User Tools

Site Tools


నా_పిల్ల_ఎక్కడ

This is an old revision of the document!


                      		నా పిల్లలను ఎవరు రక్షిస్తారు?

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పిల్లి తన బిడ్డలతో వుండేది. పిల్లి పిల్ల ఎలుకలను కుందేలును తరుముతూ ఆడుకుంటూ ఉండేది.

 ఒకరోజు పిల్లి పిల్ల చెట్టు ఎక్కి కూచుంది. కానీ అది దిగలేక పోయింది.
 అమ్మా!నేను దిగలేను. నాకు భయం వేస్తుంది. అని కేక పెట్టింది. పిల్లను ఎలా దించాలా అని తల్లి ఆలోచించింది. ఎవరైనా సాయం చేస్తారేమోనని పరుగెత్తింది. దారిలో దానికి ఒక తాబేలు కనబడింది.
"అక్కా, అక్కా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతోంది. దానిని కిందకు తీసుకురావా?" అని బతిమాలింది.
"చెల్లెమ్మా! నేను చెట్టు ఎక్కలేను. నీ బిడ్డను కిందికి తీసుకురాలేనమ్మా" అని తాబేలు చెప్పింది.
పిల్లి ఇంకా కొంచెం దూరం పోయింది. దానికి ఒక గుర్రం కనబడింది.
"అన్నయ్యా!అన్నయ్యా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతోంది. దాన్ని కిందకు తీసుకురావా?"అని బతిమాలింది.
"చెల్లెమ్మా! నేను చెట్టు ఎక్కలేను. నీ బిడ్డను కిందకు తీసుకురాలేనమ్మా" అని గుర్రం చెప్పింది.
పిల్లి ఇంకా కొంచెం దూరం పోయింది. దానికి ఒక ఏనుగు కనబడింది.
"అక్కా!అక్కా! నా బిడ్డ చెట్టు ఎక్కి దిగలేక పోతున్నది.దాన్ని కిందకు తీసుకురావా?" అని బతిమాలింది. ఏనుగు 'సరే పోదాం పదా అంటూ పిల్లి వెంట బయలుదేరింది. చెట్టు దగ్గరికి వెళ్ళింది. తొండంతో పిల్లి పిల్లను పట్టుకుని చెట్టు మీది నుంచి దించింది. పిల్లిపిల్లను రక్షించింది.
                   				 మూడు వరాలు
అనగా అనగా ఒక ఊరు.ఆ వూరి పక్కనే ఒక అడవి. ఆ అడవిలో దేవతాస్త్రీలు తిరుగుతుంటారని చెప్పుకొనేవారు. వాళ్ళకు ఎన్నో మహిమలుంటాయని అంటారు. అందుకని ఎవరూ ఆ అడవి లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు.
   ఆ ఊళ్ళో రాముడనే పేదవాడు ఉండేవాడు. వాడి భార్య సీతాలు. రాముడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేవాడు. వాటిని అమ్మి డబ్బులు తెచ్చి భార్యకిచ్చేవాడు. 
 ఒకరోజు కట్టెలు కొడుతున్నాడు. ఇంతలో "నన్ను కాపాడండి" అని ఒక స్త్రీ అరుపు వినబడింది. అటు ఇటు చూశాడు. ఒక స్త్రీ కాలుమీద చెట్టు కొమ్మ పడి ఉంది.వెంటనే రాముడు వెళ్ళి కొమ్మ తీసి ఆమెను కాపాడినాడు.
