User Tools

Site Tools


పకపకలు
              		అవ్వకు తాగిస్తా

చిట్టి వాళ్ళమ్మ బుజ్జిగాడికి మందు తాగిస్తోంది.బుజ్జిగాడు చిట్టి తమ్ముడు. “అమ్మా!తమ్ముడికి అది ఎందుకు తాగిస్తున్నావే?”అని అడిగింది చిట్టి.“తమ్ముడికి నోట్లో పళ్ళు లేవు కదమ్మా.ఇది తాగిస్తే వాడికి పళ్ళొస్తాయి.”అంది అమ్మ. “నాకు కూడా కొంచెం మందివ్వమ్మా.అవ్వకు తాగిపిస్తాను.”అందిచిట్టి.“అవ్వకు దేనికే?” ఆశ్చర్యంగా అంది అమ్మ. “నీకు తెలీదా ఏం?అవ్వకు కూడా పళ్ళు లేవుగా!”అంది చిట్టి.

            			 హిందీ మొగుడు

కాంతమ్మ ఒక హిందీవాడిని పెళ్ళి చేసుకుంది.అతనికి తెలుగు రాదు.అది కాంతమ్మకు ఎంతగానో ఉపయోగపడింది.మొగుడి మీద ఎప్పుడు కోపం వచ్చినా తెలుగులో తిట్టేది.మొగిడికి తెలుగు రాదు!దాంతో అతనికి ఏమీ అర్థమయ్యేది కాదు. ఒకరోజు కాంతమ్మ మొగుడ్ని “గాడిద” అంది. “గాడిద అంటే ఏమిటి?” అని (హిందీలో) అడిగాడు మొగుడు. “గాడిద అంటే లావుగా,పుష్టిగా ఉండడం.” అంది కాంతమ్మ. “అలాగా!” అన్నాడు మొగుడు. ఇంకొకరోజు తన మొగుడ్ని “గుడ్లగూబ” అని తిట్టింది కాంతమ్మ. “గుడ్లగూబ” అంటే ఏమిటి?“ అని అడిగాడు మొగుడు. “గుడ్లగూబ అంటే సన్నగా,పీలగా ఉండడం.” అంది కాంతమ్మ. “ఓహో!” అన్నాడు మొగుడు. ఒకనాడు కాంతమ్మ నాన్న మంచం పట్టాడు. “మా నాన్న జబ్బు పడ్డాడు.పలకరించి వద్దాం పద” అని మొగుడితో అంది కాంతమ్మ. ఇద్దరూ వాళ్ళ ఊరికి వెళ్ళారు. కాంతమ్మ నాన్న బాగా జబ్బు పడ్డాడు.సగానికి సగం చిక్కిపోయాడు.సన్నగా,పుల్లలా తయారయ్యాడు.ఒకప్పుడు లావుగా బాగుండేవాడు. “అయ్యో మామయ్య గాడిదలా ఉండేవాడు,గుడ్లగూబలా అయిపోయ్యాడు” అన్నాడు కాంతమ్మ మొగుడు. కాంతమ్మ మొహం మీద నెత్తురుంటే ఒట్టు.

          		  డబ్బులు కావాలిగా!

నారాయణ వట్టి పిసినారి.ఒకనాడు పొద్దున్నే కొడుకుని పట్టుకొని చావగొడుతున్నాడు.అటుగా వెళ్తున్న కామయ్య అది చూచాడు. “ఏం జరిగింది నారాయణా?పొద్దున్నే ఆ చంటాడ్ని ఎందుకు చావగొడుతున్నావు?” అని అడిగాడు. “వీడు వట్టి దద్దమ్మ అయిపోయాడు.మెట్లు ఎక్కే టప్పుడు రెండేసి మెట్లు ఒక్క సారి ఎక్కమని చెప్పాను.అలా చేస్తే చెప్పులు తక్కువ అరుగుతాయి.అయినా ఈ గాడిద ఏం చేశాడో తెలుసా? మూడేసి మెట్లు ఒక్కేసారి ఎక్కాడు.” అన్నాడు నారాయణ చిందులేస్తూ. “అది మరీ మంచిదిగా!నీ కోడుకు నీకన్నా తెలివైనవాడు.నువ్వు ఒక్కొక్క మెట్టే వదలమన్నావు.వాడు రెండేసి మెట్ల చొప్పున వదిలేశాడు.దాని వల్ల చెప్పులు ఇంకా తక్కువగా అరుగుతాయి.అయినా వాడిని ఎందుకు కొడుతున్నావ్?” అన్నాడు కామయ్య. “నిజమేనయ్యా! వాడి చెప్పులు తక్కువగానే అరిగాయి. అయినా మూడేసి మెట్లు ఎక్కే తొందరలో వాడి ప్యాంటు చిరిగి పోయింది.దాన్ని కుట్టించడానికి డబ్బులు కావాలా వద్దా?” అంటూ గయ్యిమన్నాడు నారాయణ.

