యాపిల్ గింజల మామయ్య
ఇది నిజంగా జరిగింది.
ఇప్పటికి రెండొందల ఏళ్ళ కిందటి మాట. అమెరికాలోని మసాచుసెట్స్ అనే ప్రాంతం. అందులో లియోమినిస్టర్ అనే ఊరు.1974 సెప్టెంబర్ 24న ఆ ఊళ్ళోనే జానీ మామయ్య పుట్టాడు. అసలు పేరు జానీ చాప్ మెన్. అయితే పెరిగి పెద్దయ్యాక అందరూ అతడ్ని ప్రేమగా 'యాపిల్ గింజల జానీ మామయ్యా“ అని పిలిచారు. ఆ పేరుతోనే అందరికీ అతను గుర్తుండిపోయాడు.
జానీ మామయ్య ఎక్కడికి పోయినా యాపిల్ గింజలను విత్తేవాడు. చలిని, ఎండనూ లెక్క చేయలేదు. పులులకు,పాములకు భయపడలేదు. పగలనక, రాత్రనక కష్టపడ్డాడు. మైళ్ళకు మైళ్ళు కాలినడకన తిరిగాడు. చెట్ల కింద, పుట్ల మధ్యన నిద్రపోయాడు.ఇంట్లో ఉండడం జానీకి అస్సలు ఇష్టముండేది కాదు. ఎప్పుడు చూసినా అడవుల్లోనే విహారం. రోజుల తరబడి, నెలల తరబడి,ఏళ్ళ తరబడి అడవుల్లో తిరిగాడు. అడుగడుగునా యాపిల్ గింజలు విత్తాడు. అందుకే… అందరూ అతడ్ని “యాపిల్ గింజల మామయ్య” అని పిలిచారు. ఒకనాడు ఎప్పటిలాగే జానీ మామయ్య గంటలకొద్దీ అడవిలో తిరిగాడు. అలసట తీర్చుకొనేండుకు ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు బాగా ఎండ కాస్తోంది. ఆకుల సందులోంచి అతని ఒంటి మీద వెచ్చని ఎండ పడుతోంది. నేల మీదున్న గడ్డిగాలికి అటూ ఇటూ ఊగుతోంది. జానీ మామయ్య తన సంచీలోంచి ఒక యాపిల్పండు తీసాడు. గింజలు ఊసిపడేస్తూ మెల్లగా తిన్నాడు. లేవబోయే ముందు చెల్లాచెదురుగా పడున్న గింజల వంక చూసాడు. బాగా ఆలోచించాడు. ఇలాంటి గింజలన్నింటినీ ఏరి నేలలో పాతితే! ఎన్నెన్ని యాపిల్ మొక్కలొస్తాయో! వాటికి ఎన్నెన్ని పళ్లు కాస్తాయో! దేశమంతా యాపిల్ చెట్లతో పచ్చగా తయారవుతుంది అనుకున్నాడు. జానీ మామయ్య అమెరికాలోని తూర్పు భాగంలో ఉండేవాడు. మంచిగా బతకాలని అప్పటికే చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలిన వారిలో కూడా అనేకమంది పడమటి వేపు వలసపోతున్నారు. పడమటి దేశంలో ఇళ్ళు లేవు. ఊళ్ళు లేవు. రోడ్లు గట్రా అంతకన్నా లేవు. అక్కడ ఆదివాసీలు(గిరిజనులు) మాత్రమే ఉండేవారు. వారిని 'రెడ్ ఇండియన్లూ 'అంటారు.