  ఆమె దేవతాస్త్రీ. రాముడు చేసిన సహాయానికి సంతోషించింది. "నేను నీకు, నీ భార్యకు మూడు వరాలు ఇస్తున్నాను. బాగా ఆలోచించి ఆ వరాలు కోరుకో" అని చెప్పి మాయమై పోయింది. రాముడు గబగబ ఇంటికెళ్ళాడు. ఈ సంగతి సీతాలుకు చెప్పాడు. సీతాలు ఆనందం పట్టలేక పోయింది.
 "ఒక పెద్ద ఇల్లు కోరుకుందామా? చాలా డబ్బు కోరుకుందామా?" అని సీతాలు ఆపకుండా మాట్లాడసాగింది. రాముడికి కోపం వచ్చింది.
 "నాకు ఆకలిగా వుంది. ముందు నాకు ఇడ్లీలు కావాలి" అన్నాడు. ఒక పెద్ద పళ్ళెం నిండా ఇడ్లీలు వచ్చాయి. ఒక వరం వృధా అయిందని సీతాలుకు కోపం వచ్చింది.
నువ్వు తెలివిలేనివాడివి. ఇలాంటి వరమా కోరుకొనేది? ఈ ఇడ్లీలు నీ ముక్కుకి కరుచుకోవాలి" అనింది.  
వెంటనే ఇడ్లీలు రాముడి ముక్కుకు కరచుకున్నాయి. రాముడూ, సీతాలు ఎంతలాగినా అవి ఊడి రాలేదు.
"నీ తెలివి తక్కువ మూలంగా రెండో వరం కూడా పోయింది" అని రాముడు సీతాలును అరిచాడు.
ఏమయ్యా ఇంకో వరం ఉందిగదా? పెద్ద ఇల్లు, కావాలసినంత ధనం కోరుకుందాం" అంది సీతాలు.
"వద్దు సీతాలు. ఈ ఇడ్లీలు ఎప్పుడూ నా ముక్కుకు కరుచుకొనే ఉంటాయి. ఇలా బతకలేను. ఇడ్లీలు నా ముక్కు నుండి మళ్ళీ పళ్ళెంలోకి రావాలి". అని రాముడు కోరుకున్నాడు. దీంతో మూడు వరాలు అయిపోయాయి. ఇడ్లీలు మాత్రమే మిగిలాయి.రాముడు,సీతాలు ఇద్దరూ నవ్వుకుంటూ ఇడ్లీలు తిన్నారు.
                         				 వేటగాడు
అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో శీనయ్య. రమణమ్మ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళు. శీనయ్య రోజూ పిట్టలు పట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మి డబ్బులు తెచ్చి ఇచ్చేవాడు.
 ఒకరోజు ఒక అందమైన పిట్ట వలలో చిక్కుకుంది. "శీనయ్యా, శీనయ్యా! నన్ను వదిలిపెట్టు. నేను పిట్టల రాణిని, నీకు వరాలిస్తాను" అని చెప్పింది పిట్ట.
  ఆ పిట్ట మాటలు విని శీనయ్య ఆశ్చర్యపోయాడు. మంచివాడు కనుక ఆ పిట్టను వదిలిపెట్టేశాడు. "నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను" అని చెప్పి పిట్ట వెళ్ళిపోయింది.
శీనయ్య ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు చెప్పాడు.

