కుమ్మరి నరసయ్య పత్తికొండ ఓ చిన్న ఊరు.అది అడవికి దగ్గరలో ఉంది. ఆ ఊరిలో ఒక కుమ్మరివాడు ఊండేవాడు.అతడి పేరు నరసయ్య.అందరూ అతడిని 'కుమ్మరి నరసయ్య'అనేవారు. నరసయ్య బాగా తాగేవాడు. అందుకని కొందరు 'తాగుబోతు నరసయ్య అనేవారు. నరసయ్య కు ఓ గాడిద ఉండేది. ఒకనాడు అది కట్టు తెంచుకుంది. ఎక్కడికో పారిపోయింది. నరసయ్య ఊరంతా వెదికాడు. గాడిద కనిపించలేదు.గాడిదను వెదుకుతూ అడవిలోకి వెళ్ళాడు. పొద్దు వాలింది.... ఆ అడవిలో ఒక పెద్దపులి ఉంది. సాయంత్రం అయిందిగా! పులి తన గుహకు బయలుదేరింది. దాని గుహ చాలా దూరంగా ఉంది. ఇంతలో ఉన్నట్టుండి వాన మొదలయింది.ఒకటే ఉరుములూ, మెరుపులూ! వాన జోరుగా పడుతోంది. పెద్దపులి పరిగెత్తింది. కొంత దూరం పోయేసరికి దానికి ఆయాసం వచ్చింది. ఆగి, అటు ఇటు చూసింది.దగ్గరలో ఒక గుదిసె కనిపించింది. అది గుడిసె దగ్గరకు వెళ్ళింది.తడవకుండా చూరు కింద నిలబడింది. ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంది.ఆమెకు వాన మీద బాగా కోపంగా ఉంది.పాపం! ఆ గుడిసె పైకప్పు నిండా కన్నాలు! ఆ కన్నాల నుంచి వాననీరు లోపలికి వస్తోంది.ఇంట్లో అన్నీ తడసిపోయాయి.ముసలమ్మ కూడా తడసిపోయింది.చలికి వణికిపొతోంది. "ఛీ చీ...వెధవ కన్నాలు!వెధవ కన్నాలు!వీటితో వేగడం కంటే - పులి నోట్లో తల పెట్టడం మంచిది!" అని ముసలమ్మ కోపంగా అంది. పెద్దపులి ఆ మాటలు వింది.అది ఉలిక్కిపడింది! 'కన్నాలు' అంటే ఏమిటో దానికి తెలీదు. అయినా... ఈ 'కన్నాలూ' అనేది నా కన్నా పెద్ద జంతువై ఉంటుంది. అందుకే ముసలమ్మ అలా అంది.ఇకనుంచి నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్నాలుకి ఎదురు పడకుండా ఉండాలి...అనుకుంది పెద్దపులి. అదే సమయంలో నరసయ్య అక్కడకు వచ్చాడు. అతను ఇంకా గాడిద కోసం వెదుకుతున్నాడు.అప్పుడు బాగా తాగి ఉన్నాడు.ఎంత వెదికినా గాడిద కనిపించడం లేదు.అందుకని బాగా కోపంగా కూడా ఉన్నాడు. నరసయ్య పెద్దపులిని చూసాడు. చీకటి పడుతున్న సమయం. అంతా మసకమసకగా ఉంది.పైగా నరసయ్య తాగాడు మైకంలో ఉన్నాడు.. ఇంకెం . అతనికి పెద్ద పులి గాడిదలా కనిపించింది!అది తన గాడిదే అనుకున్నాడు..చప్పుడు చెయ్యకుండా మెల్లగా దాని దగ్గరకు వెళ్ళాడు. ఉన్నట్టుండి పులి మెడలో పలుపు వేశాడు.తర్వాత చింత బరికతో దంచడం మొదలుపెట్టాడు. "దరిద్రపు ముండా! నాకు ఎన్ని కష్టాలు తెచ్చావే!నీ కొసం తిరిగి తిరిగి వళ్లు హూనమైపోయింది."అని తిట్టాడు. పెద్దపులి బిత్తరపోయింది! అది నరసయ్యను చూసి 'కన్నాలు ' అనుకొంది. ఎదురు తిరిగితే ఏమవుతుందో? తాను ప్రాణాలతో ఉంటుందో లేదో?..