అక్కడక్కడా వారి గుడారాలు మాత్రమే కనిపించేవి. పడమటి ప్రాంతానికి పోవాలంటేఅ చాలా దూరం ప్రయాణించాలి. దారిలో దట్టమైన అడవులను దాటాలి. ఎన్నో ప్రమాదాలను కాచుకోవాలి. అందుకే వలసపోయే జనం గుర్రంబళ్ళలో సామాన్లు వేసుకొని, వాటి తలుపులను గట్టిగా మూసుకొని పడమటి వేపు ప్రయాణం కడుతున్నారు. తమకు తెలీని ఓ కొత్త ప్రాంతంలో చక్కగా బతకాలని వారు ఆశపడుతున్నారు. మన జానీ మామయ్య కూడా వారితో బయలుదేరాడు. అయితే అందరిలా తలుపు బిడాయించిన గుర్రంబండిలో కాదు. కాలినడకనే ప్రయాణం కట్టాడు. అంతే కాదు. ఒక కత్తి కాని, తుపాకి గాని వెంటబెట్టుకోలేదు. ఆ రోజుల్లో జనం ఎక్కడికి పోయినా తమ వెంటా ఏదో ఒక ఆయుధం తీసుకుపోయేవారు. బందిపోట్లు మీద పడితే ఎదిరించడానికి, పులుల్లాంటివి పైనపడితే కాపాడుకొనేందుకు అవి పనికొచ్చేవి. జానీ మామయ్య మాత్రం తన వీపుకి ఒక పెద్ద మూట కట్టుకున్నడు. ఆ మూటనిండా యాపిల్ గింజలే! పొడవాటి కాడ ఉండే గిన్నెను మీద బోర్లించుకున్నాడు. అదే అతని సరంజామా! జానీ మామయ్య తన ప్రయాణంలో దారి పొడుగునా, ప్రతి చోతా యాపిల్ గింజలను విత్తుతూ పోయాడు. దారిలో కనిపించే జనం చిన్నచిన్న యాపిల్ గింజల మూటాలను అతనికి ఇచ్చేవారు. మెల్లమెల్లగా, అందరూ అతడ్ని 'యాపిల్ గింజల మామయ్య' అని పిలవడం మొదలుపెట్టారు. మధ్యలో అప్పుడప్పుడూ జానీ మామయ్య కొన్ని వారాలు ఒకేచోట ఉండిపోతాడు. అక్కడే ఉండి అందరికీ సాయం చేస్తాడు. అందరూ కలిసి ముందుగా నేల చదును చెస్తారు. ఆ తర్వాత కట్టెదుంగలతో ఇళ్ళు కడతారు. అంతా అయ్యాక లెక్కలేనన్ని యాపిల్ మొక్కలు నాటుతారు. పనంతా అయిపోయాక జానీ మమయ్య మళ్ళీ ప్రయాణం కడతాడు. మరొకచోట ఇలాగే మరి కొందరికి సాయం చేస్తాడు. అయితే తన పాత మిత్రులను మర్చిపోడు. వారిని చూసి పోయేందుకు మళ్ళీ మళ్ళీ వెనక్కి వస్తాడు. జానీ మామయ్య అంటే అందరికీ ఇష్టం. ముఖ్యం గా పిల్లలకి అతనంటేఅ మరీ ఇష్టం. యాపిల్ గింజలను విత్తి విత్తి, అలసట తీర్చుకునేందుకు జానీ మామయ్య ఏ చెట్టు కిందో కూర్చుంటాడు. అప్పుడు పిల్లలంతా అతని చుట్టూ మూగుతారు. కథలు, జరిగిన సంగతులూ చెప్పమంటారు. మామయ్య చెప్పేది మహా ఇష్టంగా వింటారు. ఒకచోటి నుంచి మరో చోటికి జానీ మామయ్య ఒంటరిగానే పోతాడు. ఏ అడవిలోనో ఏ నది ఒడ్డునో నేలపై పడుకుంటాడు. అప్పుడు ఆకాశమే(ఇంటి) పైకప్పు. దారిలో అతనికి ఎలుగుబంట్లు, జింకలు, నక్కలు రకరకాల పక్షులు ఎదురవుతాయి. అన్నీ అతనికి నేస్తాలుగా