           			 ఉడికిన గుడ్లు

రాము కోళ్ళఫారంలో పని చేస్తున్నాడు.వాడి చేతుల్లో రోజు కొన్ని గుడ్లు పగిలిపోయేవి.అందువల్ల యజమాని చెతుల్లో దెబ్బలు తినేవాడు. ఒకనాడు వాడికి ఒక కొత్త ఆలోచన తట్టింది.పరిగెత్తుతూ యజమాని దగ్గరకు వెళ్ళాడు. “అయ్యా!రేపటి నుంచి గుడ్లు పగిలిపోవు.రేపు పొద్దున్నే వచ్చి మీరు చూసుకోవచ్చు.” అన్నాడు. యజమాని సంతోషించాడు.పక్కరోజు పొద్దున్నే కోళ్ళ ఫారానికి వచ్చాడు.అక్కడ రాము విచారంగా కూచున్నాడు.నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. “ఏరా రామూ!ఏం జరిగింది? మళ్ళీ గుడ్లు పగలగొట్టావా?” అని అడిగాడు యజమాని. “ఏం చెప్పమంటావు దొరా! అంతా గందరగోళమయ్యింది.పడిన కష్టమంతా బూడిదయ్యింది.రాత్రంతా నీళ్ళు కాగబెట్టాను.పొద్దున్నే మరిగిన నీళ్ళతో కోళ్ళఫారం నింపాను.అట్లా చేస్తే కోళ్ళు ఉడికిన గుడ్లు పెడతాయని అనుకున్నాను.ఉడికిన గుడ్లైతే పగలవు.అయితే ఇలా అయిపోయింది” అన్నాడు రాము విచారంగా. కోళ్ళన్నీ చచ్చిపడి ఉన్నాయి! యజమాని తలతిరిగి పడిపోయాడు!

              		 మానేస్తాను

దానయ్య సిగిరెట్లు బాగా తాగుతాడు.అతని భార్యకు ఆ పొగ గిట్టేది కాదు.ఇల్లంతా కంపు కంపు.మానెయ్యమని దానయ్యకు చెప్పేది.అతను వినేవాడు కాదు.దాంతో ఇద్దరికీ పోట్లాటలు అయ్యేవి. ఒకనాడు దానయ్య భార్య పేపరు చదువుతోంది.అందులో సిగిరెట్ల గురించి రాశారు. “పేపర్లో ఏం రాశారో చూశావా?సిగిరెట్లు తాగడం మంచిది కాదు.ఊపిరితిత్తులు పాడవుతాయి.గుండెపోటు,క్యాన్సరు వస్తాయి.ఇంకా చాలా రోగాలు వస్తాయి-అని రాశారు.” అంది దానయ్య భార్య. “పేపర్లో నిజంగా అలా రాశారా?” అన్నాడు దానయ్య. “ఇదిగో చూడు.” అంది భార్య. “అలాగా.రేపే మానేస్తాను.” అన్నాడు దానయ్య. “నిజంగానా!నువ్వు సిగిరెట్లు తాగడం మానేస్తావా?” సంతోషంగా అంది భార్య. “ఎహే!సిగిరెట్లు మానతానని ఎవరన్నారు.పేపర్ తెప్పించడం మానేస్తాను” అన్నాడు దానయ్య. “ఆ(!” భార్య నిలువు గుడ్లేసింది.

              		 నష్టం

భూమయ్య గీసి గీసి ఖర్చు పెడతాడు.ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు. ఒకసారి నెయ్యి ధర తగ్గిపోయింది.ఇంతకు ముందు వంద రూపాయలుండేది.ఇప్పుడు ఎనభై రూపాయలయ్యింది.అందరికీ సంతోషం కలిగింది.భూమయ్యకు మాత్రం విచారం పట్టుకుంది. “ఏం జరిగింది భూమయ్యా? ఎందుకు దిగులుగా ఉంటున్నావు?” అని అడిగాడు శరభయ్య. “నెయ్యి ధర తగ్గిపోయింది.నువ్వు వినలేదా?” అన్నాడు భూమయ్య. “మంచిదేగా!దానికి దిగులు పడడం దేనికి?సంతోషించాలి గాని.” అన్నాడు శరభయ్య. “అయ్యో!నేను నెయ్యి కొననని నీకు తెలుసు కదయ్యా.దాని వల్ల ప్రతి నెల నాకు వంద రూపాయలు మిగిలేవి.ఇప్పుడు ఎనభై రూపాయలే మిగులుతాయి.నెలకు ఇరవై రూపాయలు నష్టం!” అంటూ గుండెలు బాదుకున్నాడు భూమయ్య.

