User Tools

Site Tools


జీడి_మామిడి_గుత్తులు
				జీడి మామిడి గుత్తులు

గోపి టౌనులో చదువుకుంటున్నాడు. వాడికి తొమ్మిదేళ్లు. నాలుగో తరగతి చదువుతున్నాడు. తెలివైన కుర్రవాడు. బుద్ధిగా చదువుకుంటాడు. గోపి తాతయ్య, అమ్మమ్మ ఒక పల్లెలో ఉంటున్నారు. ఆ పల్లె ఎంతో బాగుంటుంది. వాడికి ఆ ఊరంటే చాలా ఇష్టం. సెలవుల్లో అక్కడికి వెళతాడు. ఆటపాటలతో హాయిగా గడుపుతాడు. తాతయ్య దగ్గర ఒక పాలేరు ఉన్నాడు. అతని పేరు పోలయ్య. అతనికి ఓ కూతురుంది. ఆ అమ్మాయి పేరు సీత. గోపి కంటే ఒక సంవత్సరం చిన్న పిల్ల. ఇద్దరికి మంచి నేస్తం. పల్లెకు పోతే సీతతో ఆడుకోవచ్చు. తాతయ్యతో షికార్లు కొట్టొచ్చు. అమ్మమ్మ చక్కటి కధలు చెబుతుంది. ఆ కధలు వింటూ నిద్రపోవచ్చు. అందుకే వాడికి ఆ ఊరంటే ఇష్టం. సెలవులు రాగానే తాతయ్య వస్తాడు. తాతయ్యతో పాటు పోలయ్య కూడా వస్తాడు. ఇద్దరూ కలిసి గోపీని తీసుకుపోతారు. పేరుకు మాత్రమే పోలయ్య పాలేరు. తాతయ్య అతడ్ని పనివాడిలా ఎప్పుడూ చూడడు. అమ్మమ్మ కూడా అంతే. పోలయ్య కూడా ఆ ఇంట్లోని మనిషిలాగే ఉంటాడు. గోపికి ఇది ఎంతో మంచిగా అన్పిస్తుంది. సీత కూడా బడికి పోతుంది. ఆమె గోపి కన్నా ఒక తరగతి తక్కువ. గోపి తన పుస్తకాలను జాగ్రత్తగా ఉంచుతాడు. పరీక్షలు అయిపోయాక సీతకు ఇచ్చేస్తాడు. అవే పుస్తకాలతో సీత చదువుకుంటుంది. ప్రతి ఏటా ఇలాగే జరుగుతోంది. తాతయ్య ఊళ్లో చాలా తోటలున్నాయి. మామిడి, సపోటా, జీడి మామిడి తోటలు ఉన్నాయి. గోపి చిన్న మామిడి చెట్లపైకి ఎక్కుతాడు. దోరగా పండిన మామిడి కాయల్ని కోస్తాడు. కింద ఉన్న సీత వళ్ళో వేస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ వాటిని తింటారు. పోయినసారి వచ్చినప్పుడు అమ్మమ్మ జీడిపళ్లు పెట్టింది. వాటి తియ్యదనం ఇప్పటికీ గుర్తువుంది. భలే రుచిగా ఉన్నాయి. గోపి, సీత జీడిపిక్కలతో ఆడుకుంటారు. అప్పుడప్పుడు సీత జీడి పిక్కల్ని కాల్చి ఇస్తుంది. అవి కూడా రుచిగానే వుంటాయి. సీత ఇస్తే ఇంకా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ సెలవులొచ్చాయి. పరీక్షలు అయిపోయాయి. గోపి తాతయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. తాతయ్య రానే వచ్చాడు. కాని ఈసారి ఆయనతో పోలయ్య రాలేదు. ఎందుకో మరి? తాతయ్యను చూడగానే ఎగిరి గంతేశాడు. సంబరపడుతూ తాతయ్యతో బయలుదేరాడు. మళ్ళీ తాతయ్య వూరికి వచ్చాడు. మొదటి రోజు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మమ్మ కధలు వింటున్నాడు. రెండో రోజు జీడిమామిడి తోటలోకి వెళ్ళాడు. చెట్ల నీడలో హాయిగా తిరిగాడు. ఉన్నట్లుండి గాలి వీచింది. చెట్ల కొమ్మలు ఊగాయి. కొన్ని జీడిపళ్లు నేల పై రాలాయి. బాగా మగ్గిన రెండు మూడు పళ్లు తిన్నాడు. గింజల్ని జేబులో వేసుకున్నాడు. సీత ఉంటే వాటిని కాల్చి ఇచ్చేది. అయితే సీత కన్పించడం లేదు. పోలయ్య కూడా