User Tools

Site Tools


ఎలుకలు_బాబోయ్_ఎలుకలు

This is an old revision of the document!


				ఎలుకలు బాబోయ్ ఎలుకలు

చాలా ఏళ్ల కిందటి మాట. ఇంగ్లాండులో స్మిత్ అనే ఓ పెద్దమనిషి ఉండేవాడు. అతనికి ఒక కూరగాయల దుకాణం ఉండేది. నలుగురు కొడుకులు. అందరికన్నా పెద్దవాడి పేరు జార్జి. పెద్దయ్యాక తండ్రి కూరగాయల కొట్టుని వాడే నడిపించాలని అనుకున్నారు. బడిలో జార్జి వృక్షశాస్త్రం చదివాడు. క్యాబేజీలో వున్న నూట తొంబై రకాల గురించి చదివాడు. ముఫ్ఫై తొమ్మిది రకాల పాలకూర గురించి తెలుసుకున్నాడు. క్యాబేజీకి పట్టే డెబ్బై రకాల వేరు వేరు పురుగులను గుర్తు పట్టడం నేర్చుకున్నాడు. వాటి మీద సొంతంగా చేసిన పురుగుల మందులను చల్లి చూసాడు. ఫలితాలు గొప్ప ఆశ్చర్యం కల్గించాయి. సబ్బునీళ్ళు చల్లడం వల్ల క్యాబేజీ ఆకుపచ్చ రంగు పురుగులు బయటకు వచ్చేసాయి. పొగాకు రసం చిమ్మితే రంగు రంగుల పురుగులు పరిగెత్తుకొచ్చాయి. ఉప్పునీళ్ళు చల్లగానే మిగతా పెద్దపెద్ద పురుగులన్నీ బయటికొచ్చాయి. అందుకే జార్జి పెద్దవాడయ్యాక - మొత్తం లండన్ నగరంలోనే అతని కూరగాయల కొట్టు పేరు పొందింది. అతని దగ్గర కొన్న క్యాబేజీ(గోబిపువ్వులో) ఒక్క పురుగైనా ఉండేది కాదు. అయితే….స్మిత్ గారికి ఒకే దుకాణం ఉంది. మిగతా ముగ్గురు కొడుకులు ఏం చెయ్యాలి? అందుకే వాళ్ళు వేరే వృత్తుల్లో తమ అదృష్టాన్ని చూసుకోవలసి వచ్చింది. రెండో కొడుకుని అందరూ జిమ్ అనేవారు. అతని అసలు పేరు మాత్రం జేమ్సు. అతను ఇంగ్లీషులో ఉద్దండుడు. స్కూల్లో మంచి వ్యాసం రాసి బహుమతి గెల్చుకున్నాడు. బడిలో ఫుట్ బాల్ టీముకి అతనే కెప్టెన్. మ్యాజిక్ చేయడంలో కూడా చురుగ్గా ఉండేవాడు. బడిలో టీచర్లు ఎన్నోసార్లు అతడి దెయ్యం పనులకు బలైపోయారు. ఒకసారి అతడు చాక్ పీస్ లో కన్నం చేసాడు. అందులో ఒక అగ్గిపుల్ల తలకాయను కూరాడు. పక్కరోజు పంతులు గారు ఇలా బోర్డు మీద రాసారో లేదో - భగ్గున మంట పుట్టింది. పాపం పంతులుగారు బిత్తరపోయారు. క్లాసంతా ఒకటే గొడవ. తర్వాత చాలా సేపటి వరకు పాఠం సాగలేదు. మరోసారి జేమ్సు సిరిబుడ్డిలో మిధిలేటెడ్ స్పిరిట్ కలిపేసాడు. దాని మూలంగా పెన్నుల్లో ఇంకు నిలవకుండా జరజరా కారిపోయింది. అప్పుడు పంతులుగారు మొత్తం సిరాబుడ్లలోని సిరా మార్చవలసి వచ్చింది. ఇదంతా అయ్యేసరికి దగ్గర దగ్గర అరగంట పట్టింది. ఇక ఆ రోజు ఫ్రెంచి పీరియడ్ చదువు ఏ మాత్రం కొనసాగలేదు. జిమ్ కి ఫ్రెంచి భాష పడేది కాదు. దాన్ని చూస్తే వళ్లు మండిపోయేది. అలాగని అతడు చిన్న చిన్న అల్లరి పనులు చేసేవాడు కాదు. ఉదాహరణకు టీచర్ సొరుగులో ఎన్నడూ చచ్చిన ఎలకను దాయలేదు. మూడోవాడి పేరు ఛార్లెస్. లెక్కల్లోను, చరిత్రలోను ఉద్దండడు. క్రికెట్ టీమ్ లో ఎడమ చేతి బౌలరు కూడా. ఐతే అతనికి రసాయన శాస్త్రమంటే ప్రాణం. మొత్తం బడిలో ఏ కుర్రాడైనా “పైరా డీమితైల్ అమినో బెంజల్ హీహైడ్” తయారు చేసారు అంటే - అది ఛార్లెస్ మాత్రమే. ఈ రసాయనం చెయ్యడం చాలా కష్టం. ఛార్లెస్ రకరకాల రసాయనాలు తయారు చేసేవాడు. ఏన్నో రకాల రసాయనిక ధర్మాలు అతనికి తెలుసు. ముక్కు బద్దలయ్యేంత కంపు కొట్టే పదార్దాలు కూడా ఇట్టే తయారు చేయగల్గేవాడు. అందరినీ ఏడ్పించగలిగేవాడు. అయితే అతను అలా ఎన్నడూ చెయ్యలేదు. ఎందుకంటే అతనొక మంచి పిల్లవాడు. ఒకవేళ కంపుగొట్టే రసాయనాలు చేసి ఏడిపిస్తే - అతడ్ని రసాయనశాస్త్రం చదవ నిచ్చేవారు కాదు. అతనికేమో బతుకంతా రసాయనశాస్త్రం చదవాలని కోరిక. నాల్గో పిల్లాడి పేరు జాక్. అతను చదువులో ఏమంత చురుగ్గా లేడు. ఆటల్లో కూడా అంతే. ఒక్కనాడైనా ఫుట్ బాల్ ని తిన్నగా తన్నలేదు. క్రికెట్ మ్యాచ్ లో ఒకసారొ ఫీల్డింగ్ చేస్తూ చేస్తూ నిద్రపోయాడు. అతను ఎందులోనైనా పండితుడు అంటే - అది ' వైర్ లెస్ ' లో మాత్రమే. అతడు ఇంట్లో సొంతంగా ఒక వైర్ లెస్ సెట్ తయారు చేసుకున్నాడు. కేవలం దాని వాల్వు మాత్రమే బజారులో కొన్నాడు. ఈ కధ మొదలయ్యేనాటికి - అతను వాల్వు తయారు చేయడం నేర్చుకుంటున్నాడు. అతనికి ఓ ముసలి నానమ్మ ఉంది. ఆవిడ పేరు మటీల్డా. ఆమె చాలా ముసలిది. లండన్ నుంచి డోవర్ వరకు వేసిన రైల్వేలైను ఆమె చిన్నప్పుడూ వేసినది. ఆమె నడవలేక పోయేది. ఎప్పుడూ మంచం మీదే పడుకొని ఉండేది. జాక్ ఆవిడ కోసం ఒక జత 'ఇయర్ ఫోన్'లు తయారు చేసాడు. వాటిని చెవుల్లో పెట్టుకొని ముసలావిడ రోజంతా సంగీతం వింటూ గడిపేది. కరెంటుతో పని చేసే వస్తువులన్నీ చేయడంలో జాక్ నిపుణుడు. అతను కరెంటు మీటరులో ఓ కొత్త యంత్రం అమర్చాడు. దానిమూలంగా ఫాన్లు మామూలుగానే నడుస్తాయి. బల్బులు కాలుతూనే ఉంటాయి. అయినా మీటరు తిరగదు. వారం రోజుల వరకు మీటరు ఒకే నెంబరు దగ్గర ఆగిపోయింది. వాళ్ళ నాన్నకు ఈ విషయం తెలిసింది. ఆయన బాగా కోప్పడ్డాడు.