అని భయపడింది. కిక్కురుమనకుండా నరసయ్య కొట్టిన దెబ్బలు తింది. " ఇంటికి పద ! నీ పని చెబుతా!" అన్నాడు నరసయ్య.పులిని ఈడ్చుకుంటూ ముందుకు కదిలాడు.చేసేదిలేక పులి నరసయ్య వెంట నడిచింది. నరసయ్య పులిని ఇంటికి తీసుకొచ్చాడు.గాడిదను కట్టే గుంజకు దాన్ని కట్టేసాడు.తర్వాత లోపలికి పోయి - మత్తుగా పడుకున్నాడు. . తెల్లవారింది. నరసయ్య ఇంటి ముందు పులి కట్టేసి ఉంది! ఊరి జనమంతా చూశారు! "ఓహో!నరసయ్య ఎంత గొప్పవాడు! పులిని తెచ్చి ఇంటి ముందు కట్టేశాడు. ఎంత గొప్పవీరుడు! ఇలాంటి వీరుడు లోకంలో ఎక్కడా ఉండడు".అనుకున్నారు జనం. ఈ వార్త పక్క ఊరివారికి తెలిసింది. అలా అలా అన్ని ఊళ్లకూ పాకింది. కొద్ది రోజుల్లోనే దేశమంతా తెలిసిపోయింది. "వీరుడంటే అలా ఉండాలి! కుమ్మరి నరసయ్యను మించిన వీరుడు ఈ భూమండలం మీద లేడు". అని అందరూ అనుకోసాగారు. ఒకనాడు ఆ దేశపు రాజుగారికి పెద్ద కష్టం వచ్చి పడింది. ఆయనకు పొరుగురాజుతో పగ ఉంది. ఇప్పుడు ఆ పొరుగురాజు యుద్ధానికి వచ్చాడు. పొరుగురాజు ఈయన కంటే బలవంతుడు. పెద్ద సైన్యం ఉంది. ఏనుగులు,గుర్రాలు దండిగా ఉన్నాయి. ఈ రాజుగారికి అంత సైన్యం లేదు. పగరాజుకి ఉన్నన్ని గుర్రాలు, ఏనుగులు లేవు.ఉన్న సైన్యంతోనే యుద్దం చెయ్యవచ్చు. అయితే వారిని నడిపించే నాయకుడు లేడు.సేనాపతి మొన్ననే చనిపోయాడు.ఇప్పుడు ఏం చెయ్యాలి?... రాజుగారికి దిక్కు తోచలేదు. "ఏం చెయ్యాలో చెప్పండి".అని మంత్రులని అడిగాడు రాజు. "పత్తికొండలో కుమ్మరి నరసయ్య అనే ఒక మహావీరుడు ఉన్నాడు. అతను పెద్దపులిని కుక్కపిల్ల్లలా ఇంటి ముందు కట్టేశాడట! అంతటి గొప్పవీరుడు. అతడ్ని తెచ్చి సేనాపతిని చేద్దాం. యుద్ధంలో మనం తప్పకుండా గెలుస్తాం". అన్నాడు ఒక మంత్రి. ఈ సలహా అందరికీ నచ్చింది. ఇకనేం! వెంటనే..."కుమ్మరి నరసయ్యను తీసుకురండి!" అన్నారు రాజుగారు. సేవకులు పరిగెత్తారు. పొద్దుగూకే లోపు నరసయ్యను తీసుకొచ్చారు. రాజుగారు స్వయంగా స్వాగతం చెప్పారు. మంచి విందు ఇచ్చారు. "ఈ రోజు నుంచి నువ్వు మా సేనాపతివి! మా సైన్యాన్ని తీసుకొని - పగరాజు మీద యుద్దం చెయ్యి!" అన్నారు రాజుగారు. నరసయ్య అదిరిపడ్డాడు! ఏమిటి! యుద్దం చెయ్యాలా! సైన్యాన్ని నడిపించాలా!... తనకు కనీసం కత్తి పట్టుకోవడం కూడా రాదే!... అలాంటిది తను యుద్దం ఎలా చేస్తాడు? కాదనడానికి వీలులేదు. రాజుగారు వెంటనే తల నరికేస్తారు. ఇప్పుడు ఏమిటి దిక్కు? నరసయ్యకు కాళ్ళూ చేతులూ ఆడలేదు. పాపం నరసయ్యకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. బాగా ఆలోచించాడు.