         			 చంద్రుడు-సూర్యుడు

“ఓరే సోమూ!మనకు చంద్రుడి వల్ల ఎక్కువ లాభమా?సూర్యుడి వల్ల ఎక్కువ లాభమా అని అడిగాడు టీచరు. “చంద్రుడి వల్ల సార్.” అన్నాడు సోము. “అదెట్లారా?” “చంద్రుడు రాత్రిపూట చీకట్లో వెన్నెల ఇస్తాడు.చంద్రుడు రాకపోతే అంతా చీకటే.సూర్యుడిదేముంది!పగటి పూట వస్తాడు. పగలు అంతా వెలుతురే ఉంటుంది.అప్పుడు సూర్యుడు వచ్చినా ఒకటే.రాకపోయినా ఒకటే.” అన్నాడు సోము.

            			 అడుక్కోవచ్చుగా

కోటయ్య లక్షాధికారి.అయినా పిల్లికి బిచ్చం పెట్టడు.ఒకనాడు ఓ బిక్షగాడు వచ్చాడు. “అయ్యా!చలికి తట్టుకోలేకపోతున్నాను.ఒక పాత లుంగీ ఇప్పించండి.” అన్నాడు బిక్షగాడు. “లుంగీ ఎక్కడి నుంచి తేను? నాకే లుంగీ లేదు.ఆరు నెలల నుంచి నేను లుంగీ లేకుండానే ఉన్నాను.” అన్నాడు కోటయ్య. “అయితే ఒక రూపాయి దానం చెయ్యండి.టీ తాగుతాను.” అన్నాడు బిక్షగాడు. “రూపాయా!రూపాయలు ఎక్కడి నుంచి తేను? నా ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు.” అన్నాడు కోటయ్య. “పోనీయండి అయ్యా.ఇంత అన్నం ఉంటే పెట్టండి.బాగా ఆకలిగా ఉంది.” అన్నాడు బిక్షగాడు. “ఏమిటీ!నేను అన్నం పెట్టాలా? నాకే తిండి లేదు.రెండు రోజులనుంచి నేను, నా పెళ్ళాంబిడ్డలు పస్తులున్నాము.” రుసరుసలాడాడు కోటయ్య. బిక్షగాడికి కోపం వచ్చింది. “అలాగైతే ఇంట్లో కూచుని ఏం చేస్తున్నావయ్యా! చిప్ప పట్టుకొని నాతో పాటూ వచ్చి అడుక్కోవచ్చుగా!” అన్నాడు.

				సినిమా ఏనుగు

ఒక సినిమా హాలులో 'అడవి ఏనుగు' అనే సినిమా ఆడుతోంది.సినిమాలో ఏనుగుకి పిచ్చెక్కెంది.పిచ్చిదై అడ్డదిడ్డంగా పరిగెడుతోంది. అది చూసి యాదయ్య హాలు బయటకు పరిగెత్తాడు.గేటు కీపరు అతడ్ని చూశాడు. “ఏమిటయ్యా అప్పుడే పోతున్నావు!సినిమా ఇప్పుడేగా మొదలయ్యింది!” అన్నాడు. “నీకు తెలీదా ఏమ్? ఏనుగుకి పిచ్చెక్కింది.అది ఒక్క అడుగు ముందుకు వేసినా - నా పని అయిపోతుంది.నుగ్గునుగ్గు అయిపోతాను.” అన్నాడు యాదయ్య. గేటు కీపరుకి నవ్వు వచ్చింది. “మరీ అమాయకుడిలా ఉన్నావే! అది సినిమా ఏనుగు.తెరగుడ్డ దాని బయటకి ఎలా వస్తుంది?!” అన్నాడు నవ్వుతూ. “అది సినిమా ఏనుగని నీకు,నాకు తెలుసు.ఏనుక్కి ఆ సంగతి ఏం తెలుసు?” అంటూ యాదయ్య పరిగెత్తాడు.

నాకు పిల్లలు లేరు పానకాలరావుకి ఒక మేడ ఉంది. మీది భాగంలో తను ఉంటున్నాడు.కింది భాగాన్ని అద్దెకు ఇచ్చాడు.అద్దెకు ఉన్నవాళ్ళకి నలుగురు పిల్లలు.వాళ్ళు బాగా అల్లరి చేసేవాళ్ళు.పానకాలరావు ఆ గోలని భరించలేకపోయాడు.వాళ్ళతో ఇల్లు ఖాళీ చేయించాడు.ఈసారి పిల్లలు లేని వాళ్ళకే ఇల్లు అద్దెకు ఇవ్వాలి అని తీర్మానించుకున్నాడు.అలా అని గోడ మీద రాయించాడు. ఒకరోజు ఎనిమిదేళ్ళ పిల్లవాడు తలుపు కొట్టాడు. “నాకు మీ ఇల్లు అద్దెకిస్తారా?నాకు పిల్లలు లేరు.ఒక అమ్మ,ఒక నాన్న,ముగ్గురు అక్కలు,ముగ్గురు అన్నలు మాత్రమే ఉన్నారు.” అన్నాడు కుర్రవాడు.

పకపకలు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)