“నువ్వు ఇప్పుడే వెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలి” అని ఆ పిట్టను అడగమని తరిమింది.

 శీనయ్య అడవికి వెళ్ళి "పిట్టల రాణీ!పిట్టల రాణీ!" అని పిలిచాడు. 
 పిట్టల రాణి వచ్చింది. 
  "పిట్టల రాణీ! నా భార్య ఒక ఇల్లు కావాలని పోరు చెస్తున్నది" అని చెప్పాడు.
   "అలాగే నువ్వు ఇంటికి పోయి చూడు" అని చెప్పి పిట్టల రాణి ఎగిరిపోయింది.
   శీనయ్య ఇంటికి పోయి చుస్తే, గుడిసె ఉన్న చోట ముచ్చటయిన ఇల్లు ఉంది. దాని ముందు అందమయిన తోట కూడా ఉంది. తన భార్య మంచి గుడ్డలు వేసుకొని తోటలో ఉంది.
   కొంతకాలం సంతోషంగా గడిచింది. రమణమ్మకు రాణిని కావాలని కోరిక పుట్టింది. ఈ సంగతిచెప్పి పిట్టలరాణిని అడిగిరమ్మని శీనయ్యను అడవికి తరిమింది.
శీనయ్య అడవికి వెళ్ళాడు.
"పిట్టలరాణీ!పిట్టల రాణీ!" అని పిలిచాడు.
 పిట్టలరాణి కనబడింది.
 "పిట్టల రాణీ! నాభార్య ఈ దేశానికి రాణీ కావాలని అడగమంది" అని చెప్పాడు.
 "అలాగే నువ్వు ఇంటికి వెళ్ళి చూడు" అని చెప్పి పిట్టల రాణి ఎగిరిపోయింది.
 శీనయ్య ఇంటికి వెళ్ళి చూసాడు. తన భార్య పెద్ద మేడలో ఉంది. ఆమె ముందు మంత్రులు ఉన్నారు.
 కొన్ని రోజులు సంతోషంగా గడిచాయి.
 "పిట్టల రాణిని కట్టేసి తీసుకురా! మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఏ లోటు ఉండదు" అని చెప్పి రమణమ్మ ఒక రోజు భర్తను తరిమింది. 
  శీనయ్య అడవికి వెళ్ళి"పిట్టలరాణీ!పిట్టల రాణీ!" అని పిలిచాడు.
  పిట్టలరాణి కనబడింది.
   "నా భార్య నిన్నే కట్టేసి తీసుకురమ్మంది" అని చెప్పాడు. 
   "ఇంత ఆశబోతుతనం పనికిరాదు. ఈ సంగతి నీ భార్యతో చెప్పు" అని పిట్టలరాణీ ఎగిరిపోయింది.
  శీనయ్య ఇంటికి వెళ్ళాడు. రాజ భవనం ఉన్న చోట తన పాత గుడిసె ఉంది. భార్య దిగులుతో కూచుని వుంది.
                         			నా పిల్ల ఎక్కడ?
ఒక ఊరిలో ఒక కోడి తన అయిదుగురు పిల్లలతో కాపురం చేస్తుండేది. అది రోజూ కోడిపిల్లల్ని తీసుకెళ్ళి పురుగులు, గింజలు తినిపించేది. 
  ఒక రోజు అది పిల్లలతో పాటు బయటికి వెళ్ళింది. కొంచెంసేపు తరువాత పిల్లలను లెక్క పెట్టింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదవ పిల్ల కనపడలేదు. కోడి వెతుక్కుంటూ వెళ్ళింది.
ఒక మేక కనపడింది.
"తమ్ముడూ! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దాన్ని చూసావా?" అని కోడి అడిగింది.
"లేదక్కా! నాకు కనబడలేదు" అని మేక చెప్పింది.
 ఇంకా కొంచెం దూరం పోతే ఒక ఎలుక కనబడింది.
 "తమ్ముడూ! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దానిని చూసావా?" అని అడిగింది. 
 "లేదక్కా! నాకు కనబడలేదు" అని చెప్పింది. కోడి వెతుక్కుంటూ ఇంకా కొంచెం దూరం పోయింది. 
 ఒక కోతి కనబడింది.
 "కోతిబావా! నా పిల్ల కనబడటం లేదు. నువ్వు దాన్ని చూసావా?" అని అడిగింది. 
 "చూసాను! అదిగో అక్కడ చూడు. అది నక్కతో మాట్లాడుతూ ఉంది" అని కోతి చెప్పింది. 
   కోడి పిల్ల నక్కకు మాటలు చెపుతోంది. కోడి గబుక్కున పిల్లను లాగేసుకొంది. కొంచెం ఆలస్యమైతే ఏమయ్యేది?
                                         