కన్పించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? తాతయ్యను అడగాలి - అనుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆ సంగతి మర్చిపోయాడు. అమ్మమ్మతో కబుర్లలో పడిపోయాడు. ఇంకో మూడు రోజులు ఇలాగే గడిచిపోయాయి. తాతయ్య ఇంటి పెరటిలో ఇసుక ఉంది. ఆ ఇసుకలో మంట వేశారు. జీడి గింజలను కాల్చారు. తాతయ్య, పప్పును పగలకుండా జాగ్రత్తగా తీశాడు. వాటిని చూడగానే గోపీకి నోరూరింది. తాతయ్య ఇచ్చిన పప్పుల్ని ఊదుకొని తిన్నాడు. “జీడి పప్పు తింటే మంచిదా తాతయ్య?” అని అడిగాడు. “అవునురా, బోలెడంత శక్తి, బలము వస్తాయి. జీడిపప్పులో మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్ధాలు ఉంటాయి. కాల్షియం, చక్కెర కూడా ఉంటాయి.” అన్నాడు తాతయ్య. “నిజమా తాతయ్య!” గోపి ఆశ్చర్యపడుతూ అన్నాడు. “అవునురా మనుమడా. ఇంకా చెబుతాను విను. జీడి గింజల పై పెంకు ఉంది చూశావా. ఈ పెంకు నుంచి నూనె తీస్తారు. అది కాలిన తవుడు రంగులో ఉంటుంది. దాన్ని చేపలుపట్టే పడవలకు పూస్తారు. పెయింటింగ్ రంగుల్లో కలుపుతారు.” వివరంగా చెప్పాడు తాతయ్య. “మొన్న అమ్మమ్మ కాలి పగుళ్ళకు రాసుకుంది. అది ఈ నూనేనా తాతయ్య?” అడిగాడు గోపి. “అవునురా, అది జీడినూనే. కాలి పగుళ్ళకు దానిని రాసుకుంటారు. దోమల్ని చంపడానికి కూడా వాడతారు.” “దోమల్ని చంపడానికా?” “అవును. జీడి నూనెను కిరసనాయిలుతో కలిపి మండించి చంపుతారు.” “గమ్మత్తుగా ఉందే!” “మరేమనుకున్నావ్. ఇంకా విను. జీడిగింజ పెంకును కోళ్ల దాణాగా వాడతారు. జీడి చెట్టు బంకతో పుస్తకాలు బైండు చేస్తారు. చెదపురుగు మందులు కూడా తయారు చేస్తారు.” జీడి చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలా! గోపి ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఒక సంగతి గుర్తొచ్చింది. “ మరి జీడి పళ్ళ సంగతేమిటి తాతయ్య?” “వాటిని చక్కగా తినొచ్చు. అరటిపళ్ల గురుంచి నువ్వు చదువుకున్నావుగా. వాటిలో బోలెడన్ని విటమిన్లు ఉంటాయి. జీడిపళ్ళలో అవి ఇంకా ఎక్కువగా ఉంటాయి.” అన్నాడు తాతయ్య. ఆ ఊరికి దగ్గరలో ఒక జీడిగింజల ఫ్యాక్టరీ ఉంది. గోపి చూపులు దాని మీద పడ్డాయి. ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలోకి పోయి చూడలేదు. ఇప్పుడు తాతయ్య ఎన్నో సంగతులు చెప్పాడుగా. ఆ ఫ్యాక్టరీని చూడాలని అనిపించింది. “తాతయ్య! నాకు ఆ ఫ్యాక్టరీ చూపించు తాతయ్యా.” అన్నాడు గోముగా. తాతయ్య నవ్వాడు. “అలాగే లేరా. రేపే చూపిస్తాను.” అన్నాడు. మరునాడు ఇద్దరూ ఫ్యాక్టరీకి బయలుదేరారు. జీడిమామిడి తోట నుంచి నడిచిపోతున్నారు. “ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు తాతయ్య?” అని గోపి అడిగాడు. “ముందుగా గింజల్ని శుభ్రం చేస్తారు. వాటిని బాగా (దోరగా) వేయిస్తారు. పై పెంకులు ఊడదీస్తారు. పప్పుపైన గోధుమరంగు పొర ఉంటుంది చూడు. దాన్ని కూడా తీసేస్తారు. సైజుని