User Tools

Site Tools


కోకిలమ్మ_కథ
				కోకిలమ్మ కధ

రాము వడ్రంగి. చిన్నవాడైనా మంచి పనివాడు. కొయ్యతో అలంకార దీపాలు చేస్తుంటాడు. చాలా అందంగా చేస్తాడు. మీకు అందమైన చిన్న దీపాలు కావలా? అయితే రాము చేత చేయించవలసిందే. ఏడు ముఖాల దీపాలు కావాలా? రాము చేయవలసిందే! రాము పనితనం గురించి అందరికీ తెలుసు. చుట్టుపక్కల అన్ని గ్రామాలవాళ్ళకి తెలుసు. రాము నాన్న చిన్నప్పుడే పోయాడు. అమ్మ ఉంది. ఆమె ఎంతో మంచిది. ఆమె మాటలు వింటే రాళ్లు కూడా కరుగుతాయి. రాముకి ఓ చెల్లెలుంది. ఆమె పేరు కోకిలమ్మ. పట్టులా ఉంటుంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అంత అందంగా ఉంటుంది. దేవతలా ఉంటుంది. చెల్లెలంటే రాముకి ప్రాణం. అమ్మంటే రాముకి దైవం. రాముకి పెళ్ళీడు వచ్చింది. అయినా ఇంకా పెళ్ళి చేసుకోలేదు. 'చెల్లెలి పెళ్ళి అయ్యాకే నా పెళ్ళి' అంటాడు. రోజూ పొద్దున్నే పనికి కూర్చుంటాడు.అప్పుడు కోకిలమ్మ వస్తుంది. అన్నయ్య చేతికి ఉలిని అందిస్తుంది. రాము పని మొదలు పెడతాడు. ఇలా రోజూ జరగాల్సిందే. అమ్మ, చెల్లెలు, రాము హయిగా ఉంటున్నారు. ఒకనాడు రాముకి పెద్ద పని తగిలింది. ఆ దేశపు యువరాజుకి పెళ్ళి కాబోతోంది. వచ్చే పున్నమి నాడే పెళ్ళి. రాజు కొడుకు పెళ్లంటే మాటాలా. ఒకటే ఆర్భాటం. దేశమంతా ఒకటే సందడి. పెళ్ళికి వెయ్యి అలంకార దీపాలు కావలట. ఆ పనిని వడ్రంగి రాముకు అప్పగించారు. రాము ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెయ్యి దీపాలంటే మాటలు కాదు. పైగా రాజుగారి ఇంటిపని! రాముకి గర్వంగా అన్పించింది. భయం కూడా వేసింది. ఒక మంచిరోజు చూసుకున్నాడు. అమ్మ కాళ్ళకు మొక్కాడు. అమ్మ దీవించింది. కొడుక్కి దిష్టి తీసింది. కోకిలమ్మ అన్నయ్య చేతికి ఉలిని అందించింది. రాము దీపాలు చెయ్యడం మొదలుపెట్టాడు. మనసంతా పని మీద పెట్టాడు. తిండి, నిద్ర మర్చిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. గుట్టలు గుట్టలుగా దీపాలు తయారవుతున్నాయి. వాటిని వీధి అరుగుమీద పేరుస్తున్నారు. ఒకరోజు చెన్నయ్య వచ్చాడు. చెన్నయ్య అంటే యువరాజుగారి మనిషి. అప్పటికి పౌర్ణమి ఇంకో పది రోజులుంది. “దీపాలు తయారైనాయా?” అడీగాడు చెన్నయ్య. “సగం తయారైనాయి” అన్నాడు రాము వినయంగా. చెన్నయ్యకు అమ్మ మజ్జిగ ఇచ్చింది. “రేపు మా యువరాజుగారు వస్తున్నారు. తయారైన దీపాలు చూడాలట” అన్నాడు చెన్నయ్య. అందరూ ఉలిక్కిపడ్డారు. అదేమీ చిన్న విషయం కాదు. ఒక వడ్రంగి ఇంటికి యువరాజు రావడం మాటలు