User Tools

Site Tools


నా_ముద్దుల_కుక్క
					మసాలా వడలు
        నాకు మసాలా వడలంటే ఇష్టం. ఒకరోజు మా అమ్మ ఆరు మసాలా వడలు చేసింది. నేనూ మా అక్కా తినడానికి కూచున్నాం. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. గీత వచ్చింది. ఆమె అక్క స్నేహితురాలు.
        "రామ్మా! వచ్చి వడలు తినమ్మా" అంటూ అమ్మ గీతను పిలిచింది. గీత వడలు తినడానికి కూచుంది.
        ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. ఈసారి నా స్నేహితురాలు సీత వచ్చింది.
        "రామ్మా! వచ్చి వడలు తినమ్మా" అని అమ్మ పిలిచింది. సీత వడలు తినడానికి కూచుంది. ఇప్పుడు నలుగురం అయ్యాం. ఆరు మసాలా వడలే ఉన్నాయి.
         ఇంతలో ఎవరో తలపు తట్టారు. అమ్మ తలుపు తీసింది. వసంత, మీనా వచ్చారు. వాళ్ళు పక్కింటి పిల్లలు.
         "రండమ్మా! వచ్చి వడలు తినండి" అని అమ్మ పిలిచింది. వసంత, మీనా వడలు తినడానికి కూచున్నారు. మొత్తం ఆరుమందిమి అయినాము. ఆరు మసాలా వడలే ఉన్నాయి. తలా ఒకటి పెట్టుకున్నాము.
         నాకు వడల మీద ఆశపోయింది. ఏడుపు వచ్చింది. ఆ ఒకటి కూడా తినాలనిపించలేదు.
         ఇంతలో ఎవరో తలుపు తట్టారు. మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. అమ్మ తలుపు తీసింది. ఆ వచ్చింది నాయనమ్మ. చేతిలో పెద్ద స్ట్టీలు టిఫిను ఉంది.
         "మసాలా వడలు చేసుకుని తెచ్చా" అనింది నాయనమ్మ.
          నాకు నవ్వు వచ్చింది. టిఫిను మూత తీసి చూశాను. చాలా మసాలా వడలు ఉన్నాయి. ఇప్పుడు నాకు మసాలా వడలంటే ఇష్ట్టం వేసింది. నోరూరింది. నాయనమ్మను ముద్దు పెట్టుకొన్నాను. అందరం కడుపు నిండా తిన్నాం.
				 పొడుగు - పొట్టి
         రంగయ్య పొడుగ్గా ఉంటాడు. వెంకయ్య పొట్టిగా వుంటాడు. ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ఒకే ఇంట్ల్లొ వుంటారు.
         రంగయ్య పెద్ద సైకిల్ తొక్కుతాడు. వెంకయ్య చిన్న సైకిల్ తొక్కుతాడు.
         ఒక రోజు రంగయ్య వెంకయ్య విందుకు వెళ్ళారు. జనంలో ఇద్దరూ విడిపోయారు. కొంచెం సేపు తర్వాత ఎవరికి వాళ్ళు ఇల్లు చేరుకొన్నారు.
         "రంగన్నా! నువ్వు బాగా భోంచేశావా?" అని వెంకయ్య అడిగాడు.
          "భోజనమే చేయలేదు వెంకన్నా. కుర్చీ చాలా పొట్టిగా ఉంది. నేను కుర్చీలో కూర్చోలేకపోయాను. నువ్వు బాగా భోంచేశావా వెంకన్నా?" అని రంగన్నా అడిగాడు.
           "లేదన్నా! నాకు కుర్చీ చాలా ఎత్తు అయిపోయింది. నేను కుర్చీపై ఎక్కలేకపోయాను" అని వెంకయ్య చెప్పాడు.
           " సరే ఏం చేద్దాం! మనం ఎవ్వరింటికీ పోగూడదు. మనింట్లోనే మనం తిందాం. అనుకొన్నారు. అప్పటినుంచి ఒక్క పెళ్ళికి కూడా పోతే వొట్టు.
					 నక్క చెప్పిన కథ
       
            అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహానికి రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. కనుక ప్రతిరోజు రాత్రి ఒక జంతువు దానికి నిద్రపోయేదాకా కథలు వినిపించాలని అడిగింది.
            రోజుకొక్క జంతువు వచ్చి కథలు చెప్పేవి. ఎన్ని కథలు చెప్పినా సింహానికి నిద్ర వచ్చేది కాదు.
            సరిగ్గా కథ చెప్పలేదని సింహం ఆ జంతువుల్ని అడవి నుంచి తరిమేసింది.
            ఒక రోజు ఒక నక్కవంతు వచ్చింది. నక్క సింహానికి ఇలా కథ చెప్పసాగింది.
            "అనగనగా ఒక అడవిలో ఒక పిట్ట ఉండేది. ఒక రోజు ఆ పిట్ట ఒక చెట్టు కింద చాలా గింజలను చూసింది.అది ఒక గింజ తీసుకుని గూటికి వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకొని వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకొని వెళ్ళింది." ఇలా ఒక గంటసేపు నక్క చెప్పింది.
            "చాలు, చాల్లేవయ్యా! తరవాత ఏం జరిగిందో చెప్పు" అని సింహం గర్జించింది. మళ్ళీ నక్క చెప్పడం ప్రారంభించింది.
            "ఆ పిట్ట అలసిపోయింది. తర్వాత దాని భర్త పిట్టను పంపింది. అదీ ఒక గింజ తీసుకుని గూటికి వెళ్ళింది. మళ్ళీ వచ్చి ఇంకొక గింజ తీసుకుని వెళ్లింది." అని మళ్లీ నక్క ఒక గంట సేపు చెప్పింది.
            "చాలు, చాల్లేవయ్యా తర్వాత ఏం జరిగిందో చెప్పు" అని సింహం గర్జించింది. మళ్ళీ నక్క చెప్పసాగింది.
            "భర్త పిట్ట అలసిపోయింది. పక్కింటి పెంచలయ్య పిట్టను పంపింది. అది ఒక గింజ తీసుకు పోయింది. మళ్ళీ వచ్చి ఒక గీంజ తీసుకుపోయింది" అంటూ చెప్పడం మొదలుపెట్టింది.
            సింహానికి విసుగుతో ఆవులింత వచ్చింది.
            "చాలు, చాల్లేవయ్యా నాకు నిద్ర వస్తోంది. నువ్వు పోవచ్చు" అని సింహం నక్కను పంపివేసింది. నక్క నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
                                       	       నా ముద్దుల కుక్క
        నా కుక్క అల్లం రంగులో ఉంటుంది. అందుకని నేను దానికి అల్లం అని పేరు పెట్టాను.
        నేను బడి నుంచి వచ్చేవేళకు అల్లం కాచుకుని ఉంటుంది.
        అల్లం చాలా తెలివి గల కుక్క. నేను రోజూ అల్లంతో బంతి ఆట ఆడుకుంటాను. నేను బంతి విసిరితే అది వెళ్ళి దానిని తెస్తుంది. నేను దానితో దాగుడుమూతలు ఆడుకుంటాను. నేను దాక్కుంటే అది నన్ను వెతికి పట్టుకుంటుంది.
             ఒకరోజు నేను బడి నుంచి వచ్చేవేళకు ఇంటి ముందు అల్లం కనబడలేదు. ఎక్కడికి పోయింది? ఇంట్లో ఉందేమో అనుకుంటూ ఇంట్లోచూశాను. కానీ ఆ రోజంతా అల్లం నాకు కనబడలేదు. నాకు తెలిసిన చోట్లన్నీ వెతికాను. కానీ కనబడలేదు.
             మర్నాడు రాత్రి పళ్ళెంలో పాలుపోసి కాచుకుని కూచున్నాను. అల్లం నమ్మదిగా వచ్చి పాలు తాగి వెళ్ళిపోతూ ఉంది. నేను దాని వెంట నెమ్మదిగా వెళ్ళాను. అది పక్క ఇంట్లో పశువుల పాకలోకి పరుగెత్తింది. నేను దాని వెంట వెళ్ళాను.
             అక్కడ అల్లంను చూచి నాకు బలే ముచ్చటేసింది. చూస్తూ నిలబడ్డాను.
             "అమ్మా దొంగా! ఇదా నువ్వు చేసిన పని" అని దగ్గరకు పోయి చూశాను.
             అల్లం మూడు బుజ్జి పిల్లలను కనింది. నేను అల్లంను, దాని పిల్లలను ఇంటికి తీసుకొచ్చాను. అప్పట్నుంచి నలుగురు అల్లంలు అయ్యారు!              

తుమ్మెద ఎందుకు ఏడుస్తుంది ?