బట్టి పప్పుల్ని వేరు చేస్తారు. ఆ తర్వాత వాటిని డబ్బాలలో నింపుతారు.” “డబ్బాలలోనా? దేనికి?” “దేనికేమిట్రా. వేరే ఊళ్లకు పంపించవద్దూ. వేరే ఊళ్లకే కాదు. వేరే దేశాలకీ పంపిస్తారు. నీకో సంగతి తెలుసా?” “ఏమిటి తాతయ్య?” “ప్రపంచంలో మనదేశంలో నుంచే జీడిపప్పు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఆమెరికా, అస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండు - లాంటి దేశాలు దిగుమతి చేసుకొంటున్నాయి. దీనివల్ల మనకు బోలెడు డబ్బు వస్తోంది.” “అంత జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుంది తాతయ్య?” “బొంబాయి నుంచి కన్యాకుమారి దాకా సముద్రం ఉందిగా. ఆ తీరమంతటా జీడితోటలు ఉన్నాయి.” మాటల్లోనే ఫ్యాక్టరీకి చెరుకున్నారు. ఫ్యాక్టరీకి పెద్ద ఇనుప గేటు ఉంది. ఆ గేటు మూసి వుంది. దాని ముందు కాపలా మనిషి నిలబడ్డాడు. తాతయ్యను చూడగానే అతను చిరునవ్వు నవ్వాడు. ఒంటిచేత్తో నమస్కారం పెట్టాడు. గేటు కొద్దిగా తెరిచాడు. ఇద్దరినీ లోపలికి పంపించాడు. మళ్ళి గేటు మూసేశాడు. ఇద్దరూ వెళ్ళి మేనేజరుని కలిశారు. ఆయనకు కూడా తాతయ్య బాగా తెలుసల్లే ఉంది. “రండి రండి. ఏమిటిలా వచ్చారు? మా ఫ్యాక్టరీ చూడడానికేనా?” అంటూ నవ్వాడు. తాతయ్య కూడా “అవును” అంటూ నవ్వాడు. మేనేజరు 'సరే' అన్నాడు. గోపి తాతయ్యతో కలిసి ఫ్యాక్టరీ అంతా చూస్తున్నాడు. అక్కడంతా వేడిగా, ఉక్కగా ఉంది. దుమ్ము, ధూళీ నిండి ఉంది. బోలెడంత మంది ఆడవాళ్ళు పని చేస్తున్నారు. అందరూ ఆడవాళ్ళే. వాళ్లలో పిల్లలు కూడా ఉన్నారు. వేయించిన జీడి గింజలకు బోలెడంత దుమ్ము, బూడిద ఉంటాయి. ఆ బూడిద, దుమ్ము ఆడవాళ్ల శరీరమంతా అంటుకొంటుంది. వాళ్లంతా వరుసలో కూర్చున్నారు. ఒక్కొక్కరి పక్కన ఒక వెదురు బుట్ట ఉంది. కొద్ది కొద్దిగా ఇసుక ఉంది. మాటి మాటికి ఆ ఇసుకలో చేతులు ముంచుతున్నారు. చేతులు కాలిపోకుండా అలా చేస్తున్నారు. వేయించిన జీడిగింజలను జాగ్రత్తగా పగులగొడుతున్నారు. పప్పులు విరిగిపోకుండా బయటికి తీస్తున్నారు. చకచకా పని చేస్తున్నారు. “అబ్బ! ఎంత తొందరగా పప్పులు తీస్తున్నారు తాతయ్య!” గోపి ఆశ్చర్యంగా అన్నాడు. “అవును మరి. ఎంత పప్పు తీస్తే అంత కూలీ వస్తుంది. అందుకే మనం వచ్చింది కూడా వాళ్ళు చూడటం లేదు.” అన్నాడు తాతయ్య. గోపి మరికొంత సేపు వింతగా చూశాడు. ఒకరిద్దరు తలెత్తి చూసి, తిరిగి పనిలో పడిపోయారు. గోపి చూపులు ఉన్నట్లుండి ఓ పాప పైన నిలిచాయి. ఆ పాపని ఎక్కడో చూసినట్టు ఉంది. మొహమంతా మసిపూసుకొని వుంది. అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. ఇంతలో ఆ పాప గోపి వంక చూచింది. సన్నగా నవ్వింది. అంతే! గోపి గుర్తుపట్టేసాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు. సీత! గోపి చిట్టి నేస్తం! అయినా ఇంకా అనుమానం. “తాతయ్య! ఆ పాప సీతేనా?” అని