			   సాలెపురుగు-ఈగ
 నెల్లూరులో వెలగచెట్టు సంగం అనే పేట ఉంది. ఆ పేటలో ఒక పూరిల్లు వుంది. ఆ పూరింట్లో ఒక సాలెపురుగు కాపురం వుందేది. 
 ఒక రోజు ఒక ఈగ ఆ ఇంటి దగ్గరికి వచ్చింది."రామ్మా ఈగా! నీ పేరేమితి?" అని సాలె పురుగు అడిగింది. "నా పేరు స్వరూపరాణి" అని ఈగ చెప్పింది.
 "అబ్బా! నీ పేరు నీ అందానికి తగిన పేరు. మా ఇంతికి రామ్మా" అని సాలెపురుగు పిలిచింది.
  "అమ్మో! నేను రాను. వస్తే నువ్వు నన్ను తినేస్తావు" అని ఈగ అన్నది.
  "నీవంటి అందమైనదాన్ని తింటే కళ్ళు పోతాయి. ఇంట్లోకి వచ్చి చాక్లెట్ తిని పోదువు రామ్మా" అని సాలెపురుగు బతిమాలింది. 
  ఈగ సాలెపురుగు మాటలు నమ్మింది. ఇంట్లో అడుగు పెట్టింది. 
  తరువాత జరిగిన కథ ఏమిటి? చెప్పండి చూద్దాం.
                   			 ఐదుగురు అన్నదమ్ములు
 అనగనగా ఒక ఊరిలో ఐదుగురు అన్నదమ్ములు ఉండే వారు. వారి పేర్లు పుల్లయ్య, మల్లయ్య, ఎల్లయ్య, శేషయ్య, గురవయ్య.
 "నాయనా మీరు నదికి పోయి చేపలు పట్టుకురండి. కూర వండుతాను", అని వారితో ఒకరోజు అమ్మ అంది.
 వాళ్లు కొంచెం అమాయకులు. అందరూ కలలి నదికి వెళ్ళారు. నది ఒడ్డున దూర దూరంగా కూర్చున్నారు. వల నీళ్ళల్లో వేసారు. 
 "నాకు ఒక చేప చిక్కింది." అని అందరూ అరిచారు.
 తరువాత పెద్ద అబ్బాయి పుల్లయ్య,1,2,3,4 అని తమ్ములను లెక్క పెట్టాడు. ఇలా అందరూ 1,2,3,4 అని లెక్క పెట్టి బోరున ఏడవసాగారు.
 "నాయనా ఎందుకు మీరు ఏడుస్తున్నారు" అని ఆ దారిన పొయే ఒక రైతు అడిగాడు. 

“మేము ఐదుగురం అన్నదమ్ములం. ఇప్పుడు నలుగురమే ఉన్నాము. ఒకడు నీళ్ళలో మునిగి పోయాడు. కనిపించడం లేదు” అని చెప్పాడు. ఆ రైతు నవ్వాడు. అందరినీ వరుసలో నిలబెట్టాడు. 1,2,3,4,5 అని లెక్క పెట్టాడు. అప్పుడు అందరం ఉన్నామని ఆ వెర్రివాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు.

                                                 		  పాయసం

ఒక కుందేలుకు పాయసం తాగాలని కోరిక పుట్టింది. కానీ ఇంట్లో పాయసం చేయడానికి వస్తువులు లేవు.

  ప్రక్క ఇంట్లో ఉన్న ఉడుత దగ్గరికి వెళ్ళింది.
 "వదినా! నేను పాయసం చేసుకుంటున్నాను. కొద్దిగా చక్కెర తక్కువ పడింది. ఒక కప్పు చక్కెర అప్పు ఇవ్వవా?" అని అడిగింది.
 ఉడుత చక్కెర ఇచ్చింది.
 తర్వాత కుందేలు ఆవు దగ్గరికి వెళ్ళింది.
 పెద్దమ్మా! నేను పాయసం చేసుకుంటున్నాను. ఒక కప్పు పాలు అప్పుగా ఇస్తావా?" అని అడిగింది. 
 "ఆ చేత్తోనే కొంచెం నెయ్యి కూడా ఇవ్వవా" అని అడిగింది. 
 ఆవు పాలు, నెయ్యి ఇచ్చింది.
 చక్కెర, సేమ్యా,పాలు, నెయ్యి అన్నీ వేసి కుందేలు పాయసం చేసుకుంది. బాగా తిని పడుకుంది. 
నా_పిల్ల_ఎక్కడ.1321724313.txt.gz · Last modified: 2018/03/24 11:13 (external edit)