“మనం ఇలాంటి వెధవ పనులు చేయకూడదు. కరెంటు దొంగతనం నేరం” అన్నాడు నాన్న. “ఇందులో దొంగతనం ఏమీ లేదు నాన్నా. ఒకటి - కరెంటు గవర్నమెంటు ఇస్తుంది. మనుషులు కాదు. రెండు - కరెంటు బల్బుల నుంచి పోయి మళ్ళీ మెయిన్ లైన్ కి చేరుకుంటుంది. మనం కరెంటుని మన దగ్గిర ఉంచుకోము. మనం దాన్ని కొంచెం సేపటి కోసం అరువు తీసుకుంటాము. అంతే” అన్నాడు జాక్. అయినాసరే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. మీటరు మీద పెట్టిన యంత్రం తీయించేసాడు. ఎందుకంటే ఆయన నిజాయితీతో బతికే పెద్ద మనిషి. అందుకే ఆయన కరెంటు కంపెనీకి నష్ట పరిహారం కూడా ఇచ్చాడు. స్మిత్ గారికి ఓ కూతురు కూడా ఉంది. ఆమె అసలు పేరు లూసేన్. అందరూ ఆమెని 'పాజీ' అని పిలిచేవారు. ఈ కధలో ఆమె పాత్ర ఏమంత పెద్దగా లేదు. అందుకే ఆమె గురుంచి చివర్లో చెబుతాను. చిన్నప్పుడు ఆమె పళ్ళు బయటకు పొడుచుకొచ్చి ఉండేవి. చివర్లో అవి సరిగ్గా కుదురుకున్నాయి. సరే. ఇక ఇప్పుడు అసలు కధలోకి వద్దాం. ఆ రోజుల్లో లండన్ ఓడరేవులో ఎలకలు భీభత్సం సృష్టించేవి. అవి మహా భయంకరమైన ఎలకలు. వాటి తాత ముత్తాతలు టీపొడి, అల్లం, పట్టు, బియ్యం సంచులలో దాక్కొని లండన్ కు వచ్చాయి. హాంకాంగ్ నుంచి స్టీమర్లలో అక్కడికి వచ్చాయి. ఇంగ్లాండులో ధాన్యం గింజలు తక్కువ పండుతాయి. అందుకే అక్కడ తిండిగింజల్నీ వేరే దేశాల నుంచి తెప్పించుకునేవారు. విదేశాల నుంచి వచ్చిన తిండిగింజల్ని ఎలకలు మాయం చేసి పారేసేవి. అవి కెనడా నుంచి గోదుమల్ని, హాలెండ్ నుంచి వచ్చే జున్నుని బొక్కేసేవి. న్యూజిలాండ్ నుంచి వచ్చే మాంసం ముక్కల్ని, అర్జెంటీనా నుంచి వచ్చే తాజా పెరుగుని మింగి పారేసేవి. ఇరాన్ నుంచి వచ్చే అతి చక్కని కంబళ్ళను ముక్కలు ముక్కలు చేసి తమ కలుగుల్లోకి తీసుకుపోయేవి. వాటితో అక్కడ పక్కలు వేసుకునేవి. సరుకులు స్వాహా చేసాక - చైనా నుంచి వచ్చే పట్టు రుమాళ్ళతో తమ కాళ్లూ, చేతులూ తుడుచుకొనేవి. లండన్ లోని అన్ని ఓడరేవుల పెద్ద అధికారిని 'లండన్ ఫోర్టు అధారిటీ ఛైర్మన్' అనేవారు. అది గొప్ప హోదా ఉన్న పదవి. ఛైర్మన్ గారి ఆఫీసులోని అలంకారం - ఇంగ్లాండు మహారాణి మహలు కంటే తక్కువగా ఏమీ ఉండేది కాదు. అన్నీ బాగున్నాయి. కాని ఎలకలతో మహా బేజారుగా ఉంది. ఎలకలతో ఛైర్మన్ గారి తలబొప్పి కట్టేసింది. బయటి దేశాల నుంచి వచ్చిన సరుకులంతా ఓడరేవులో దిగేది. అక్కడి నుంచి ట్రక్కుల్లో, రైళ్ళలో, తోపుడు బళ్ళలో వేరే ఊళ్లకి వెళ్ళేది. ఆ సరుకు ఓడరేవులో ఉన్నంతవరకూ, పూర్తి బాధ్యత ఛైర్మన్ గారిదే. అందుకే ఎలకలు తినేసే సరుకుకి పాపం ఛైర్మన్ గారే డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఛైర్మన్ గారు లండన్ లోని పెద్దపెద్ద ఎలకల వేటగాళ్ళని పిలిచారు. అయితే వాళ్ళు ఓ వందో రెండొందలో ఎలకలు మాత్రమే పట్టుకున్నారు. అంతే. అంతకు మించి పట్టుకోలేకపోయారు. ఆ ఎలకలు గొప్ప చలాకీగా ఉండేవి. వాటికి ఓ రాజు కూడా ఉండేవాడు. ఆ ఎలకల రాజు నేలలో ఎంతో లోతుగా ఉన్న ఓ కలుగులో ఉండేవాడు. మిగతా ఎలకలు రాజుగారి కోసం ఒకదాన్ని మించి మరొకటి చక్కని వంటకాలు తీసుకొచ్చేవి. రాజు కోసం - స్విట్జర్లాండ్ కు చెందిన క్రీం చాక్ లెట్లు, ఫ్రాన్సు నుంచి వచ్చిన మాంసం ముక్కలు, అల్జీరియా నుంచి వచ్చిన ఎండు ఖర్జూరాలు తీసుకొచ్చేవి. అన్ని ఎలకలూ తమ రాజుగారి ఆజ్ఞలు పాటించేవి. ఏదైనా ఎలక పట్టుబడితే - రాజుగారి ప్రత్యేక దూతలు మిగతా ఎలకలకి ఆ ప్రమాదం గురుంచి హెచ్చరించేవి. ఎలకల రాజు దగ్గర వీరాధివీరులైన(అరివీర భయంకరమైన) ఒక పదివేల ఎలకల సైన్యం ఉండేది. ఈ సైన్యం ఎంత గట్టిదంటే - ఏ జంతువునైనా ఎదుర్కోడానికి ధైర్యం చేసేది. ఏదైనా ఒక కుక్క తీరికగా ఓ రెండు మూడు ఎలకల్ని చంపగలదు. ఒక్కసారిగా ఓ వంద ఎలకలు దాని మీద దాడి చేస్తే అదిఏం చేయగలదు? మహా అయితే ఓ నాల్గైదు ఎలకల్ని చంపుతుంది. చివరకు ఎలకల చేతిలో చస్తుంది. అవునా? కొన్ని ఎలకల పళ్లు మహా పదునుగా ఉండేవి. అవి ఇంజనీరింగ్ నేర్చుకొనేవి. ఈ ఎలకలు తమ పదునైన దంతాలతో - ఎలాంటి బోను చువ్వలనైనా ఇట్టే కొరికేసేవి. వాటిలో పట్టుబడ్డ ఎలకల్ని విడిపించేవి. ఒక్క నెలలో ఈ ఎలకలు ఎంత ఆగడం చేసాయో తెలుసా. నూట ఎనభై ఒక్క పిల్లుల్ని, ముఫ్ఫై తొమ్మిది కుక్కల్ని నల్లకాటికి పంపించాయి. లెక్కలేనన్ని కుక్కలు, పిల్లులు వాటి బారిన పడి బాగా గాయపడ్డాయి. పాపం అవి ఎంతగా బెదిరిపోయాయంటే - దూరంగా ఎలక వాసన వస్తే చాలు, భయంతో పరుగు పెట్టేవి. ఇంజనీరు ఎలకలు ఆరు వందల పద్దెనిమిది ఎలుకల బోన్ల నుండి మొత్తం ఏడు వందల నలభై రెండు ఎలకల్ని విడిపించాయి. దాంతో ఎలకలు పట్టి బతికేవాళ్లు- ఆ పనికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. మందుల షాపు నుంచి(కెమిస్టు దుకాణం నుంచి) అనేక రకాల ఎలకల మందులు తెచ్చారు. వాటిని తినే పదార్ధాల్లో కలిపి ఓడరేవు నిండా చల్లారు. ఈ సంగతి ఎలకల రాజుకి తెలిసింది. అది వెంటనే ఇలా ఆజ్ఞ ఇచ్చింది- “ఎక్కడ పడితే అక్కడ తినొద్దు. డబ్బాలు, డ్రమ్ములు, సంచులు - వీటిలో ఉన్న వాటినే తినాలి.” దాంతో రాజు మాటలు వినని ఎలకలు మాత్రమే చచ్చిపోయాయి. రాజు మాట వినని ఎలకలు తిరుగుబాటుదార్లు