User Tools

Site Tools


మీరు_నయం_చేసుకోవచ్చు
                         			 నీళ్ళ బేదులు

పసిబిడ్డలకు బేదులు రావడం మామూలే.ఈ రోగం వేల మంది బిడ్డలను బలి తీసుకొంటూ ఉంది. మొదట కొద్ది కొద్దిగా బేదులు కావచ్చు.కాని నీళ్ళ బేదులు పట్టుకుంటే బిడ్డకు అపాయం. ఒక రోజులోనే తోటకూర కాడలాగా వాడి పోతాడు.ఒంటిలో నీరంతా పోతుంది. బిడ్డ బరువు బాగా తగ్గి పోతుంది.తోలు సాగదు.ఒంటేలు పోయడం తగ్గిపోతుంది.అంటే అపాయం ముంచుకొని వచ్చినట్టే. దీనికి ఒకే మందు.నీళ్ళు బాగా కాచి వడబోయాలి. ఒక లోటా నీటిలో చెంచాడు పంచదార, చిటికెడు ఉప్పు వేయాలి.ఈ నీళ్ళు కళ్ళ నీళ్ళంత ఉప్పగా ఉండాలి. ఈ నీళ్ళు బిడ్డకు బాగా తాగించాలి.మొదట వాంతులు రావచ్చు.అయినా ఆపకూడదు. బేదులు వచ్చినపుడు నీళ్ళు తాగించక పోవడం ఎంతో అపాయం.

                        			     మల బద్దకం

చాలామంది మలబద్ధకంతో బాధ పడుతుంటారు.మలబద్ధకానికి చాలా కారణాలు ఉండవచ్చు. వేళకు తిండి తినక పోవడం ఒక కారణం.కడుపు నిండా తినక పోవడం ఒక కారణం.వేళకు దొడ్డికి పోక పోవడం మరో కారణం.నీళ్ళు సరిగా తాగక పోవడం కూడా కారణమే. పై విషయాలలో మెళకువగా ఉండాలి.వేళకు కడుపు నిండా తిండి తినాలి.బాగా నీళ్ళు తాగాలి,వచ్చినా రాకపోయినా వేళకు దొడ్డికి పోవాలి. ఆకు కూరలు, అరటి పళ్ళు తింటే మంచిది.మసాలాకూరలు మంచిది గాదు.పొగ తాగడం మానుకోవాలి బేది మందు అవసరం లేదు. దీనికి అలవాటు పడడం మంచిది గాదు. కాసింత ఉప్పును ఒక లోటానీటిలో కలిపి తాగాలి.పది నిమిషాలలో విరేచనం అవుతుంది.

                            			   వడ దెబ్బ

ఎండాకాలం వచ్చిందంటే చాలు.వేడికి తటుకోలేక మనకు వడ దెబ్బ తగులుతుంది. పసివాళ్ళు, ముసలివాళ్ళు,తాగుబోతులు దీనికి గురవుతారు.కొందరు చచ్చి పోతారు కూడా. మన శరీరంలో చాలా నీరుంటుంది,ఇది చెమటగా ఎండాకాలం బయటకు పోతుంది. కాబట్టి ఒంటిలో నీరు తగ్గి పోతుంది.చెమటతో పాటు ఉప్పు కూడా పోతుంది. అందుచేత శరీరంలో వేడి పెరుగుతుంది.ఒళ్ళు పట్టుకుంటే కాలి పోతుంటుంది.తెలివి తప్పి పడిపోతాం.దీనినే వడ దెబ్బ అంటారు.ఇది చాలా అపాయం. మొదట శరీరం వేడిని తగ్గించాలి.వడ దెబ్బ తగిలిన మనిషిని నీడలో పడుకోబెట్టాలి.ఒంటి మీద గుడ్డలు తీసేయాలి.మంచి నీళ్ళతో శరీరం బాగా తడపాలి.తడి గుడ్డతో మాటి మాటికి తుడవాలి.బాగా గాలి విసరాలి. వేడి తగ్గిందో లేదో నిమిష నిమిషానికి చూడాలి.తగ్గేదాకా తడిగుడ్డతో తుడవడం ఆపకూడదు.తెలివి వచ్చేదాకా ఏమీ తాగించ కూడదు. ఎండాకాలంలో మంచి నీళ్ళు బాగా తాగాలి.ఉప్పు కలిపిన గంజినీళ్ళు,నీరు,మజ్జిగ తాగితే మరీ మంచిది. ఎండకు కొందరికి బలహీనంగా ఉంటుంది.ఇలాంటివారు ఉప్పు,పంచదార కలిపిన నీరు తాగడం ఎంతో మంచిది.

