి విన్న కథలు నాకు చెప్పింది. అదయ్యాక ఆకాశం వంక చూపింది. “అది అశ్వినీ నక్షత్రం… అది ధ్రువ నక్షత్రం….” అంటూ ఒకో చుక్క గురించీ చెప్పింది. ఇంకా చాలా కబుర్లు చెప్పింది. తన కబుర్ల పుణ్యమా అని నేను దెయ్యాల సంగతి పూర్తిగా మర్చిపోయాను. మాటల్లోనే స్మశానం చేరుకున్నాం. వాళ్ళు అడ్డదారిలో నీకంటే ముందే ఇక్కడికి వస్తారు. గేటు వెనుక దాక్కుంటారు. నువ్వు లోనికి వెళ్ళగానే నిన్ను భయపెడతారు. అందుకని మనం గేటులోంచి వెళ్లొద్దు. అక్కడ గోడ మధ్య ఓ తొర్ర ఉంది చూడు. దాన్లోంచి లోనికి పోదాం“ నా చెవిలో గుసగుసగా అంది అరుణ. తల ఊపాను. ఆ ప్రాంతమంతా కప్పలు, కీచురాళ్ళ చప్పుళ్ళతో నిండిపోయింది. కప్పలు ఒకటే బెకబెకలు. కప్పలే అక్కడి రాజులేమో అన్పించింది. రెండు మూడు పాములు మా కాళ్ళ ముందు నుంచి సర్రున వెళ్ళిపొయాయి. గోడ కన్నంలోంచి లోపలికి వెళ్ళాం. అక్కడ బోలెడన్ని గోరీలు ఉన్నాయి. మోదిగ చెట్టు కోసం ఎటువైపు వెళ్ళాలి?.. రెండేళ్ళ క్రితం ఇక్కడకు ఆడుకోడానికి వచ్చేవాళ్లం. ఒకనాడు నాకు ఓ మనిషి పుర్రె దొరికింది. దాన్ని చూసి బాగా భయపడిపోయాను. అప్పుడు బాగా జ్వరం కూడా వచ్చింది. తర్వాత మా పెద్దవాళ్లు ఇక్కడ ఆడొద్దని గట్టిగా చెప్పారు. అరుణ, నేను ఒక పెద్ద గోరీ ముందు నిలబడ్డాం. గోరీ మీద గడ్డి గాలికి ఊగుతోంది. ఎవరో చెయ్యి పెట్టి నా బుర్రను కెలికినట్టు అనిపించింది. మళ్ళీ భయం మొదలయింది. కథల్లోని దెయ్యాలు, పిశాచాలు బుర్రలో గిర్రుమని తిరిగాయి. వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కొయ్యలా నిలబడిపోయాను. ఎటు కదలాలన్నా భయమే. అయితే అరుణ మాత్రం మామూలుగానే ఉంది. తన ముఖంలో ఎలాంటి భయమూ లేదు. బహుశా నేను విన్న కథలు తను విని ఉండదు. ఆ దిక్కుమాలిన దెయ్యాల కథలు ఎందుకు విన్నానో ఏమో. “పద. అటుగా పోతే మోదుగ చెట్టు వస్తుంది” అంటూ అరుణ ముందుకు కదిలింది. నేను గబగబా అడుగులేసి అరుణ చెయ్యి పట్టుకున్నాను. “ఏంటి సంగతి? ఎందుకట్లా తడబడుతున్నావ్? దారి సరిగ్గా కన్పించడం లేదా?” అంది. వెంటనే నా భుజం మీద చేతులు వేసింది. టార్చితో దారి చూపించింది. నాకు మళ్ళీ కొంచెం కొంచెంగా ధైర్యం వచ్చింది. చివరకు ఎలాగైతేనేం మోదుగ చెట్టుని పట్టుకున్నాం. ఒక మోదుగ పువ్వు కోసి మళ్ళీ వెనక్కి బయలుదేరాం. గోడ కన్నంలోంచే స్మశానం బయటికి వచ్చాం. అరుణ చేతులు ఇంకా నా భుజం మీదే ఉన్నాయి. మేమిద్దరం ఇలా నడవడం వేరే పిల్లలు చూస్తే? ఏమనుకుంటారో? ఎన్నెన్ని ఆటలు పట్టిస్తారో? అయినా అలా నడవడం ఎంతో