కాదు. వాళ్ళకు గర్వంగా అన్పించింది. సంతోషం కలిగింది. అంతకంటే ఎక్కువగా భయం వేసింది. భయంతో గజగజా వనికిపోయారు. ఆ కాలంలో రాజుగారికి కూడా అంతగా భయపడేవారు కాదు. యువరాజు అంటేనే హడలు! అతను చెడ్డవాడని వినికిడి. పరమ కోపిష్టివాడని చెప్పుకొనేవారు. అందుకే అంత భయం. చెన్నయ్య వెళిపోయాడు. రేపు యువరజు వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో ఏమో! మంచి జరగవచ్చు. చెడూ జరగవచ్చు. బితుకుబితుకు మంటూ గడిపారు. రాము మరింత తొందరగా దీపాలు చేస్తున్నాడు. రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తెల్లారేసరికి అలిసిపోయాడు. దీపాల మధ్యనే నిద్రపోయాడు. కోకిలమ్మ వచ్చి చూచింది. “పాపం అన్నయ్య ఎంత అలిసిపోయాడో!” అనుకుంది. లేపకుండా ఊరుకుంది. కోకిలమ్మ వాకిలి తుడిచి కల్లాపి చల్లింది. అందంగా ముగ్గులు పెట్టింది. స్నానం చేసి, పూలు కోయాడానికి వెళ్ళింది. పూలతోట ఇంటికి కుడి వైపున ఉంది.తోటలోకి అడుగు పెడితే కోకిలమ్మకు పొద్దు తెలిసేది కాదు. చిలకలతో మాట్లాడుతుంది. పిచుకులతో ఆడుకుంటుంది. చెట్లతో తీగలతో ముచ్చట్లు పెడుతుంది. ఆకాశంలో సూర్యుడు పొడిచాడు. ఉన్నట్టుండి యువరాజు రధం రాము ఇంటి ముందు ఆగింది. అంత పొద్దునే వస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. రధం నుంచి యువరాజు దిగాడు. అతని నడకలో బోలెడంత గర్వం. అతనితో పాటు ఇద్దరు సేవకులు కూడా వచ్చారు. వాళ్ళు దున్నపోతుల్లా ఉన్నారు. చూడగానే భయం పుట్టే ఆకారాలు. వాళ్ళ నడుములకు పట్టాకత్తులు వేలాడుతున్నాయి. యువరాజుని మొదట అమ్మ చూచింది. పరుగెత్తుకు వెళ్ళి స్వాగతం చెప్పింది. చేతులు జోడించి మొక్కింది. రాజులు నమస్కరించరు. అప్పుడప్పుడు తలను మాత్రం ఊపుతారు. ఇతడైతే తలను కూడా ఊపలేదు. ఏమీ చూడనట్టే ముందుకొచ్చాడు. వడ్రంగి రాము ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. వాడి వీపు మీద అమ్మ దబదబా తట్టింది. వాడు ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు తెరిచి అయోమయంగా చూశాడు. యువరాజు ఇది గమనించలేదు. అతగాడి చూపు కోకిలమ్మపై పడింది. గుడ్లప్పగించి ఆమెనే చూస్తున్నాడు. అయితే కోకిలమ్మ అది గమనించలేదు. 