            అనగనగా ఒక అడవి. ఒకరోజు అడవిలో జంతువులన్నీ నిద్రపోతున్నాయి.
            కొంచెంసేపటికి సింహానికి మెలకువ వచ్చింది.
            "మధ్యాహహ్నమయినా ఎవరూ ఇంకా లేవలేదు" అని మంత్రిని అడిగింది.
            " మహారాజా! కోడిపుంజు కూయలేదు. అందువల్ల జంతువులు లేవలేదు" అని మంత్రి చెప్పాడు.
            సింహం పొద్దున ఎందుకు కూయలేదు" అని అడిగింది.
            "మహారాజా! గుర్ర్రం నా పిల్లలను తొక్కేసీమ్ది. పిల్లలు చచ్చిపోయాయి. నేను నా భార్య దిగులుతో ఏడుస్తున్నాము. అందువల్ల కూయలేదు" అని కోడిపుంజు చెప్పింది.
            సింహం గుర్రాన్ని పిలిచింది.
            "నువ్వు కోడిపిల్లలను ఎందుకు తొక్కేవు?" అని అడిగింది.
            "మహారాజా! ఎద్దు పరిగెత్తింది. దానిని చూచి భయపడి నేను పరిగెత్తాను. పొరపాటున కోడిపిల్లలను తొక్కేను" అని గుర్రం చెప్పింది.
            సింహం ఎద్దును అందరినీ భయపెట్టేలాగా ఎందుకు పరుగెత్తినావు?" అని అడిగింది.
            "మహారాజా! నన్ను ఒక తుమ్మెద కుట్టింది. నొప్పితో నేను పరుగెత్తాను". అని చెప్పింది.
            సింహం తుమ్మెదను పిలిచింది.
            "తుమ్మెదా! నువ్వు ఎందుకు ఎద్దును కుట్టావు" అని అడిగింది.
            "మహారాజా! నేను ఎద్దును తమాషాకు కుట్టాను. అది ఎలా పరిగెత్తుతుందో చూచి నవ్వాలని కుట్టాను" అని చెప్పింది.
            "నువ్వు సరదాగా కుట్టావు. కానీ కోడిపిల్లలు చచ్చిపోయినాయి. నువ్వు అడవిలో ఉండకూడదు" అని సింహం దాన్ని తరిమేసింది.
            "నన్ను క్షమించడి, నన్ను క్షమించడి" అని తుమ్మెద వెళ్ళిపోయింది.
            కానీ అది ఆ రోజునుంచి ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉంది. "నన్ను క్షమించు, నన్ను క్షమించు" అని చెట్ల్లలో తిరుగుతూ ఉంది.
          
                                    	                      కోకిల
           అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కోయిల ఉండేది. అది భార్యాబిడ్డలతో సంతోషంగా కాలం గడుపుతూ ఉండేది. పగలంతా సంతోషంగా పాటాలు పాడేది.
           ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడు అడవికి పోయాడు. కోయిల తియ్యగా పాడటం చూశాడు. ఆ సంగతి ఊళ్ళో అందరికీ చెప్పాడు. చాలా మంది జనం అడవికి వెళ్ళి ఆ కోయిల తియ్యటి పాటలను విన్నారు. అందరికీ ముచ్చటేసింది.
           అలా అలా ఈ సంగతి దేశమంతా పాకింది.
           ఆ దేశపు రాజుకు కూడా కోయిల సంగతి తెలిసింది. ఆ కోయిలను పట్టించి ఒక పంజరంలో పెట్టించాడు. దానికి మంచి పళ్ళు పెట్టాడు. కానీ కోయిల పాడేది కాదు. అది రోజురోజుకీ నీరసించి పోసాగింది. దిగులుతో ఏమీ తినేది కాదు.
           "కోయిల ఎందుకు పాడటం మానేసింది" అని రాజు మంత్రిని అడిగాడు.
           "మహారాజా! అది అడవిలో భార్యాబిడ్డలతో ఉండేది. సంతోషంగా పాటలు పాడుతుండేది. కానీ పంజరంలో దానికి స్వతంత్రం లేదు. అందువలన అది దిగులుతో పాడటం లేదు" అని మంత్రి చెప్పాడు.
           రాజు కోయిలను వదిలివేశాడు. కోయిల అడవి చేరింది. తన కుటుంబంతో కలిసింది. మళ్ళీ తియ్యటి పాటలు పాడి అందరినీ సంతోష  పెట్టసాగింది.
                                                            ఎలా బతకాలి?
                అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడు. అతడు ఒక రోజు రాత్రి భార్యతో, "ఏమే! మన గాడిద ముసలిదయింది. దానిని చంపేసి కూర వండుకుందాం" అన్నాడు. ఆ మాట గాడిద విన్నది. రాత్రికి రాత్రి అది పారిపోయింది.
               అది పోతుండగా దారిలో ఒక కోడిపుంజు కనపడింది.
               "తమ్ముడూ! నువ్వు ఎక్కడికి పోతున్నావు?" అని గాడిద కోడిపుంజును అడిగింది.
               "రేపు చుట్టాలు వస్తారు. కోడి పుంజుని కోసి కూర వండు అని మా యజమాని వంట వాడితో చెప్పాడు. అది విని నేను పారిపోతున్నాను" అని కోడిపూజు చెప్పింది.
               "నాకు అదే జరిగింది తమ్ముడూ! ఇద్దరం కలిసి ఎక్కడికైనా పోదాము" అన్నది గాడిద.
               ఇంకా కొంత దూరంపోయిన తర్వాత ఒక కుక్క కనబడింది.
               "తమ్ముడూ! ఎక్కడికి  పోతున్నావు" అని కుక్కను గాడిద అడిగింది.
               నేను 10ఏండ్లుగా మా యజమాని ఇంటికి కాపలా కాశాను. నిన్న రాత్రి ఒక సంగతి జరిగింది. ఈ "కుక్క ముసలిదయింది. దీనికి తిండిపెట్టడం కూడా దండగ. దురంగా తీసుకుపోయి చంపేయి అని మా