                       			    పొగరాక్షసి

చాలా మందికి బీడీ తాగడం సరదా,సిగరెట్టు తాగడం ఎంతో గొప్ప.చుట్ట తాగడం చెప్పలేని ఆనందం.పొగతాగడం అంటే ఆయుస్సు పోగొట్టుకోవడమే.ఇది చాలా మందికి తెలియదు. చుట్ట,బీడీ,సిగరెట్టు ఏదైనా ఒకటే.వీటిలో ఒకటి మంచిది,ఒకటి చెడ్డది అనలేము. పళ్ళు ఊడగొట్టు కోవడానికి ఏ రాయి అయినా ఒకటేగదా!అలాగే ఇవి కూడా. పొగతాగిన వాడి నోటికి రుచి పోతుంది.గొంతులో,కడుపులో మంట మొదలవుతుంది.పుండు పడుతుంది.తిండి అరగదు.మలబద్దకం కలుగుతుంది.తలనొప్పి పుడుతుంది. అంతటితో ఆరోగాలు ఆగవు.క్షయ రోగం తగులు కొంటుంది.కడుపులో నోటిలో పుట్ట కురుపులు గూడా పుడతాయి.ఇవి నయంగావు. పొగ తాగేవాడి దగ్గర మనం ఉండగూడదు.తాగడం కంటె ఇది అపాయం.కడుపుతో ఉండేవాళ్ళకు మరీ అపాయం.కడుపు పోవచ్చు.నెలలు నిండకముందే బిడ్డలు పుట్టవచ్చు.పుట్టిన బిడ్డలు అవిటి వాళ్ళు గావచ్చు. పొగాకు నమలడం కూడా ఇలాంటిదే.పొగ తాగడం సులభంగా మానుకోవచ్చు.అయితే పట్టుదల ఉండాలి.

                   				       మంచి నీళ్ళు

మనం తాగే నీళ్ళే మన రోగాలకు మూలం.నీళ్ళలో రకరకాల రోగాల పురుగులు ఉంటాయి.ఇవి మన కంటికి కనబడవు.వీటి నుంచి మనకు రోగాలు అంటు కొంటాయి. నీళ్ళ బేదులు,కలరా,పసిరికలు,టైఫాయిడు లాంటి జబ్బులకు నీళ్ళే కారణం,పసి బిడ్డలు వీటికి సులభంగా బలైపోతారు. మనం చెరువులో,దొరువులలో నీళ్ళు తాగ గూడదు.దిగుడు బావుల నీళ్ళు కూడా మంచిదిగాదు.బోరింగు నీళ్ళు తాగడం మంచిది. బావి చుట్టూ,బోరింగు చుట్టూ మురికి నీళ్ళు నిలబడకుండా చూచుకోవాలి. పొలం పోయేటపుడు నీళ్ళు తీసుకొని పోవాలి. నీళ్ళు మరగ కాయాలి.వేడి తగ్గాక తాగడానికి వాడుకోవాలి.పసి బిడ్డలకు ఈ నీళ్ళే తాగించాలి.దీని వలన జబ్బులేరావు.మనం గూడా ఈ నీళ్ళు తాగితే మరీ మంచిది.వానా కాలం ఇది మరీ అవసరం. ఊళ్ళో మంచి నీటి సదుపాయం లేకుంటే అడగాలి.సాధించు కోవాలి.దీనికి ఆడవాళ్ళు ముందు వుండాలి.

మీరు_నయం_చేసుకోవచ్చు.txt · Last modified: 2018/03/24 11:13 (external edit)