User Tools

Site Tools


మన_సావాసగాళ్ళు
				మన సావాసగాళ్ళు					
					పాములు

చూడండి!ఈ పాము కుబుసం ఎలా విడిచి పెడుతోందో. పాము బతికినంత కాలం పెరుగుతూనే వుంటుంది. అపుడు దాని తోలు పెరిగిన శరీరానికి చాలదు. అందుకే పాత తోలు కుబుసంగా విడిపోతుంది. పాములు పాలు తాగవు.నాగుపాము పగపడుతుంది అంటారు. అది నిజంకాదు. దానికి అంత తెలివిలేదు. పాములు 236రకాలు. వాటిలో చంపేంత విషం గలవి నాలుగే. చాలా పాములు మనను ఏమీ చేయలేవు. వాటి జోలికి పోకుంటే ఏ పామూ కరవదు. పాములు ఎలుకలను తింటాయి. అది మనకు ఎంతో మేలు. పాము విషం, పాము కాటుకు మందుగా ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా పాములను చంప గూడదు. కొందరికి పాములే జీవనాధారం. కొందరు పాములును తింటారు. కోడి కూరంత రుచిగా వుంటుందట.

				ఎంతో మంచి పురుగులు

ఈ కాలంలో పురుగు మందులు వాడకం బాగా పెరిగింది. దానికి తగట్టు తెగుళ్ళు కూడా పెరిగాయి. ఇప్పుడు చీడ పురుగుమందులను తినే రోజులు వచ్చాయి. ఇలా ఎందుకు జరుగుతోంది. తూనీగలు, చీమలు, కందిరీగలు, సాలెపురుగులు వంటివి పైరు మీద ఉంటాయి. ఇవి చాలా చీడపురుగులను తింటాయి. ఈ సంగతి మనకు తెలియదు. మనం కొట్టే పురుగు మందులకు ఇవి కూడా చచ్చపోతాయి. దీనిని మనం పట్టించుకోవడం లేదు. అక్షింత పురుగులు దోమలను, పేను బంకనూ తింటాయి. సాలె పురుగు వరికి సావాసగాడు. ఇది రక రకాల పురుగులను తింటుంది. తూనీగలు నీళ్ళలో ఉండే పురుగులను, దోమలను తింటాయి. పెంకు పురుగు చాలా చీడ పురుగలను తింటుంది. ఇది సెనెగ పచ్చ పురుగు గుడ్డును గూడా మింగుతుంది. ఇలా మనకు మంచి చేసేవి ఏవో మనం గమనించాలి. వాటిని కాపాడాలి. పురుగు మందులు లేకుండా వీటితోనే తెగుళ్ళు అరికట్టే రోజులు రావాలి.

					గబ్బిలం

గబ్బిలం వింతజీవి. దీనిని మనం పక్షి అనుకొంటాం. అయితే ఇది నిజంగాదు. గబ్బిలం ఒక జంతువు. ఇది కూనలను కంటుంది. వాటిని పాలిచ్చి పెంచుతుంది. జంతువులలో ఎగిరేది గబ్బిలం ఒకటే! గబ్బిలం నడవలేదు. నిలబడలేదు. దాని కాళ్ళకు ఆ బలం లేదు. ఎంత దూరమయినా ఎగిరిపోవలసిందే? ఆగవలసి నపుడు ఏమి చేయాలి? అందుకే వేలాడుతుంది. గబ్బిలం చీకటిలో అడవిలో కూడా ఎగురుతుంది. ఎంతో వేగంగా ఎగురుతుంది. దేనికీ తగలకుండా ఎగురుతుంది. ఈ విధంగా ఏ పక్షీ ఎగరలేదు. పాడుబడిన ఇళ్ళలో గబ్బిలాలు చేరతాయి. గబ్బిలాలు చేరితే ఇళ్ళు పాడుబడతాయి అంటారు. ఇందులో నిజం లేనేలేదు. పైగా గబ్బిలం ఏ పురుగునయినా తింటుంది. మనకు సాయపడుతుంది. ఒక గబ్బిలం రోజుకు రెండు వేల దోమలను తింటుందట. కొందరు గబ్బిలాల పెంపకం గూడా మొదలు పెట్టారట.

				మట్టి పాములు

మట్టి పాములు అమాయకమైనవి. ఆపాయం లేనివి. వీటిని మచ్చిక చేసుకోవచ్చు. పొలాలలో వదిలి పెట్టవచ్చు. మూడు జతల మట్టి పాములుంటే చాలు. మూడేళ్ళలో ఒక ఎకరంలోని మొత్తం ఎలుకలను చంపుతాయి. చీడ పురుగులను తింటాయి మిగిలిన పాములైతే పొలం విడిచి ఎంత దూరమైనా పోతాయి. మట్టి పాములు అలా కాదు. మనం విడిచి పెట్టిన పొలంలోనే ఉంటాయి. రైతుకు మట్టి పాములు మంచి సావాసగాళ్ళు. వీటిని అవసరంగా చంపగూడదు.

				కప్పలు

కప్పలు మనకు ఎంతో సావాసగాళ్ళు. అవి రకరకాల చీడ పురుగులను తింటాయి. ఈగలను, దోమలను తింటాయి. నీళ్ళలో ఉండే దోమగుడ్డును కూడా తింటాయి. వానాకాలంలో కప్పలు జతకడతాయి. అందుకే మగ కప్పలు బెకబెక మంటాయి. కొందరు కప్పలు తింటారు. కొందరు అనవసరంగా వాటిని చంపుతారు. పురుగు మందులు కూడా కప్పలు తగ్గిపోవడానికి కారణం. ఇలాగే తగ్గిపోతే దోమలు, పురుగులు పెరిగిపోతాయి. మనకు చెప్పలేనంత కీడు కలుగుతుంది.

				పేడ పురుగులు

ఒక దేశంలో పశువులు, జంతువులు పెరిగి పోయాయట. దేశంమంతా పేడమయం అయిపొయిందట. మరొక దేశం నుంచి విమానాలలో పేడ పురుగులు తెప్పించారట. అవి పేడనంతా తినేసి దేశమంతా సుద్దం చేశాయట. ఇది కధ కాదు. పాతికేళ్ళ కింద జరిగిన సంగతి. చూడండి! పేడ పురుగులు ఎంత పని చేసాయో! పేడ పురుగులు మలం తింటాయి. ముద్దలు చేసుకుని బొరియలలోకి తీసుకొని పోతాయి. ముద్ద ముద్దకు ఒక గుడ్డు వంతున పెడతాయి. అవి ఆ మలంలోనే పెరుగుతాయి. పెరగడానికి ఆ ముద్దలోని పేడను తింటాయి. పెద్దవైనాక బయట పడతాయి. బొరియలలో చేరిన పేడ ముద్దలు మట్టిలో కలిసిపోతాయి. నేల సారవంతమవుతుంది. అంటే మనకు రెండు లాభాలు. ఈ పేడ పురుగులు రకాలు. ఒక రకం పురుగులు ఏ జంతువు మలమైనా తింటాయి. ఒక రకం పురుగులు ఒక జంతువు పేడనే తింటాయి. ఏవైనా కానీండి. పేడకడి నేలమీద పడినాక నిమిషాలలో మాయం చేయగలవు.

మన_సావాసగాళ్ళు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)