కదా. ఈ తిరుగుబాటుదార్లు చచ్చిపోయినందుకు కొన్ని ఎలకలు పండగ చేసుకున్నాయి. కుక్కలు, పిల్లులు, ఎలకల బోన్ల లాగే విషం కూడా ఎలకల్ని చంపలేకపోయింది. దాంతో ఓడరేవుల ఛైర్మన్ గారు బేజారెత్తిపోయారు. ఒకనాడు పెద్దలందరితో పెద్ద మీటింగు పెట్టారు. “ఈ ఎలకల పీడ వదలడానికి ఏదన్నా ఉపాయం చెప్పండి” అని అందరినీ అడిగారు. ఒకొక్కరు ఒక్కో ఉపాయం చెప్పారు. చివరకు వైస్ ఛైర్మన్ గారు దీని గురుంచి పేపర్లో ప్రకటన ఇమ్మని సలహా ఇచ్చాడు. మరుసటి వారం అన్ని పేపర్లలో ఒక ప్రకటన అచ్చయింది. ప్రకటన పూర్తిగా ఒక పేజీడు ఉంది. తాటికాయంత అక్షరాలతో ఉంది. ఇంగ్లాండులోని జనమంతా చదవాలని అలా వేసారు. స్మిత్ గారి ఇంటిలో అందరూ ఆ ప్రకటన ఆసక్తితో చదివారు. నాయనమ్మ మట్టిల్డా మాత్రం దాన్ని చదవలేకపోయింది. నాయనమ్మ పేపరు ఎన్నడూ చదివేది కాదు. సంగతులన్నీ రేడియో వినే తెలుసుకునేది. ఈ ప్రకటన ముందు పేపర్లోని మిగతా వార్తలన్నీ తీసికట్టయ్యాయి. ఎలకల బారి నుండి ఓడరేవుల్ని రక్షించిన వారికి లక్ష పౌండ్లు (ఇంగ్లాండు రూపాయలు) ఇనాముగా ఇస్తానని ఛైర్మన్ గారు ప్రకటించారు. దాంతో పాటు ఛైర్మన్ గారి ఏకైక కూతురుని - ఆ మనిషికిచ్చి పెళ్ళి చేస్తానని ప్రమాణం చేసారు. (ఒకవేళ ఆ మనిషికి పెళ్ళి -గిళ్ళి ముందే అయిపోతే రెండోసారి పెళ్ళికి ఒప్పుకోరు. దానికి బదులు అతని భార్యకి ఒక వజ్రాల దువ్వెనను ఇస్తారు) ప్రకటనలో లక్ష పౌండ్లు విలువ చేసే బంగారు నాణాల బొమ్మ వేసారు. కాగితాల నోట్లు వేయలేదు. వాటితో ఛైర్మన్ గారి కూతురి ఫోటో వేసారు. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది. ఆమె జుత్తు బంగారు రంగులో ఉంగరాలు తిరిగి ఉంది. కళ్లు నీలంగా ఉన్నాయి. ఆ అమ్మాయికి వయోలిన్ వాయించడం వచ్చు. ఈతలోను, స్కేటింగ్ లోను బోలెడన్ని బహుమతులు గెల్చుకుంది. పోటీలో పాల్గొనే వారు ఎలకలు చంపడానికి కావలసిన మొత్తం సరంజామా వాళ్ళే తెచ్చుకోవాలి. దాంతో పోటీకి వచ్చే వాళ్ళకి ఇది చాలా ఖరిదైన వ్యవహారం అయింది. అయినప్పటికీ ఎన్నో వేల మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసారు. మరుసటి రోజు ఉదయాన ఛైర్మన్ గారికి ఎన్ని ఉత్తరాలు వచ్చాయంటే- వాటిని మోసుకురావడానికి మరో ముగ్గురు పోస్టుమెన్ లు కావలసి వచ్చింది. ఛైర్మన్ గారికి ఎంత మంది ఫోన్లు చేసారంటే - చివరికి టెలిఫోన్ వైర్లు వేడెక్కి కాలిపోయాయి. తర్వాత కొన్ని నెలల వరకు ఎందరో మనుషులు తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. వీరిలో కెమిస్టులు, గారడీ వాళ్లు, వైజ్ఞానికులు, జీవ శాస్త్రజ్ఞులు, ఆఖరికి సాదువుల నుంచి పులుల వేటగాళ్ళ వరకు అందరూ ఉన్నారు. అయితే ఏ మొనగాడు కూడా ఓ గుప్పెడు ఎలకల్ని చంపడం తప్పించి ఏమీ చేయలేకపోయాడు. వీళ్ల తప్పుడు అంచనాల వల్ల ఓడల నుంచి సరుకు దించడం కష్టమైపోయింది. దాని వల్ల పెద్ద ఎత్తున మొక్కజొన్నల్ని లండన్ లో దించడానికి బదులు - వేరే రేవుల నుండి విదేశాలకు పంపించవలసి వచ్చింది. అదృష్టం పరీక్షించుకున్న వారిలో స్మిత్ గారి కొడుకులు కూడా ఉన్నారు. అతి మామూలుగా ఉండే ఎలకల బోన్ల చెయ్యాలన్న ఆలోచన జిమ్ కి వచ్చింది. అతను స్కూల్లో టీచర్లను ఇరికించినట్లే, ఎలకల్ని కూడా ఇరికించాలని అనుకున్నాడు. అతను ఓడరేవుల పరిసరాల్లో పాత డబ్బాలు పడి ఉండడం కనిపించింది. ఆ డబ్బాలతోనే ప్రత్యేకమైన ఎలకల బోను తయారు చేసాడు. డబ్బాలోంచి వచ్చే వాసన చూసి ఎలకలు దానిలోకి దూరుతాయి. ఐతే డబ్బా మీది భాగం లోపలికే తెరుచుకుంటుంది. బయటకు తెరుచుకోదు. అందువల్ల్ల ఎలక లోపలికి వెళ్ళిపోగలదు. కాని బయటకు రాలేదు. ఇదీ ఆ డబ్బా ప్రత్యేకత. జిమ్ తన తీరిక సమయమంతా ఎలకల బోన్లు చేస్తూ గడిపాడు. దాని కోసం అతను తన తండ్రి నుంచి పది పౌండ్లు చేబదులు తీసుకున్నాడు. జిమ్ కి రేకు డబ్బాలు చేసే ఒక నిరుద్యోగ మిత్రుడు ఉండేవాడు. అతడ్ని కూడా ఈ బోన్లు తయారు చేసే పనిలో పెట్టుకున్నాడు. చివరకు మొత్తం కలిపి అతను ఒక వెయ్యీ మూడు వందల చిన్నచిన్న ఎలుకల బోన్లు తయారుచేసాడు. వాటిలో పదిహేడింటిలో కొంచెం లోపం ఉంది! అందుకని వాటిని పక్కన పడేసాడు. జిమ్ ఎలకల బోన్లన్నిటినీ తోపుడు బళ్ళలో వేసుకొని , వైస్ ఛైర్మన్ ని కలవడానికి వెళ్ళాడు. ఎలకలు చంపే కార్యక్రమాన్ని వైస్ ఛైర్మన్ గారే చూస్తున్నారు. “ఎలకల బోన్లు మొత్తం ఓడరేవులకి సరిపోవు. అందుకని మేము ముందుగా వీటిని ఒక ఓడ రేవులో ఉపయోగించి చూస్తాం.” అన్నాడు వైస్ ఛైర్మన్. దాని కోసం 'వెస్టిండియా' అనే పేరున్న ఓడరేవుని ఎన్నుకున్నారు. అక్కడికి జమైకా నుంచి, దాని పరిసర ద్వీపాల నుంచి ఓడలు వస్తాయి. ఆ ఓడలు పంచదార, రమ్, షర్బత్తు, అరటిపళ్ళు తెస్తాయి. అక్కడి ఎలకలు మహా చురుకైనవి. షర్బత్తు పీపాల్లోకి, డ్రమ్ముల్లోకి పోవడం మళ్ళీ బయటకు రావడం వాటికి చిన్న పిల్లల ఆట లాంటిది. అప్పుడప్పుడు కొన్ని ఎలకలు షర్బత్తులో ఇరుక్కుని అక్కడే చచ్చిపోయేవి. కేవలం చురుకైనవి, జోరుగా పరిగెత్తేవి మాత్రమే బతికేవి. అందుకే అక్కడి ఎలకలు దూకడం, ఎగరడంలో వస్తాదులయిపోయాయి. జిమ్ సగం ఎలకల బోన్లలో జున్నుని పెట్టాడు. ఇంకో సగంలో మాంసం ముక్కల్ని పెట్టాడు. మొదటి