'అరుగు మీద ఉన్న దీపాలను యువరాజు చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. తనను మెచ్చుకుంటాడు.' అని రాము అనుకున్నాడు. అయితే యువరాజు వాటి వంక చూడనే లేదు. అతడి చూపంతా కోకిలమ్మ మీదే ఉంది. రాము ఒక దీపాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దానిని యువరాజుకి చూపించాడు. “దీనిని ఏడు గూళ్ళ దీపం అంటారు. ఒకొక్క గూటిలో ఒకొక్క దీపం పెట్టవచ్చు. చూచేందుకు ఎంతో అలంకారంగా ఉంటుంది.” అన్నాడు. యువరాజు ఏమీ వినలేదు. కోకిలమ్మనే చూస్తూ ఉన్నాడు. ఇంతలో కోకిలమ్మ తిరిగింది. వాకిట్లో ఉన్న యువరాజుని చూచింది. ఆమెకు గుండె దడదడమంది. భయపడి పెరట్లోకి పరిగెత్తింది. అక్కడే దాక్కుంది. అందరూ అది చూసారు. “ఆ పిల్ల ఎవరు?” యువరాజు అడిగాడు. రాము మాట్లాడలేదు. నీళ్లు నములుతూ నిలబడ్డాడు. యువరాజు ఉరిమి చూశాడు. సేవకులు కత్తులు తీశారు. అమ్మ భయపడింది. “ఆ పిల్ల నా కుతూరు బాబూ!” అంది. యువరాజు తల ఊపాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీపాల వంక కన్నెత్తి చూడలేదు. అమ్మకు, రాముకు చెమటలు పట్టాయి. ముందుముందు ఏం జరుగుతుందో అని భయపడ్డారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్లు భయపడినట్లే జరిగింది. మరురోజే చెన్నయ్య వచ్చాడు. చావు కబురు చల్లగా చెప్పాడు. “నిన్ను అదృష్టం వరించిందోయి” అన్నాడు. రాము తెల్లముఖం వేశాడు. చెన్నయ్య వివరించాడు. “యువరాజుగారికి నీ చెల్లెలు బాగా నచ్చింది. ఆ అమ్మాయి మీద మనసుపడ్డాడు. దీపాలతో పాటు నీ చెల్లిని కూడా రాజమహలుకు పంపించు. పెళ్ళికి ముందు రోజే పంపించాలి. ఇక నుంచి నీ చెల్లికి రాజభోగమే! అర్ధమయ్యిందా?” అన్నాడు చెన్నయ్య. అమ్మకు, రాముకు పిడుగు పడినట్లు అయ్యింది. రాముకి కాళ్లూ చేతులూ ఆడలేదు. “పున్నమి రోజునే రాజుగారికి పెళ్లి అవుతుందిగా! నా చెల్లెలు దేనికి?” అన్నాడు అయోమయంగా. చెన్నయ్య పెద్దగా నవ్వాడు.. “తమ్ముడూ! వచ్చేది పట్టపురాణి. వారసుని కోసం ఆమెను చేసుకొంటున్నారు. అది వేరే సంగతి. ఆమె కాక యువరాజుగారికి ఎందరో ఉంటారు. నీ చెల్లెలాంటి వాళ్లు అక్కడ చాలా మంది ఉంటారు. నీ చెల్లెలు సుఖంగా ఉంటుంది. రాణిలాగే ఉంటుంది. నీకు కూడా కావలిసినంత ధనం ముడుతుంది.” అన్నాడు చెన్నయ్య. రాము కొయ్యబారిపోయాడు. అమ్మ దేవుడి గదిలోకి పరిగెత్తింది. అక్కడ నేల మీద పడి పొర్లిపొర్లి ఏడ్చింది. చెన్నయ్య మరికొంత సేపు నచ్చజెప్పాడు. వెళ్ళిపోయే ముందు కరాఖండిగా అన్నాడు. “జాగ్రత్త. పారిపోయేందుకు చూడ్డొద్దు. ఎక్కడికి పోయినా వెతికి పట్టుకుంటాం. తలలు తెగిపోతాయి. మీకు మీరుగా అమ్మాయిని పంపితే మంచిది. లేకపోతే అడ్డొచ్చిన వాళ్ళని నరికేస్తాం. బలవంతంగా తీసుకుపోతాం.” ఆ ఇంట్లో భూకంపం వచ్చినట్టు అయ్యింది. అమ్మకి, రాముకి పిచ్చెక్కినట్టు అయ్యింది. “దేవుడా! మేం