యజమాని పనివాడికి చెప్పాడు. నేను అది విని పారిపోతున్నాను“ అని కుక్క చెప్పింది.

               "మాకూ అదే జరిగింది  తమ్ముడూ, నువ్వు కూడా మాతో రా" అని గాడిద చెప్పింది. గాడిద, కొడిపుంజు, కుక్క ఒక చోట కూచున్నాయి.
               ముగ్గురం కలిసి బుర్ర కథలు చెప్పి ఆహారం సంపాదించు కుందాం అని అనుకున్నాయి. ఆ రోజు నుంచి వీధి వీధికి వెళ్ళి అవి బుర్రకథ చెప్పేవి. కుక్క తంబుర వాయించింది. కోడిపుంజు మద్దెల వాయించింది. గాడిద బుర్రకథ చెప్పింది. జనం ఈ వింతను చూచి సంతోషంగా వాటికి ఆహారం పెట్టేవారు.
                       			   ఉపాయం
               ఒకరోజు నేను ఇంటి ముందు కూచుని చదువు కుంటున్నాను. అమ్మా, నాన్న, అక్క అందరూ బజారుకు వెళ్ళారు.
               వంటగదిలో నుంచి ఏదో శబ్ద్దం వచ్చింది. "ఇంటిలో ఎవరూ లేరే! ఎవరో? " అని వంటగదిలోకి వెళ్ళాను. నాకు భయం వేసింది. అక్కడ ఒక కోతి ఉంది. అది తిండి కోసం వెతుకుతూ ఉంది. నన్ను చూచి గబగబా బయటకుపోయింది. పోతూ పొతూ ఒక వెండి గిన్నె చేత పట్టుకుపోయింది.
                 అది ఒక చెట్టుపైకి ఎక్కి కూచుంది. నేను చెట్టు దగ్గరకు వెళ్ళాను.
              "ఏయ్ కోతీ! నా గిన్నె ఇవ్వు" అని అరిచాను.
                 "ఉ, ఉ, ఉ" అని అది నన్ను వెక్కిరించింది. 
              "ఏయ్ కోతీ! నా గిన్నె ఇచ్చేయి" అని వేలు చూపించి మళ్లీ కోపంగా అడిగాను.    అది "ఉ, ఉ, ఉ" అని పళ్ళు తెరచి వెక్కిరించింది.
                  నేను దిగులుగా ఇంటిలోకి వెళ్ళాను.
          ఒక ఉపాయం తట్టింది. ఒక అరటిపండు చూపించాను. కోతి చెట్టు దిగి వచ్చింది. గిన్నె అక్కడ పడేసి అరటిపండు తీసుకుంది. చెట్టెక్కింది.
          నా గిన్నె నాకు చిక్కింది.
            కోతికి ఆకలి తీరింది.  
            
నా_ముద్దుల_కుక్క.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)