మారిపోతాయి. ఒకనాడు మిట్టమధ్యాహ్నం అడవిలో కూచుని జానీ మామయ్య అన్నం తింటున్నాడు. ఇంతలో పెద్దగా చప్పుడయింది. పొదల్లో నుంచి ఓ మూడు బుల్లి ఎలుగుబంట్లు చెంగు చెంగున గెంతులేస్తూ వచ్చాయి. మరికొంత సేపటికి వాటి తల్లి కూడా బయటికొచ్చింది. బుజ్జి ఎలుగుబంట్లు జానీ మామయ్యతో ఆడుకుంటున్నాయి. తల్లి ఎలుగుబంటి నమ్మలేకపోయింది. గుడ్లు మిటకరించి జానీ మామయ్యను చూసింది. చాలాసేపు అలా చూసాక- అతని వల్ల తన పిల్లలకు ఎలాంటి అపకారం జరగదని దానికి నమ్మకం కలిగింది. ఇంకేం. తన పిల్లల్లాగే అది కూడా జానీకి నేస్తంగా మారిపోయింది. అడవుల్లో తిరిగేటప్పుడు జానీకి దారిలో చాలా మంది 'రెడ్ ఇండియన్లు' కలుస్తారు. వారతడ్ని ఎంతో ప్రేమగా చూస్తారు. మామయ్య వారికి రకరకాల గింజలు, మూలికలు ఇస్తాడు. రెడ్ ఇండియన్లు వాటితో మందులు చేసుకుంటారు. మామూలుగా తెల్లవాళ్లంటే రెడ్ ఇండియన్లకు ఒళ్ళు మంట. రెడ్ ఇండియన్లు మొదటి నుంచి అక్కడే ఉంటున్నారు. తెల్లవాళ్లు తర్వాత వచ్చారు. రెడ్ ఇండియన్ల భూములను, పొలాలను ఆక్రమించుకున్నారు. అందుకే తెల్లవాళ్లంటే వారికి కోపం. జానీమామయ్య కూడా తెల్లవాడే. అయినా అతనంటే వారికి ఇష్టం. జానీ మామయ్య వారికి ఎంతో ఆప్తుడిలా అనిపిస్తాడు. మనుషులు ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం జానీకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. జగడాలు మాని, శాంతంగా ఉండమని తెల్లవారికి రెడ్ ఇండియన్లకు నచ్చజెబుతాడు. మనుషులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని ప్రేమగా బతకాలని జానీ మామయ్యకు ఎంతో కోరిక. జానీ మామయ్య పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. అతనెక్కడికి వెళ్లినా అక్కడ యాపిల్ గింజలు విత్తుతాడు. గింజలు అయిపోయినా, ఇంకా కావలసి వచ్చినా యాపిల్ రసం తీసే ఫేక్టరీకి పోతాడు. సంచుల్లో కూరి కూరి గింజలు తీసుకొస్తాడు. మెల్ల మెల్లగా అందరూ యాపిల్ గింజలు జమ చేయడం మొదలుపెట్టారు. జానీ మామయ్య కనిపించగానే వాటిని అతనికి అందించసాగారు. ఇలా ఎన్నో ఏళ్లు గడిచాయి. జానీ మామయ్య ఇప్పటికీ దేశాటన చేస్తున్నాడు. ఎప్పటిలాగే యాపిల్ గింజలను విత్తుతున్నాడు. అప్పుడప్పుడు పాత నేస్తాలను కలుస్తాడు. అక్కడ రెమ్మ రెమ్మకి పళ్లు వేలాడుతూ యాపిల్ చెట్లు కనిపిస్తాయి. అవన్నీ ఒకప్పుడు జానీ నాటినవే! జానీకి చెప్పలేనంత సంతోషం కల్గుతుంది. ఆనందంతో పులకించిపోతాడు.