రాత్రి తొమ్మిది వందల పద్దెనిమిది ఎలకలు పట్టుబడ్డాయి. దాంతో జిమ్ చాలా సంతోషించాడు. బహుమతి ఖచ్చితంగా తనే గెల్చుకుంటానని అనుకొన్నాడు. అయితే రెండో రోజు రాత్రి కేవలం ముప్పై మూడు ఎలకలు మాత్రమే పట్టుబడ్డాయి. మూడో రోజు రాత్రి అవి ఇంకా తగ్గిపోయాయి. కేవలం రెండే రెండు పట్టుబడ్డాయి. ఎలకల రాజు అన్ని ఎలకలకీ రేకు పెట్టెల జోలికి వెళ్ళొద్దని హెచ్చరిక చేసాడు. అందువల్ల కేవలం తెలివి తక్కువ ఎలకలు, రాజు మాట వినని ఎలకలు మాత్రమే పట్టుబడ్డాయి. నాల్గోరోజు రాత్రి ఎలకల బోన్లని విక్టోరియా రేవుకి తీసుకెళ్ళారు. అక్కడ కూడా కేవలం నాలుగు ఎలకలే పట్టుబడ్డాయి. ఎలకల రాజు హెచ్చరిక దూర ప్రాంతాలకు కూడా చేరిపోయింది. జిమ్ పనికొచ్చే పనేమీ చేయలేకపోయాడు. పాపం మొహం వేలాడేసుకుని ఇంటికి తిరిగొచ్చాడు. టైం పాడు చేసుకోవడంతో పాటు తండ్రి ఇచ్చిన పది పౌండ్లు ఖర్చు పెట్టేసాడు. స్కూల్లో అల్లరి పిల్లలు అతడ్ని “డబ్బా ఎలక” అని ఏడిపించసాగారు. రెండో కొడుకు చార్లెస్ పధకం ఇంకోలా వుంది. అతను ఓ కొత్త రకం విషం కనిపెట్టాడు. ఆ విషానికి రంగూ లేదు, రుచీ లేదు. నేను ఆ విషాన్ని తయారు చేసే పద్ధతి మీకు చెప్పను. ఎందుకంటే ఎవరైనా హంతకుడు ఈ కధను చదివి అలాంటి విషమే తయారు చేసి మందిని చంపవచ్చు. చార్లెస్ పెద్ద ఎత్తున ఈ విషాన్ని తయారు చేసాడు. అతడు ఎన్నో రసాయనాలు కలిపి మరో పదార్ధం కూడా చేసాడు. దాన్నుంచి రాక్ ఫోర్టు జున్ను వాసన వస్తుంది. రాక్ ఫోర్టు జున్ను ఫ్రాన్సు దేశపు ప్రసిద్ధి చెందిన జున్ను. అది అందరికీ తెలుసు. ఈ పదార్ధం పేరు - మిధైల్ హెప్టా డెసాయిల్ కీటోన్. దాన్నుంచి ఆగకుండా వాసన వస్తుంది. ఎలకలకి ఆ వాసనంటే ఎంతో ఇష్టం. చార్లెస్ తన తండ్రి నుంచి ఇరవై పౌండ్లు అప్పు తీసుకున్నాడు. అతను చవగ్గా దొరికే జున్నుని పెద్ద మొత్తంలో కొనుక్కొచ్చాడు. ముందుగా జున్నుని చిన్న చిన్న ముక్కలుగా కోసాడు. ఆ ముక్కల్ని విషంలో ముంచాడు. వాటి మీద రాక్ ఫోర్టు జున్ను వాసన వచ్చే రసాయనం చల్లాడు. ఈ ముక్కల్ని పదివేల అట్టపెట్టెల్లో పేర్చాడు. ముక్కల్ని బయట పడేస్తే ఎలకలకు అనుమానం రావచ్చు. డబ్బాల్లో చక్కగా ప్యాక్ చేసి ఉంచితే ఏ ఎలకలకు అనుమానం వస్తుందిలే అనుకున్నాడు. డబ్బాలు పలచని అట్టతో చేసాడు. వాటిలోకి ఎలకలు తేలికగా దూరిపోతాయి. ఇద్దరు మనుషులు రోజంతా కష్టపడి తోపుడు బళ్ళలో ఆ డబ్బాల్ని ఓడరేవు మూల మూలలకీ తీసుకెళ్ళారు. చార్లెస్ వాటి వెనుకునే వెళ్ళి, వాటి మీద జున్ను వాసన వచ్చే పదార్ధాన్ని చల్లాడు. ఆ రోజు లండన్ లోని మొత్తం ప్రాంతమంతా జున్ను వాసనతో నిండిపోయింది. చీకటి పడ్డాక ఎలకలు తమ కలుగుల్లోంచి బయటికొచ్చాయి. అవి ఒక దానితో ఒకటి మాటాడుకున్నాయి - “ఇదేదో కనీవినీ ఎరుగని జున్నులా వుంది. చిన్న డబ్బా నుంచి వచ్చే దీని వాసన ఒక పెద్ద పెట్టె నుంచి వచ్చే మాములు జున్ను వాసన కంటే ఎక్కువగా ఉంది” అనుకున్నాయి. ఎలుకలు జున్నుని మరీ మరీ తిన్నాయి. కొంచెం జున్ను రాజుగారి కోసం తీసుకెళ్ళాయి. అయితే ఎలకల రాజు అదృష్ట్టం బాగుంది. అతను అప్పుడే కడుపు నిండా బాదాం పప్పులు, ఆక్రోటు పండ్లు తిన్నాడు. కడుపులో బొత్తిగా ఖాళీ లేదు. విషం పని చేయడానికి కొంత సమయం పట్టింది. ఉదయం మూడు గంటల నుంచి ఎలకలు చనిపోవడం మొదలయింది. ఎలకల రాజు అనుమానం సరాసరి జున్ను మీదకి పోయింది. తన దూతల ద్వారా జున్ను తినొద్దు అన్న సందేశం పంపాడు. ఎలకల్లో దురదృష్టవంతురాలైన ఓ ఎలక ఉంది. అది తన సొంత పిల్లల్ని తినేసింది. ఆ నేరం మీద దానికి మరణ శిక్ష వేయబడింది. ఎలకల రాజు దానికి కొంచెం జున్ను తినమని ఆదేశించాడు. ఎలక తినింది. తిన్న కొంచెం సేపటికే అది చచ్చిపోయింది. దాంతో జున్నులో విషముందన్న విషయం రుజువయ్యింది. ఇప్పుడు రాజు మరింత మంది దూతలతో తన సందేశాన్ని పంపించాడు. మరుసటి రోజు ఉదయానికి నాలుగు వేల ఐదొందల పద్నాలుగు ఎలకలు చచ్చిపోయాయి. ఈ ఎలకలన్నీ కలుగుల్లోనే చచ్చిపడ్డాయి. మరెన్నో ఎలకల ఆరోగ్యం బాగా పాడయింది. ఛైర్మన్ గారు ఇది చూసి ఎంతగానో సంతోషించారు. ఆయన చార్లెస్ కి మరింత జున్ను కొనమని డబ్బులిచ్చారు. అయితే రెండు రోజుల తర్వాత చూస్తే ఏమయిందని? ఎనిమిది వేల డబ్బాల్లో కేవలం రెండు డబ్బాలు మాత్రమే తెరిచి వున్నాయి. మనుషుల కన్నా, ఎలకలు చలాకీగా ఉన్నాయని తేలిపోయింది. పాపం చార్లెస్ చాలా బాధపడ్డాడు. తను గెలుస్తానని అతను గాఢంగా నమ్మాడు. అందుకే పెళ్ళికి ఏర్పాట్లు చేయమని చర్చి ఫాదర్ కి ఉత్తరం కూడా రాసాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకునే కోరిక చచ్చిపోయిందని ఫాదర్ కి మళ్ళీ ఉత్తరం రాసాడు. అన్నిటికన్నా బాధ కల్గించిన విషయం ఏమిటంటే - అతని వంటికి అంటిన జున్ను వాసన నెల రోజుల దాకా అతడ్ని అంటిపెట్టుకొని ఉండిపోయింది. అతను బడిలోకి రావడానికి టీచర్లు అనుమతించలేదు. పాపం , ఇంట్లో కూడా ఆ నెలరోజులూ అతను బొగ్గుల కొట్టంలో పడుకోవలసి వచ్చింది. చివరకు చిన్నకొడుకు జాక్ ఓ పధకం వేసాడు. అందులో ఖర్చులు కొంచెం ఎక్కువే. తండ్రి నుంచి ముప్ఫై పౌండ్లు చేబదులు తీసుకున్నాడు. ఐతే అవి చాలలేదు. అతడు కొన్ని వైర్ లెస్ సెట్లు నాకు అమ్మాడు. నా నుంచి కూడా కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. మెల్లమెల్లగా అతనికి కావలిసిన డబ్బు సమకూరింది. జాక్ మొత్తంలో ఇనుపరజను కొన్నాడు. దాన్ని పిండి, చక్కెరలో కలిపి బిస్కెట్లు తయారు చేసాడు. బిస్కెట్లు ఓడరేవులోని అన్ని చోట్ల చల్లారు. మొదట్లో ఎలక అనుమానంతో వాటి జోలికి పోలేరు. కనీసం వాటిని తాకలేదు. తర్వాత్తర్వాత వాటిని బిస్కెట్ల వల్ల ఎలాంటి నష్టం కనిపించలేదు.