బాగుంది. నాకు చాలా ఇష్టంగా వుంది. అరుణ మీద నాకు చాలా అభిమానం కలిగింది. అరుణ గనుక రాకపోతే? ఈ రోజు నా గతి ఏమయ్యేది? వెనక్కి తిరిగి పారిపోయేవాడ్ని. అందరూ ఎగతాళి చేసేవారు. చెంపదెబ్బలు తినేవాడ్ని. రేపటి నుంచి నెమలి గుడ్లు వెతకడం కోసం తిరిగేవాడిని. ఎన్ని కష్టాలు! ఎన్ని అనమానాలు! అవన్నీ అరుణ వల్లేగా తప్పాయి. తిరిగి వచ్చేటపుడు అరుణ ఇంకా సరదాగా ఉంది. నాకంటే సంతోషంగా ఉంది. టార్చిలైటు ఊపుతూ నడిచింది. కోయవాళ్ళ పాటలేవో పాడింది. టార్చిలైటులో మిణుగురులను చూసి మరిన్ని మిణుగురులు దగ్గరికొచ్చాయి. మేం వాటిని పట్టి సీసాలో నింపేసాము. ఇప్పుడు ఊరి చివరకు వచ్చాం. నది ఒడ్డున ఒక దీపం కదులుతూ కనిపించింది. “అదిగో రంగయ్య మామ ఎండ్రకాయలు పడుతున్నాడు” అంది అరుణ. “రంగయ్య మామా!” అని బిగ్గరగా పిలిచింది. “ఓ” అన్నాడు రంగయ్య మామ. “నువ్వు వెళ్ళిపో వాసూ. నేను రంగయ్యమామతో ఉంటాను. ఎండ్రకాయలు ఎలా పడతాడో చూస్తాను. మామ పడవెక్కుతాను. పడవ నడిపేందుకు సాయపడతాను” అంది అరుణ. “అరుణా! రేపు నీకు మూడు నెమలి గుడ్లిస్తాను” అన్నాను. “నాకు పిట్టగుడ్లు గిట్ట గుడ్లు ఏమీ వద్దు” అంది అరుణ. తర్వాత నా చెవుల దగ్గర నోరు పెట్టింది. “నాకు నీతోనే స్నేహం. అర్థమయ్యిందా? నాకు వేరే ఎవరితోనూ స్నేహం లేదు. నీ ఒక్కడితోనే ఉంది” అంది. అనేసి నవ్వుతూ నది వైపుకి పరిగెత్తింది. నాకు చాలా సంతోషంగా అన్పించింది. ఊరివేపు కదిలాను. చల్లని గాలి వీస్తోంది. నా వళ్లు తేలిపోతున్నట్టుగా ఉంది. నడుస్తుంటే ఎగురుతున్నట్టుగా ఉంది. కీచురాళ్లు ఇందాకటి లాగే అరుస్తున్నాయి. అయితే ఇప్పుడు వాటి రొద పాటల్లా ఉంది. గిరిబాబు, జతగాళ్లని కలిసాను. గోరీల నుంచి తెంపుకొచ్చిన మోదుగ పువ్వుని గర్వంగా చూపించాను. వాళ్లు నమ్మలేకపోయారు. జాగ్రత్తగా చూసారు. గుచ్చి గుచ్చి చూసారు. చివరకు అది స్మశానం నుంచి తెచ్చిందే అని తేల్చుకున్నారు. అందరికీ మాటలు పడిపోయాయి. పక్కరోజు అందరం మళ్ళీ కలిసాం. అప్పుడు కూడా వెన్నెల కాస్తోంది. గిరిబాబు మాట నిలబెట్టుకున్నాడు. అన్నమాట ప్రకారం నాకు ఐదు నెమలి గుడ్లు ఇచ్చాడు. గుడ్లు యమ తాజాగా ఉన్నాయి. నాతో రెండు చెంపదెబ్బలు తిన్నాడు. మొదటిది మెల్లగా కొట్టాను. రెండోది మాత్రం కొంచెం గట్టిగానే కొట్టాను. “నేను అందరికంటే మొనగాడినని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావా?” అన్నాను. “ఒప్పుకోవడమా! హు! ధైర్యం ఉంటే మళ్ళీ పందెం కాయి. ఊరికే బడాయిలు పోవద్దు. నువ్వు నిజంగా మొనగాడివి