అడిగాడు. తాతయ్య ఔనని తల ఊపాడు. గోపికి కడుపులో కలబెట్టినట్టు అనిపించింది. వాడి ఉత్సాహం ఎగిరిపోయింది. అక్కడ ఉండాలనిపించలేదు. “ఇక పోదాం తాతయ్య” అన్నాడు. “అదేమిట్రా! అంతా చూడకుండానే!” ఆశ్చర్యంగా అన్నాడు తాతయ్య. గోపి మాట్లాడకుండా ముందుకు నడిచాడు. తాతయ్యకు కూడా వాడితో నడవక తప్పలేదు. ఇద్దరూ ఫ్యాక్టరీ బయటకు వచ్చారు. గోపి తల వంచుకుని నడుస్తున్నాడు. వాడికి చాలా బాధగా ఉంది. కొంత సేపటికి మళ్ళీ జీడిమామిడి తోటలోకి వచ్చారు. చెట్ల నిండా జీడిపళ్లు కాసి ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. వాటిని ఎప్పుడు చూసినా గోపికి సంతోషం కలిగేది. ఇప్పుడు మాత్రం విచారం కలుగుతోంది. సీత బడికి పోవటం లేదా తాతయ్య?“ భాదగా అడిగాడు. సీత పని చేయడం వాడికి అస్సలు ఇష్టం లేదు. సీత కూడా అందరిలాంటి పిల్లే. సీత కూడా తనలాగే బడికి పోవాలి. తనలాగే సీత కూడా చదువుకోవాలి. ఇదీ వాడి ఆలోచన. “అవునురా.” అన్నాడు తాతయ్య పొడిగా. “ఎందుకని?” గోపి వెంటనే అడిగాడు. “ఆరు నెల్ల క్రితం పోలయ్య చనిపోయాడు. వాళ్ళమ్మ సీతను బడి మాన్పించింది. తనతో పాటూ ఫ్యాక్టరీకి తీసుకుపోతూంది. ఇద్దరూ పనికి పోకుంటే ఇల్లు గడవదట. నీ మూడో తరగతి పుస్తకాలు - పాపం అది వాడనే లేదు.” చెప్పాడు తాతయ్య. గోపి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఇప్పుడు వాడికి మరీ బాధగా ఉంది. సీత బడికి పోవటం లేదు. దాని నాన్న చనిపోయాడు. అందుకని అది ఫ్యాక్టరీకి పోతుంది. పొగలో, దుమ్ములో పని చేస్తుంది. పెద్దవాళ్ళలాగే పని చేస్తుంది. ఇదివరకులా ఇప్పుడు అది ఆడుకోదు. చెంగు చెంగున దూకుతూ బడికి పోదు. పాఠాలు ఎంతో చకచకా చదివేసేది. ఇప్పుడిక ఏమీ చదవదు. రోజంతా జీడిపప్పు వలుస్తూ ఉంటుంది. తలుచుకొంటేనే గోపి కడుపు తరుక్కుపోతోంది. జీడి చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. గోపికి ప్రతి జీడిపండులో ఒక సీత కనిపించింది. ప్రతి జీడిగింజ ఒక సీతలా అనిపించింది. నవ్వుతూ త్రుళ్లుతూ ఉండే సీత కాదు. దుమ్ము కొట్టుకు పోయిన సీత! మసి బారిన ముఖంతో ఉన్న సీత! జీడిచెట్లు ఏడుస్తున్నట్లుగా అన్పించింది. గోపికి టౌనులోని దుకాణాలు గుర్తొచ్చాయి. ఆ దుకాణాల్లో పెద్ద పెద్ద సీసాలు ఉంటాయి. ఆ సిసాల నిండా తెల్లని జీడి పప్పు. వాటిని ఎప్పుడు చూసినా వాడికి నోరూరేది. అవి గుర్తొచ్చినా నోరూరేది. ఇప్పుడు ఆ సీసాల్లో కూడా సీతే ఉన్నట్లు అన్పిస్తోంది. నల్లని మసితో ఉన్న సీత! దుమ్ములో పని చేస్తూ ఉన్న సీత! వాడికి ఏడుపు ఆగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు కొన్ని జీడిగింజల్ని ఏరుకున్నాడు. ఇప్పుడు జేబులోంచి వాటిని పైకి తీశాడు. కోపంగా విసిరి కొట్టాడు. తాతయ్యను పట్టుకుని బావురుమని ఏడ్చాడు.

జీడి_మామిడి_గుత్తులు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)