అప్పుడు మాత్రమే అవి బిస్కెట్లు తిన్నాయి. అలా ఇలా కాదు. పీకమొయ్యా తిన్నాయి. ఈలోగా జాక్ ఏడు పెద్దపెద్ద కరెంటు అయస్కాంతాలను తయారు చేసాడు. వాటిని వేరువేరు ఓడరేవుల్లో ఉంచాడు. ప్రతి కరెంటు అయస్కాంతాన్ని లోతుగా తవ్విన పెద్ద గుంతలో ఉంచారు. తర్వాత కరెంటు వైర్లు పరిచారు. కరెంటుతో అయస్కాంతాలు పని చేయడం మొదలెట్టాయి. అదృష్టవశాత్తు రైల్వే సంస్ధలో ఉన్న ఒక ఎలక్ర్టికల్ ఇంజనీరు జాన్ స్నేహితుడు. వాళ్ళిద్దరికీ వైర్ లెస్ విజ్ఞానంలో గొప్ప ఆసక్తి ఉండేది. అతనితో స్నేహం ఉండడం వల్ల రైల్వే వారి నుంచి కరెంటు అప్పుగా తీసుకోడానికి ఆటంకం లేకపోయింది. ఎలకలు ఇనుప రజను బిస్కెట్లను పూర్తిగా తినేసిన తర్వాత - అయస్కాంతం నుంచి కరెంటును పంపించారు. కరెంటు పంపడం కంటే ముందు - ఇనుము, స్టీలు, నికెల్ తో చేసిన అన్ని వస్తువుల్నీ కట్టేసారు. ఓడ మొత్తం ఇనుముతోనే చేస్తారు. అందుకని ఓడల్ని పెద్ద పెద్ద తాళ్ళతో గట్టిగా కట్టేసి ఉంచారు. ఆ రాత్రి ఓడ రేవు మీద డ్యూటీకి వచ్చే వారందరూ మేకుల్లేని బూట్లు తొడుక్కోవలసి వచ్చింది. వైస్ ఛైర్మన్ గారి సంగతి మరోలా వుంది. ఆయన డ్యూకు.అంటే ప్రభువు. ఆయన బూట్లలో బంగారపు మేకులు ఉండేవి. అర్ధరాత్రి దాటాక - దగ్గర దగ్గర రెండున్నర గంటల సమయంలో లండన్ దగ్గరి అన్ని సొరంగం రైళ్ళకు డ్యూటీ పూర్తయింది. అప్పటి వరకు రైళ్ళకు ఇచ్చిన మొత్తం కరెంటుని మొదటి అయస్కాంతంలోకి పంపించారు. మొదట కొన్ని తుప్పు పట్టిన మేకులు, రేకు డబ్బాలు దాని వైపు వచ్చాయి. కొన్ని ఎలకలు కూడా వచ్చి అంటుకున్నాయి. ఇనుపరజను బిస్కెట్లు కడుపునిండా తిన్న ఎలకలు అయస్కాంతం వైపు బలంగా లాగబడ్డాయి. కొద్ది సేపట్లోనే అయస్కాంతం ఉన్న గుంత పూర్తిగా ఎలకలతో నిండిపోయింది.మొదటి గుంత నిండిపోగానే కరెంటుని రెండో గుంతలోని అయస్కాంతానికి తరలించారు. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా మొత్తం అయస్కాంతాల్లో కరెంటు వదిలారు. మొదట్లో కేవలం కలుగుల బయట ఉన్న ఎలుకలు మాత్రమే అయస్కాంతపు ఆకర్షణలోకి వచ్చాయి. కొంచెం సేపటి తర్వాత ప్రతి అయస్కాంతంలోకి మళ్ళీ కరెంటు పంపించారు. ఇప్పుడు ఎలకలు కలుగుల్లోంచి ఇలా బయటికి రాగానే, టక్కున అయస్కాంతం వైపు వచ్చి అతుక్కుపోతున్నాయి. మెల్లమెల్లగా లెక్కలేనన్ని ఎలకలు చిక్కుకున్నాయి. ఎలకల రాజుకి ఈ గందరగోళం గురించి తెలిసింది. తనే కలుగులో ఓ గోడవైపు లాగబడుతున్నాడు. అయోమయంగా ఉంది. బయట ఏదో జరుగుతోంది. దూతల్ని బయటకు పంపించాడు. ఐతే ఆ దూతలు మళ్ళీ తిరిగి రాలేదు. ఆఖరికి, ఏం జరుగుతోందో తెలుసుకుందామని ఎలకల రాజే బయటకు వచ్చాడు. ఇంకేముంది. వెంటనే ఓ అయస్కాంతం అతడ్ని లాగేసింది. ఎలకలన్నీ మునిగి చావాలని తెల్లవారుతూనే అన్ని గుంతల్లోనూ నీళ్లు నింపారు. చచ్చిన ఎలకల్ని తూకం వేసినప్పుడు వాటి బరువు సుమారు ఒక వెయ్యీ యాభై టన్నులు తేలింది. చచ్చిన ఎలకల్ని ఎవరూ లెక్కపెట్టలేదు. కాని అవి సుమారు ఏడున్నర లక్షలు ఉంటాయి. ఎలకలు పట్టే ఈ యుద్ధంలో కొన్ని దుర్ఘటనలు కూడా జరిగాయి. రాత్రి డ్యూటీకి వచ్చిన ఒక చౌకీదారు మేకుల్లేని బూట్లు వేసుకోవడం మరిచిపోయాడు. ఇంకేముంది. అతని కాళ్ళు బలంగా అయస్కాంతం వైపు లాగబడ్డాయి. గుంత దగ్గరికి వస్తూ వస్తూ అతను ఎలగోలా తన బూట్లు విడిచేసాడు. అయినా అతని కాలివేళ్ళకు రెండు ఎలకలు వేలాడుతూ ఉండిపోయాయి. ఆ ఎలకల్ని అయస్కాంతం ఎంత బలంగా లాగిందంటే చౌకీదారు వేళ్ళు తెగిపోయి, ఎలుకలతో పాటూ పోయి అయస్కాంతానికి అతుక్కున్నాయి. మరో చౌకీదారు అదృష్టం కొంచెం బాగుంది. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు అతను ఒక మంచి బిలియర్డ్సు ఆటగాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో అతని బుర్రలోకి కొన్ని సీసపు గుండ్లు చొచ్చుకుపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ డాక్టరూ ఆ గుండ్లని బయటకు తీయలేకపోయాడు. దాని మూలంగా అతను బిలియర్డ్సు ఆటకు వెళ్ళలేకపోయేవాడు. ఎప్పుడైతే అయస్కాంతంలోకి జాన్ కరెంటు పంపించాడో - అప్పుడే ఆ చౌకీదారు బుర్ర నుండి లోహపు గుండ్లు బయటకు వచ్చేసాయి. గుండ్లు వచ్చేసిన తర్వాత అతని బుర్ర మళ్ళీ బిలియర్డ్సు ఆటకు అనువుగా పని చేసింది. ఇప్పుడు ఆ చౌకీదారు బిలియర్డ్సు చాంపియన్ అయిపోయాడు. రెండో రోజున కూడా అయస్కాంతాల్లో మళ్ళీ కరెంటు పంపించారు. ఈసారి దగ్గర దగ్గర వంద టన్నుల ఎలకలు పట్టుబడ్డాయి. ఎలకల రాజు ముందే చచ్చిపోయాడు. అందువల్ల ఎలకలకి సరైన దారి చూపించే నాయకుడు ఎవరూ లేరు. మూడో రాత్రి కూడా చాలా ఎలకలు పట్టుబడ్డాయి. దీని తర్వాత మిగులు బగులు ఎలకలు భయంతో ఎటుపడితే అటు పరిగెత్తాయి. కొన్ని ఎలకలు లండన్ నగరంలోకి పారిపోయాయి. అక్కడి జనాన్ని బేజారెత్తించాయి. అయితే ఓడరేవులో ఒక ఎలకైనా మిగల్లేదు. అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ నాల్గోరోజు రాత్రి ఒక్క ఎలకైనా పట్టుబడలేదు. తర్వాత కొన్ని రోజుల వరకు కుక్కల, పిల్లుల సాయంతో ఎలకల్ని పట్టుకొనే ప్రయత్నాలు జరిగాయి. అయినా ఒక్క ఎలకైనా కనిపిస్తేనా? జాక్ కి లక్ష పౌండ్లు బహుమతిగా వచ్చాయి. ఒక బ్రహ్మాండమైన ఓడలో ఛైర్మన్ గారి కూతురితో అతని పెళ్ళి జరిగింది. అతను చర్చిలో పెళ్ళి చేసుకోడానికి ఇష్టపడలేదు. రిజిష్టర్ ఆఫీసు అన్నా అతనికి ఇష్టం లేదు. అతనొక పెద్ద ఓడను అద్దెకు తీసుకున్నాడు. ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్లు దూరం వెళ్ళాక ఓడ కెప్టెను వాళ్ళ పెళ్ళి జరిపించాడు.(ఒకవేళ ఒడ్డు నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరమే ఉంటే - కెప్టెన్ అలా చేయడం చట్ట విరుద్ధం అవుతుంది.) వాళ్ళకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు పుట్టారు. జాక్ కి బి.బి.సి.లో ఇంజినీరుగా మంచి ఉద్యోగం దొరికింది. అతను కోరుకుంటే తనకొచ్చిన లక్ష పౌండ్లతో బతికినంత కాలం కూచొని తినగలడు. కాని అతనికి వైర్ లెస్ విజ్ఞానమంటే చాలా ఇష్టమని తెలుసుగా. అందుకని బతికినంత కాలం దానితోనే ఆడుకుంటూ గడపాలనుకున్నాడు. జాక్ చెల్లెలు డ్యూక్ ని పెళ్ళి చేసుకుంది. అందువల్ల ఆమె డచెస్ (రాణి) అయిపోయింది. ఆమె చెప్పుల్లో వజ్రంతో చేసిన మడమ ఉంది. అది ఆమె భర్త వేసుకునే బూట్లలోని బంగారపు మేకులతో సరితూగుతుంది. తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకోమని జాక్ తన ఇద్దరు అన్నలకి - అంటే జిమ్ కి, చార్లెస్ కి చాలా డబ్బు ఇచ్చాడు. జాక్ తనకిచ్చిన డబ్బులతో జిమ్ మ్యాజిక్ దండం, నల్ల టోపి కొనుక్కున్నాడు. తర్వాత కాలంలో అతడు ఓ గొప్ప మెజీషియన్ అయ్యాడు. చార్లెస్ బాగా చదివి, యూనివర్శిటీలో కెమిస్ర్టీ ప్రొఫెసర్ అయ్యాడు. నేను కూడా ఒక ప్రొఫెసర్. నాకు వాళ్ళు బాగా తెలుసు. ఇది జరిగాక వాళ్ళందరూ ఎంతో సుఖంగా బతికారు.

				తమాషా బుడగ

అనగనగా ఒక ఊరు. పేరు హరిపురం. దాన్ని ఆనుకొని ఒక పెద్ద కొండ ఉండేది. కొండ మీద ఒకే ఒక ఇల్లు. చాలా పాతది. అందులో రాంబాబు, అతని బాబాయి ఉంటున్నారు. రాంబాబు చాలా చలాకీ కుర్రాడు. ఎప్పుడూ ఏవో ప్రయోగాలు చేస్తాడు. కొత్త కొత్తవి కనిపెట్టాలని చూస్తాడు. బాబాయికి కొద్దిగా పొలముంది. రాంబాబు పగలంతా ఆ పొలంలో పని చేస్తాడు. బాబాయికి అన్ని పనుల్లో సాయం చేస్తాడు. పొద్దుగూకుతుంది. ఇద్దరూ భోంచేసి అరుగు మీద కూచుంటారు. ఆ రోజుకి ఇక ఏ పని ఉండదు. రాంబాబు ఒక సరదా ఆట మొదలు పెడతాడు. రకరకాల సబ్బు బుడగలు ఊదుతాడు. రాంబాబు చేసే బుడగలు మామూలు బుడగలు కాదు. అవి చాలా పెద్దగా ఉంటాయి. ఒకొక్కటి ఒకో రంగులో ఉంటాయి. కొన్ని బుడగలు అన్ని రంగులలోను ఉంటాయి. అంతే కాదు. అవి మామూలు సబ్బు బుడగల్లా ఇట్టే పగిలిపోవు. బలంగా ఉంటాయి. చాలా సేపు నిలుస్తాయి. సబ్బు బుడగలు కొన్ని గంటల దాకా పగలకూడదు. అలాంటి బుడగలు తయారు చేయాలి. అదే రాంబాబు కోరిక. దాని కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాయి. రకరకాల పదార్ధాలు కలిపి చూస్తున్నాడు. మామూలుగా మనందరం ఏం చేస్తాం? సబ్బు నీళ్లతో బుడగలను ఊదుతాం. అవునా. అయితే, రాంబాబు మాత్రం అలా కాదు. సబ్బునీళ్ళలో ఇంకేవో కలుపుతాడు. లేదా, సబ్బునీళ్లకు బదులు మరేదో వాడి చూస్తాడు. సబ్బునీటిలో కిరసనాయిలు కలిపితే ఎలా ఉంటుంది? పంచదార కలిపితే? మంచినూనె, సబ్బు నురగ కలిపి చూస్తే? సబ్బు నీటికి కుంకుడురసం జత చేస్తే? కొబ్బరి నూనె, మంచి నూనె కలిపితే ఏమవుతుంది? ఎలాంటి బుడగలొస్తాయి? అవి ఎలా ఉంటాయి?… అని రాంబాబు ఆలోచిస్తాడు. అనుకున్నట్లుగానే వాటిని కలుపుతాడు. ఎలాంటి బుడగలు వస్తాయో జాగ్రత్తగా గమనిస్తాడు. ఒకోసారి అసలు బుడగలే రావు. అయునా రాంబాబు ఊరుకోడు. దాంట్లో ఇంకేదో కొత్త పదార్ధం కలిపి చూస్తాడు. ఒకనాడు సబ్బునీటిలో కొద్దిగా జిగురు కలిపాడు. అయితే అది గట్టిగా తయారయింది. ఆ రాత్రంతా ఆలోచించాడు. అందులో కొంచెం మంచి నూనె కలిపాడు. అంతే. అది పల్చగా మారింది. మంచి మంచి బుడగలొచ్చాయి. ఇంకొక రోజు సబ్బు పొడితో బుడగనీళ్లు తయరు చేశాడు. అందులో ఇంకేదో కలిపాడు. ఆ రోజు చాలా పెద్ద బుడగే వచ్చింది. అది మూడడుగుల పొడవుంది. ఐదు నిముషాలు గాలిలో ఎగిరింది. చివరకు బాబాయి ముక్కును ఢీకొని టపీమని పగిలింది. దాంతో రాంబాబుకి మరింత చురుకు పుట్టింది. ఇందులో కొంచెం కుంకుడురసం కలిపితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఇంకేం, వెంటనే కలిపి చూసాడు. ఈ సారి మరింత చక్కని బుడగలొచ్చాయి. అయితే మన రాంబాబు అక్కడితో ఊరుకొనే రకం కాదుగా. అలా ఊరుకుంటే ఈ కధే ఉండేది కాదు. సబ్బు నీటిలో రబ్బరు పాలు కలిపితే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అంతే. కలిపి చూసాడు. అబ్బో! చాలా పెద్ద బుడగలే వచ్చాయి. చాలాసేపు పగలకుండా ఉన్నాయి. అయితే అవన్నీ బాబాయి ముక్కునే ఢీకొట్టాయి. “ఒరే రాంబాబు! ఇదేం బాగోలేదురా” అన్నాడు బాబాయి. “ఇంత పెద్ద్ద పెద్ద బుడగలు ఎలా తెస్తున్నావో నాకు అర్ధం కావడం లేదు. నిజానికి సబ్బు బుడగలు ఇంత పెద్దగా ఉండకూడదు. అది మంచిది కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఇవి మన కొంప ముంచుతాయి” అన్నాడు. రోజూ అదే మాట. అయినా రాంబాబు తన ప్రయోగాలు మానలేదు. కొంచెం తీరిక దొరికితే చాలు. ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఒకనాడు ఇద్దరూ భోంచేసి అరుగుమీద కూర్చున్నారు. ఆ రోజు రాంబాబు ఏమేం కలిపాడో మరి! దేవుడికే తెలియాలి. చిత్రమైన పదార్ధం తయారయింది. అందులో కొంచెం తారు కూడా కలిపాడు. “ఇదేదో మన కొంప ముంచేలానే ఉందిరా” అని బాబాయి అననే అన్నాడు. అయినా రాంబాబు విన్పించుకోలేదు. బుడగలూదే గొట్టాలు రాంబాబు దగ్గర బోలెడు ఉన్నాయి. అందులో తనకిష్టమైనది తీసుకున్నాడు. విచిత్ర పదార్ధంలో దాన్ని ముంచాడు. ఊదడం మొదలుపెట్టాడు. ఈసారి అంత తేలిగ్గా బుడగ రాలేదు. ఊపిరి బిగపట్టి జోరుగా గాలి ఊదాడు. ఊది ఊది దవడలు నొప్పెట్టాయి. రెండు బుగ్గలూ ఎర్రగా కందిపోయాయి. చివరకు ఎలాగైతేనేం ఫలితం దక్కింది. మెల్లగా బుడగ మొదలయ్యింది. రాంబాబుకి ఎక్కడ లేని బలం వచ్చింది. ఇంకా గట్టిగా ఊదాడు. బుడగ పెద్దదయింది. మరింత ఊదాడు. ఇంకింత పెద్దదయింది. ఎంత ఊదితే అంత పెద్దగా మారింది. పుల్లని మాత్రం వదిలిపెట్టడం లేదు. చూస్తుండగానే సబ్బుబుడగ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు నేలను తాకేంత పెద్దగా మారింది. తాకితే పగిలిపోవచ్చు. అందుకే రాంబాబు గబగబా ఒక పెద్ద బండపైకి ఎక్కాడు. బుడగకు కావలసినంత జాగా దొరికింది. ఇంకేం. అదే పనిగా ఊదసాగాడు. బుడగ కూడా అంతకంతకూ పెద్దదవుతుంది. ఇప్పటికే అది రాకాసిబుడగలా తయారయింది. గతంలో ఎప్పుడూ అంత పెద్ద బుడగ రాలేదు. బాబాయికి భయం పట్టుకుంది. “ఒరే రాంబాబూ! ఇదేదో మన కొంప ముంచేలా ఉందిరా” అని గగ్గోలు పెట్టాడు. వెంటనే ఆ పని ఆపమని మొత్తుకున్నాడు. రాంబాబుకి అవేమీ విన్పించలేదు. అతని మొహానికి అడ్డంగా ఇప్పుడు బుడగ ఉంది. దాంతో ఎదురుగా ఉన్న ఊరు కూడా కనిపించలేదు. ఆ తమాషా బుడగ ఆరడుగుల మందంది అయింది. ఏడడుగులు… ఎనిమిది… తొమ్మిది… పది… పన్నెండు అడుగులదయింది. అయినా ఊదుడుపుల్ల నుంచి వేరు కాలేదు. పదమూడు… పద్నాలుగు… పదిహేను… ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. “ఓరి దేవుడో!ఇదేదో మన కొంప ముంచేలా ఉందిరా..” బాబాయి గట్టిగా అరిచాడు. ఇంతలో సబ్బుబుడగ పెద్దగా ఊగింది. ఆ వెంటనే పుల్ల నుంచి వేరు పడింది. దబ్బున నేల పై పడింది. అయినా పగల్లేదు. అదురుపాటుతో కొంతసేపు అటుఇటూ ఊగింది. కనీవినీ ఎరుగని రాకాసి బుగ్గ. మెల్లగా కదలడం మొదలు పెట్టింది. కొండ పై నుంచి బండి చక్రంలా దొర్లుతోంది. కొద్దిసేపటికి బాగా వేగం పుంజుకుంది. ఆ తమాషా బుడగ జరజరా జరజరా దొర్లుతూంది. దాని వెంబడే రాంబాబు పరిగెడుతున్నాడు. “ఒరేయ్! నీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు ఇది మన…….” అంటూ అతని వెనకాలే బాబాయి పరిగెడుతున్నాడు. కొండపైన ఒక ఆవు వుంది. పాపం గడ్డిమేస్తోంది. రాకాసి బుగ్గ దొర్లుకుంటూ వస్తున్నది. దానిని చూడగానే ఆవు బిత్తరపోయింది. భయంతో “అంబా” అని పెద్దగా అరిచింది. పారిపోదామని చూసింది. అయితే, అప్పటికే అలస్యమయింది. చూస్తుండగానే బుడగ జోరుగా తాకింది. అదెంత బలంగా అతుక్కుందంటే…. పాపం ఆవు అందులోంచి బైటపడలేకపోయింది. బుడగలోనే ఇరుక్కుంది. దానితో పాటు అదీ దొర్లసాగింది. ఓ చిన్న కుర్రాడు కొండెక్కుతున్నాడు. బాబాయి కోసం అతను గుడ్లు తీసుకొస్తున్నాడు. రాకాసి బుడగ వాడి వేపు దొర్లింది. భయంతో వాడు కెవ్వున అరిచాడు. అదింకా పూర్తి కానేలేదు. సబ్బు బుడగ వాడిని చుట్టుకొంది. పాపం ఆవులాగే వాడు కూడా అందులో చిక్కుకు పోయాడు. ఆ కుర్రాడే కాదు. వాడి పిల్లి కూడా అందులో ఇరుక్కుపోయింది. “అంబా” “మియ్యావ్” “కాపాడండి” అందరూ అరుస్తున్నారు. బుడగ దొర్లుతూనే ఉంది. హరిపురం చిన్న ఊరేమీ కాదు. పట్నం లాంటిదే. మన తమాషా బుడగ జోరుగా పోయి ఊరి మీద పడింది. పెద్దరోడ్డు పై వాలింది. అయితే ఆగలేదు. పోతూనే ఉంది. రాంబాబు వగరుస్తున్నాడు. పాపం ఇంతసేపూ అతను కూడా బుడగ వెంబడే పరిగెత్తాడు. “నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు” అంటూ బాబాయి కూడా పరిగెడుతున్నాడు. ఈ రాకాసిబుడగ ఏం కొంపలు ముంచుతుందో అని వణికిపోతున్నాడు. రాకాసిబుడగకు రోడ్డు మీద ముందుగా ఓ గుర్రంబండి ఎదురయింది. అందులో నాగయ్య అనే రైతున్నాడు. పట్నంలో కూరగాయలు అమ్ముకొని, పాపం అప్పుడే ఇంటికి బయల్దేరాడు. రాకాసిబుడగ అతడ్ని, అతని బండిని కూడా అమాంతం చుట్టేసింది. అన్నిటినీ తీసుకుని మరింత ముందుకు ఉరుకులు పెట్టింది. ఆవు, పిల్లి, గుర్రం, కోడిగుడ్ల పిల్లాడు, రైతు - అందరూ అరుస్తున్నారు. బుడగలోంచి బయట పడేందుకు బాగా తంటాలు పడుతున్నారు. అయినా రాలేకపోతున్నారు. ఈ కేకలేమిటి చెప్మా అనుకుంటూ అందరూ వీధుల్లోకి వచ్చారు. రాకాసిబుడగను చూసి నోళ్లు తెరిచారు. అందులో ఇరుక్కున్న జంతువులు, మనుషులు గిజగిజలాడుతూ ఉన్నారు. జనం భయంతో గజగజా వణికిపోయారు. వెంటనే పరుగు లంకించుకున్నారు. బుడగ అలా అలా ముందుకు పోతూనే ఉంది. దాని వెంబడే రాంబాబు. అతని వెనకే “నేన్నీకు ఎప్పటి నుంచో చెబుతున్నాను..” అంటూ బాబాయి. ఒక చోట రోడ్డు వారగా బడిపిల్లలు ఆడుకుంటున్నారు. కొంచెం దూరంలో వారి పంతులమ్మ కూచుంది. ఆవిడ ఏదో చదువుకుంటోంది. ఆడుకుంటున్న పిల్లలు ఉన్నట్టుండి మాయమయ్యారు. పంతులమ్మకు ఏమీ అర్ధం కాలేదు. ఇక్కడే ఉండాలే!