అక్కడ చలికాలంలో మంచు బాగా కురుస్తుంది. చెట్లు, రోడ్లు, ఇళ్లు- అన్నిటి మీద ఇంతెత్తున తెల్లగా మంచు పేరుకుంటుంది. వేసవి రాగానే అంతా మారిపోతుంది. ఒక ఏడాది అనుకోనిది జరిగింది. చలికాలం పోయినా మంచు మాత్రం పోలేదు. నేల నేలంతా మంచుగడ్డలతో నిండిపోయింది. ఎటు చూసినా మంచు ముక్కలే. చెట్లనీ బోసిగా ఉన్నాయి. కొత్తగా ఒక్క చిగురైనా రాలేదు. జానీకి బెంగ పట్టుకుంది.
చలికి చెట్లన్నీ చనిపోతాయేమో! మళ్ళీ పచ్చగా అవుతాయో కావో! బెంగతో జానీకి తిండి సహించలేదు. కంటికి నిద్ర కూడా పట్టలేదు.
ఒకనాడు జానీ మామయ్య ఒక యాపిల్ చెట్ల తోటలో విచారంగా నడుస్తున్నాడు. అంతలోనే ఉన్నట్టుండి దబ్బున నేలపై పడిపోయాడు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. పాపం కొన్ని గంటల పాటు మంచు గడ్డల్లో అలాగే పడి ఉండుపోయాడు. ఒక గిరిజన మహిళ అటుగా పోతూ జానీని చాసిండి. వెంటా ఆమె కొడుకు కూడా ఉన్నాడు. వాడు జానీ మామయ్యను చూడగానే సాయం కోసం పరిగెత్తాడు. గూడెంలోని జనం వచ్చారు. జానీని మోసుకుంటూ ఊరికి తీసికెళ్లారు. జానీ మామయ్యకు విపరీతమైన జ్వరం. లేవలేకుండా ఉన్నాడు. చాలా రోజుల దాకా అది తగ్గలేదు. రెడ్ ఇండియన్లు అతడ్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. మందులిచ్చారు. మనసు పెట్టి సేవలు చేసారు. రాత్రి పగలు కనిపెట్టుకొని ఉన్నారు. అలా ఎన్నో రోజులు గడిచాయి. జానీ కోలుకున్నాడు. మెల్లగా తన కళ్ళు తెరిచాడు. అందరినీ చూసి ప్రేమగా నవ్వాడు. తన ప్రాణాలను వారే కాపాడారు. ఆ సంగతి అతనికి తెలుసు. అప్పటికి మంచు కూడా కరిగిపోయింది. వెచ్చని ఎండ ఎంతో చక్కగా కాస్తోంది. చెట్ల పైన గడ్డకట్టిన మంచు కరిగిపోయింది. వసంతకాలం రానే వచ్చింది. జానీ మామయ్య సంతోషం ఇంతా అంతా కాదు. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పటిలాగే యాపిల్ గింజల మూటకట్టుకొని మళ్ళీ బయల్దేరాడు.
అయితే-తన పాత నేస్తాలను అతను ఎన్నడూ మరచిపోలేదు. వారిని కలిసేందుకు మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు.
యాపిల్ గింజల జానీ మామయ్య ఎన్నో ఏళ్లు బతికాడు. ఎందరెందరికో దారి చూపాడు. అడుగు పెట్టిన ప్రతిచోట యాపిల్ గింజలను విత్తాడు. ఒకటి కాదు రెండు కాదు లక్షల మొక్కలకు ప్రాణం పోసాడు. జానీ మామయ్య నాటిన చెట్లలో అనేకం ఇప్పటికీ బతికే ఉన్నాయి. వాటి మానులు బాగా ముదురుపట్టాయి. అయినా అవి పూలతో పళ్ళతో నిండుగా నవ్వుతున్నాయి. చెట్లు పెంచితే ఎంత లాభం! అందరూ చెట్లు నాటాలి. అవి పెరిగి పెద్దవై లోకమంతటికీ మేలు చేయాలి!! జానీ మామయ్య మనకు అదే చేసి చూపించాడు.