కాదు. నిన్న ఎవరో నీకు తోడు వచ్చారు” అన్నాడు గిరిబాబు. “ఎ…ఎ… ఎవరు?” అన్నాను తడబడుతూ. నా ముఖం ఎర్రగా కందిపోయింది. “ఇంకెవరు. కచ్ఛితంగా అరుణే. నువ్వు, అదీ ఎప్పుడూ కలిసే ఆడుకుంటారు” అన్నారు జతగాళ్లు. “అబద్ధం” గట్టిగా అరిచాను. “కాదు. నీకూ, అరుణకు ఎంతో స్నేహం. ఆ సంగతి మాకు బాగా తెలుసు. నీ కోసం అది ఎక్కడికైనా వస్తుంది అన్నారు. సిగ్గుతో నాకు తల తిరిగిపోయింది. ఏడుపొచ్చేలా అన్పించింది. ఆ రోజుల్లో ఆడపిల్లతో స్నేహం అంటే తలవంపులు. ఆడపిల్లలతో మాకు స్నేహం, పగ ఏమీ ఉండకూడదు. అలా ఉంటే అందరూ ఎగతాళి చేస్తారు. “నేను అరుణతో ఎప్పుడు స్నేహం చేయ్యలేదు. నా దారి నాదే. తన దారి తనదే” అన్నాను. “నువ్వెన్ని చెప్పినా మేం నమ్మం” అన్నారు అంతా. “నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి?” ఏడుపు గొంతుతో అడిగాను. “నువ్వు అరుణను కొట్టాలి. చిన్న దెబ్బ కొట్టినా చాలు. అప్పుడు మాత్రమే మేం నమ్ముతాం” అన్నారు అంతా. గిరి కూడా అదే మాట అన్నాడు. నేను బిత్తరపోయాను. నోట్లోంచి మాట రాలేదు. అరుణని కొట్టాలా? ఏం పాపం చేసిందని? అరుణ నాకు ఎంతో మంచి నేస్తం. ఎవ్వరూ చేయనంత సాయం చేసింది. అలాంటి దాన్ని ఉత్తపుణ్యానికి కొట్టాలా?… మనసు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు నవ్వుతున్నారు. నన్ను అదే పనిగా ఎగతాళి చేస్తున్నారు. “నిన్న నీకు అరుణే తోడుగా వచ్చింది. అందులో అనుమానమే లేదు” అంటున్నారు. భరించలేకపోయాను. “సరే. కొడతాను” అన్నాను చివరికి. ఈ మాటలన్నందుకు నా మీద నాకే అసహ్యంగా వుంది. సిగ్గుతో చచ్చిపోతున్నాను. “నువ్వు అరుణను కొట్టలేవు. కావాలంటే మరోసారి పందెం కడతాను” అన్నాడు గిరిబాబు. నాకు పౌరుషం పొడుచుకొచ్చింది. “కొడతానో లేదో చూడండి” అన్నాను. పెద్ద పెద్ద అడుగులేస్తూ నడిచాను. ఆడపిల్లలు ఆడుకొనే చోటికి వెళ్ళాను. కొందరు చెమ్మచెక్క ఆడుతున్నారు. ఇంకొందరు పిచ్చుకగూళ్లు కట్టుకుంటున్నారు. కొందరు మిణుగురు పురుగుల వేటలో పడ్డారు. కొందరు కుంకుమ పురుగులు ఏరుతున్నారు. అరుణ తొక్కుడు బిళ్ల ఆడుతోంది. తన నుదట నుంచి చెమట బొట్లు బొట్లుగా జారుతోంది. అరుణను చూడగానే నా కాళ్లు ఆగిపోయాయి. కొట్టాలా వద్దా? ఆలోచిస్తూ ఉండిపోయాను. నా వెనుకనే వచ్చిన జతగాళ్లు కిసుక్కున నవ్వారు. అంతే. గబగబా అరుణ దగ్గరకు వెళ్ళాను. చేత్తో తన వీపు మీద ఒక్కటి చరిచాను. మెల్లగానే కొట్టాను. అయినా ఆ దెబ్బకే అరుణ పడిపోయింది. తన ముఖంలోకి చూసే ధైర్యం లేదు. అందుకే గబగబా వెనక్కి వచ్చేసాను. జతగాళ్లు పకపకా నవ్వారు. అయోమయంగా చూసాను. “నువ్వు ఆడపిల్లల మీద కూడా నీ ప్రతాపం చూపుతావన్న మాట. భలే మొనగాడివి” అన్నారు. నేను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమయ్యింది. ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం చాతకాని వాళ్ళు చేసే పని. నన్ను చాతకాని వాడ్ని చెయ్యాలని వాళ్ళ పంతం. అందుకే నన్ను రెచ్చగొట్టారు. ఆడపిల్లని కొట్టేలా చేసారు. తెలివి తక్కువ దద్దమ్మలా నేను వాళ్ళ బుట్టలో పడిపోయాను. “భలే భలే మొనగాడు. మా ఊరి మొనగాడు” అంతా ఎగతాళిగా పాడారు. సిగ్గుతో చితికిపోయాను. వెంటనే అక్కడి నుంచి చెట్లలోకి వెళ్ళిపోయాను. ఒక చెట్టు చాటున నిలబడి అరుణ వంక చూసాను. అరుణ ఏడుస్తోంది. ఇంకా నేల మీదే పడి ఉంది. ఆడపిల్లలంతా గుమిగూడారు. అరుణ లేచి నిలబడింది. కన్నీళ్లు తుడుచుకుంది. ఎవరితోనూ మాట్లాడకుండా తన ఇంటి వేపు పరుగుతీసింది. చాలాసేపు అక్కడే నిలబడిపోయాను. ఆడుకోవాలంటే కాళ్ళు చేతులూ కదలడం లేదు. మాట్లాడాలంటే నోరు పెగలడం లేదు. ఒంటరిగా ఉండిపోయాను. అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఎంతోచీకటి పడ్డాక నేను ఇంటికి పోయాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అరుణ నా ముందు నిలబడి ఏడుస్తున్నట్టుగా అన్పించింది. చేసిన వెధవ పనికి బాగా ఏడ్చాను. పక్కరోజు అరుణ ఎదురయ్యింది. అయితే నా వంక అసహ్యంగా చూసింది. నేనెవరో తెలీనట్టు వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడు ఎదురైనా అంతే. కోపంగా చూసేది. మొహం తిప్పుకొని వెళ్ళిపోయేది. అరుణకు అంతా చెప్పాలి. నన్ను మన్నించమని అడగాలి… అని చాలా సార్లు అనుకున్నారు. అయితే అరుణ కన్పించగానే కాళ్లు వణికేవి. కోపంగా చూడగానే మాటలు పడిపోయేవి. బాధతో కుమిలిపోయేవాడిని. నా మనసులో మాట మనసులోనే ఉండి పోయేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరుణ నాతో మాట్లాడలేదు. నన్ను అసలు పట్టించు కోనేలేదు. ఇప్పుడు అరుణ పెద్దదయింది. పద్దెనిమిదేళ్లు నిండాయి. పెళ్ళి చేసుకొని అత్తవారింటికి పోయింది. అప్పుడప్పుడు ఇక్కడకు వస్తుంది. వచ్చినప్పుడు అందరితో మాట్లాడుతుంది. నన్ను చూస్తే మాత్రం మొహం తిప్పేసుకుంటుంది. 'నేను ఎంత మంచివాడినైనా కావచ్చు. కాని నాకు మంచి చేసిన మనిషికి అపకారం చేసాను. అనవసరంగా అవమాన పరిచాను. నేను చేసిన ఈ పనికి ఎంత పెద్ద శిక్ష పడిందో' అనుకుంటాను.

రాక్షసుడి_తోట.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)