ఏం తప్పు చేశామని? మమ్మల్ని ఇలా దండించావు?” అని అమ్మ గుండెలు బాదుకొని ఏడ్చింది. రాము బతికున్న శవంలా మారాడు. అప్పుడు కోకిలమ్మ ఇంట్లో లేదు. పక్క వీధిలోని స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. చీకటి పడే వేళకి తిరిగి వచ్చింది. ఇల్లంతా చీకటిగా ఉంది. అమ్మ ముఖం కమిలిపోయి ఉంది. అన్నయ్య ముఖంలో నెత్తురు లేదు. కోకిలమ్మ బెంబేలు పడింది. ఏమయ్యిందని వాళ్ళను అడిగింది. గుచ్చిగుచ్చి అడిగింది. ఇద్దరూ జవాబు చెప్పలేదు. “ఏమీ కాలేదు” అని ఊరుకున్నారు. ఏదో జరిగింది అని కోకిలమ్మకు అర్ధమయ్యింది. అయితే ఏం జరిగిందో మాత్రం తెలియలేదు. రాము ఏంతో మారిపోయాడు. అతను దీపాలు చెయ్యడం మానేశాడు. “అన్నయ్యా! నీకేమయ్యిందిరా? దీపాలు చెయ్యడం ఎందుకు మానేశావు?” అని కోకిలమ్మ అడిగింది. రాము బదులివ్వలేదు. ఉండిఉండి అమ్మ, అన్నయ్య ఏడుస్తున్నారు. కారణం అడిగితే చెప్పడం లేదు. కోకిలమ్మకు అంత అయోమయంగా ఉంది. తనలో తనే కుమిలిపోసాగింది. ఆ ఇల్లు ఒక వల్లకాడులా అయ్యింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. పగలంతా అన్నయ్య నిద్రపోతున్నాడు. అమ్మ దేవుడి గదిలో కూర్చుని ఏడుస్తోంది. కోకిలమ్మకి ఏమీ తోచేది కాదు. తోటలోకి పోయి అక్కడే ఉంటోంది. చెట్లతో, పిట్టలతో మాట్లాడుకుంటోంది. రాత్రి పూట ఒక సంగతి జరిగేది. కోకిలమ్మ నిద్రపోగానే అమ్మ, రాము లేస్తారు. పక్క గదిలోకి పోయి గుసగుసగా మాట్లాడుకుంటారు. అమ్మ కుళ్ళికుళ్ళి ఏడుస్తుంది. రాము ఏదో పని చేసుకుంటూ ఉంటాడు.రాత్రంతా ఆ పని చేస్తూనే ఉంటాడు. పున్నమి ఇంకా ఒక్కరోజే ఉంది. రేపే యువరాజు పెళ్ళి. 'ఈ రాత్రి లోగా కోకిలమ్మను పంపేయాలి'. పగలంతా కష్టంగా గడిచింది. మెల్లమెల్లగా రాత్రి వచ్చింది. అది చలికాలం. దాంతో ఊరు తొందరగా సద్దుమణిగింది. అందరూ నిద్రపోయారు. రాము పెరట్లో ఉన్నాడు. అక్కడి నుంచే “కోకిలమ్మ!” అని పిలిచాడు. అతని గొంతు వణికింది. కోకిలమ్మకు ఆ పిలుపు వినిపించింది. అన్నయ్య తనను పిలిచి చాలా రోజులయ్యింది. పరుగు పరుగున పెరట్లోకి వచ్చింది. “ఏంటన్నయ్యా?” అని అడిగింది. అంతా వెన్నెల పరుచుకొని ఉంది. అమ్మ, అన్నయ్య ఒక చెట్టు నీడలో నిలబడ్డారు. వాళ్ళ ముఖాలు మసకగా కనిపిస్తున్నాయి. “కోకిలా! ఆ దీపం ఇటు తీసుకు రామ్మా.” అన్నాడు రాము. పది గజాల దూరంలో వేపచెట్టు ఉంది. చెట్టు కింద ఓ పొడవాటి కొయ్యపలక పరిచి ఉంది. దాని మీద ఓ దీపం వెలుగుతోంది. దీపం తేవడం కోసం కోకిలమ్మ పరిగెత్తింది. కాళ్ళను కొయ్యపలక