ఇప్పటికిప్పుడే ఎక్కడికి పోయారు అని నోరు తెరిచింది. పాపం ఏమీ అర్ధం కాక జుత్తు పీక్కుంది. ఓ చెత్తకుండీ దగ్గర రెండు కుక్కలు పోట్లాడుకుంటున్నాయి. బడిపిల్లల్లాగే అవి కూడా చూస్తుండగానే బుడగలో ఇరుక్కుపోయాయి. చెత్తకుండీ కూడా వాటితో పాటు దానిలో చిక్కుకుంది. అవే కాదు, రోడ్డు మీద ఏది ఎదురైతే అది బుడగలో చిక్కుకొంటోంది. అయినా అది ఆగటం లేదు. అన్నిటినీ చుట్టుకొని అలా అలా ముందుకు పోతూనే ఉంది. రాంబాబు రొప్పుతున్నాడు. ఏడుపొక్కటే తక్కువ. “ఏమన్నా చెప్పు బాబాయ్. దాన్నెలా ఆపాలో ఏదన్నా ఉపాయం చెప్పు” అన్నాడు దీనంగా. “ఏం చెప్పమంటావురా” బాబాయి మండిపడ్డాడు. “నీకెప్పటి నుంచో చెబుతున్నాను. నీ బుడగలు ఎప్పుడో ఒకప్పుడు మన కొంప ముంచుతాయని” అన్నాడు. పాపం అతనికీ దిక్కుతోచడం లేదు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. రోడ్డు చివరన ఒక పెద్ద గుడి ఉంది. చాలా పాతది. సరిగ్గా అక్కడే రోడ్డు మలుపు తిరుగుతుంది. రాకాసి బుడగ సూటిగా ఆ గుడివేపు దూసుకుపోతుంది. రాంబాబుకి భయం పట్టుకుంది. బాగా ఏడుపొచ్చింది. “అందరూ చచ్చిపోతారేమో. ఆ పాపమంతా నాకే చుట్టుకుంటుంది” అని ఏడ్చాడు. ఇప్పుడు సబ్బు బుడగ గెంతులేస్తూ ముందుకు పోతూంది. లోపలున్న అందరూ గగ్గోలు పెడుతున్నారు. కాపాడమని అదే పనిగా అరుస్తున్నారు. ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లులు - అన్నీ మహా భీకరంగా అరుస్తున్నాయి. అన్ని రకాల అరుపులతో గుండెలు అదురుతున్నాయి. రాకాసి బుడగ రోడ్డు చివరకు చేరుకుంది. ఒక పెద్ద గెంతు వేసి గుడిలోకి దూకింది. మరో గెంతు వేసి గుడి పైకి ఎగిరింది. గోపురం కొస చాలా పదునుతేలి ఉంది. రాకాసి బుడగ దానికి చిక్కుకుంది. ఇప్పటి దాకా అన్నీ బుడగలో చిక్కుకుంటున్నాయి. అయితే ఇప్పుడు బుడగే గోపురానికి చిక్కుకుంది. కొద్దిసేపు అది కదలకుండా నిలిచింది. ఎలాగైతేనేం చివరకు కన్నం పడింది. దానిలోని గాలంతా పుస్సుమని బయటకొచ్చింది. బుడగ పగిలిపోయింది. ఓర్నాయనో! దాని కడుపులోంచి ఎన్నెన్ని బయటికొచ్చాయో! ఏమేం రాలేదని ఆడగండి. బోలెడంత మంది పిల్లలు, పెద్దవాళ్లు వచ్చారు. లెక్కలేనన్ని జంతువులు బైటపడ్డాయి. అంతేనా, ఒక మోటారు కారు, గుర్రంబండి, బెంచీ, కుర్చీ, కోడిగుడ్లు, కంబళి… ఇంకా ఏమేమో వచ్చాయి. అయితే వీటన్నిటికి బంక లాంటిది ఏదో గట్టిగా అంటుకొని ఉంది. దాన్ని వదిలించుకొనేందుకు యమ తంటాలు పడుతున్నారు. రాంబాబు ఊపిరిపీల్చుకున్నాడు. బాబాయి కూడా 'హమ్మయ్య' అనుకున్నాడు. ఆ సబ్బు బుడగ కోసం రాంబాబు ఏమేం కలిపాడో ఏమో! ఊరు ఊరంతా అది అంటుకుంది. ఒక పట్టాన వదిలిపెట్టలేదు. మొత్తం ఊరిని శుభ్రంగా కడగడానికి నెలరోజులు పట్టింది. అప్పటికీ అది పూర్తిగా వదల్లేదు. ఆ మూల కొంచెం, ఈ మూల కొంచెం అతుక్కునే ఉంది. ఇది వరకెప్పుడూ ఇలాంటిది జరగలేదు. బుడగలో చిక్కుకుని బయటపడ్డవారి పని మరీ ఘోరం. ఒక ఏడాది దాకా వాళ్ళు తమ జుత్తుని, చెవుల్ని తోముకూంటూనే ఉన్నారు. బుడగలోని విచిత్ర పదార్ధం అంతలా వారిని అంటుకుంది. మాయదారి బుడగ. అది ఊరి మీద పడిన రోజుని జనం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతలా వారిని పరుగులు తీయించింది. ఇంత గందరగోళానికి మూలమైన రాంబాబుని జనం ఊరికే వదిలిపెడతారా. “నువ్వు ఇంకా ఇక్కడే ఇంటే మా అందరి కొంపా మునుగుతుంది” అన్నారు. రాంబాబు సబ్బులని, సబ్బు పొడులని, ఊదుడు గొట్టాలని, ఇంకా ఏమేం వాడతాడో వాటన్నిటిని మూట గట్టారు. ఆ మూటతో సహా, రాంబాబుని కాలేజీకి పంపారు. అక్కడికి కాలేజీ చాలా దూరంగా ఉంది. రాంబాబుని అక్కడే ఉండమన్నారు. అక్కడే చదువుకోమన్నారు. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలన్ని అక్కడే చేసుకోమన్నారు. కొండ మీది ఇంట్లో పాపం బాబాయి ఒక్కడే మిగిలిపోయాడు. అతనికి రాంబాబు మాటిమాటికి గుర్తుకొస్తాడు. సాయంత్రం ఇంటి అరుగు మీద కూర్చొని అన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు రాంబాబుని తలచుకుని ఇలా అనుకుంటాడు…. “ఒరే రాంబాబూ! కొత్త కొత్తవి కనిపెట్టాలని నీలో గొప్ప తపన ఉందిరా. అందుకోసం బాగా కష్టపడతావు. తెలివిగా ఆలోచిస్తావు. లెక్కలేనన్ని ప్రయోగాలు చేస్తావు. ఏదో ఒక రోజున నువ్వొక మంచి శాస్త్రజ్ఞుడివి అవుతావు. అందరికీ పనికొచ్చేవి కనిపెడతావు. నాకా నమ్మకం ఉంది.” ఇక్కడ రాంబాబు ఇలా అనుకుంటున్నాడు. అక్కడ కాలేజీలో ఉన్న రాంబాబు మరో సరికొత్త ప్రయోగం మొదలుపెట్టాడు. “ఈసారి పది రోజుల దాకా ఎగిరే బుడగ తయారు చేయాలి” అనుకున్నాడు. ఇంకేం. వెంటనే అందుకు నడుం బిగించాడు.

ఎలుకలు_బాబోయ్_ఎలుకలు.1321724768.txt.gz · Last modified: 2018/03/24 11:13 (external edit)