మీద మోపింది. అంతే. రాము కొయ్యపలకను దడాలున లాగేశాడు. పలక అడుగున లోతైన గొయ్యి! కోకిలమ్మ కెవ్వున అరిచింది. అరుస్తూనే గోతిలో పడిపోయింది. ఆ గొయ్యి పది అడుగుల లోతు ఉంది. మూడు అడుగుల వెడల్పు ఉంది. గోతి నిండా సజ్జలు పోశారు. ఇన్ని రోజులూ కోకిలమ్మకు తెలియకుండా ఆ గోతిని తయారు చేశారు. రాము రాత్రిపూట చేసిన పని అదే! సజ్జల గోతిలో పడినవారు పైకి రాలేరు. బురద గుంటలో పడితే కూరుకుపోతారు. అలాగే సజ్జల గోతిలో కూడా కూరుకుపోతారు. పైకి రావాలని ఎంత ప్రయత్నించినా రాలేరు. ఆ కాలంలో పగవారిని ఈ పద్ధతిలో కూడా చంపేవారు. ఇప్పుడు కోకిలమ్మ సజ్జల గుంటలో ఉంది. ఆ గుంట దగ్గరే అమ్మ, అన్నయ్య ఉన్నారు. “అమ్మా! అన్నయ్యా! ఓ అమ్మా! అన్నయ్యా!” కోకిలమ్మ పిలుస్తోంది. దీనంగా అరుస్తోంది. అమ్మ, అన్నయ్య ఉలకలేదు. చడీచప్పుడూ లేదు. అక్కడే నిలబడి ఈ దారుణం చూస్తున్నారు. కోకిలమ్మకు ఏమీ అర్ధం కాలేదు. తనను కాపాడేందుకు ఎవరూ రారెందుకు? అమ్మ, అన్నయ్య ఏమయ్యారు? ఇంకా రావడం లేదేం?… భయంతో బిగ్గరగా అరిచింది. “అమ్మా, రా! అన్నాయ్యా, రా! అమ్మా! అన్నా! నన్ను కాపాడండి. నేను చచ్చిపోతున్నాను. నన్ను కాపాడండి.” కోకిలమ్మ అరుస్తూనే ఉంది. ఆ కేకలకి అమ్మ తట్టుకోలేకపోయింది. మూర్ఛ వచ్చి కింద పడిపోయింది. రాము తల బాదుకొంటూ ఏడుస్తున్నాడు. కోకిలమ్మ దీనంగా ఏడ్చింది. పెద్దగా అరిచింది. అమ్మను, అన్నయ్యను పిలిచి పిలిచి సజ్జల గుంటలో మునిగిపోయింది. యువరాజుకి భయపడి వాళ్లు కోకిలమ్మను చంపేశారు. ఈ దారుణానికి వడిగట్టారు. ఇది జరిగాక అమ్మ ఎన్నో రోజులు బతకలేదు. కూతురి మీది బెంగతో చనిపోయింది. రాము పిచ్చిపట్టి ప్రాణాలు వదిలాడు. కుటుంబం అంతా నాశనం అయ్యింది. ఊరు ఊరంతా ఈ ఘోరం చూసింది. ఎవ్వరూ ఏమీ చెయ్యలేకపోయారు. కొంతకాలానికి కోకిలమ్మకు గుడి కట్టారు. కోకిలమ్మ 'సజ్జల అమ్మోరు' అయ్యింది. పూజలు మొదలెట్టారు. తిరునాళ్ళు జరిపిస్తున్నారు. ఎన్నో ఊళ్లలో 'సజ్జల అమ్మోరు' గుళ్లున్నాయి! ఎన్నిగుళ్లు కడితే ఏం లాభం? ఆ పడుచు పిల్ల మళ్ళి బతుకుతుందా? ఆమె బతుకు ఆమెకు తిరిగి వస్తుందా? చెప్పండి. అన్యాయంగా ఆశ పడ్డాడు యువరాజు. అమాయకమైన చెల్లిని చంపాడు సొంత అన్న. ఆ అన్నకు సాయం చేసింది కన్నతల్లి! అందరూ ఆమె బతుకుతో ఆడుకున్నారు. ఆమె పచ్చని జీవితాన్ని బుగ్గి చేశారు. వాళ్ళకు ఏం శిక్ష పడాలి? ఎవరికి ఎలాంటి శిక్ష వెయ్యాలి?… మీరే చెప్పండి.

కోకిలమ్మ_కథ.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)