చివరకు... తెల్లారగానే పారిపోవాలి అనుకున్నాడు. తెల్లవారబోతుండగా నరసయ్య లేచాడు.పిల్లిలాగా అడుగులేస్తూ గుర్రపు శాలలోకి వెళ్ళాడు.అక్కడ చాలా గుర్రాలు ఉన్నాయి. అందులో ఒక నల్లగుర్రం కూడా ఉంది.దాని మీద జీను వేసి ఉంది.ఎవరో స్వారీ కోసం దాన్ని సిద్దం చేసుకున్నారు. నరసయ్య తిన్నగా దాని దగ్గరకు వెళ్ళాడు. అతనికి గుర్రం సవారీ ఎలా చెయ్యలో తెలీదు.ఎలాగో తంటాలు పడి గుర్రం ఎక్కాడు. ఎక్కిన తర్వాత కాలు ఒక పట్టీలో ఇరుక్కుంది. దాన్ని తీయాలని చూశాడు.రాలేదు.ఇంతలో గుర్రం ముందుకు ఉరికింది. గుర్రం రయ్యిన దూసుకుపోయింది. కోట దాటింది.నగరం దాటింది. నరసయ్యకు భయం వేసింది. అల్లంత దూరంలో గుడారాలు కనిపించాయి!పగరాజు సైనికుల గుడారాలు!... నరసయ్యకు గుండె ఆగినంత పనయ్యింది. "ఓరి నాయనోయ్! ఇది నన్ను పగవాళ్ల మధ్యకు తీసుకుపోతోంది దేవుడోయ్!" అని గుండెలు బాదుకున్నాదు. గుర్రాన్ని ఆపాలని ఎన్నో తంటాలు పడ్డాడు. ఏం చేసినా అది ఆగలేదు. కిందకు దూకేయాలని అనుకున్నాడు. అయితే కాలు ఇరుక్కుపోయి ఉంది. ఇక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యలి. లేకుంటే ప్రాణాలు దక్కవు - అనుకున్నాడు నరసయ్య. ఇంతలో అతనికి ఒక జామచెట్టు కనిపించిది. గుర్రం దాని పక్కనుంచి పోతుంది. ఇంకేం. గట్టిగా చెట్టును పట్టుకున్నాడు. తన బలమంతా కూడదీసి పట్టుకున్నాడు.అలా చేస్తే గుర్రం చచ్చినట్టు ఆగుతుంది అనుకున్నడు.అయితే అతను అనుకున్నట్లు జరగలేదు. జామచేట్టు వేళ్ళతో పాటు ఊడి వచ్చింది! గుర్రం పోతూనే ఉంది.ఇప్పుడు గుర్రం మీద నరసయ్య! నరసయ్య చేతిలో జామచెట్టు! పగరాజు సైనికులు అప్పుడే నిద్ర లేస్తున్నారు. వాళ్లు నరసయ్య రావడం చూశారు. నరసయ్య సంగతి అంతకు ముందే వాళ్లకి తెలుసు. ఇప్పుడు చికటిలో జామచెట్టు ఊడబీకడం చూసారు. అంతే!వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి. "పారిపోండి!పారిపోండి!కుమ్మరి నర్సయ్య వస్తున్నాడు! మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు." అని అరుస్తూ పరిగెత్తారు. గలాభా మొదలయ్యింది. పగరాజు సైనికులు అడ్డదిడ్డంగా పరిగెత్తారు.నిద్ర లేచినవాళ్లు లేచినట్లే పరిగెత్తారు. దాంతో గుర్రాలు,ఏనుగులు బెదిరిపోయాయి. అవి కూడా అడ్డదిడ్డంగా పరిగెత్తసాగాయి. దాంతో గలాభా ఇంకా పెద్దదయింది. “ఆగండి! పారిపోకండి! యుద్దం చేయ్యండి!" అని పగరాజు పెద్దగా అరిచాడు. ఆయన మాటల్ని ఎవ్వరూ వినలేదు. చూస్తూ ఉండగానే అందరూ పారిపోయారు. పాపం.పగరాజు ఇంకేం చెస్తాడు? ఆయన కూడా గుర్రం ఎక్కి పారిపోయాడు. గుర్రం ఆగింది. "హమ్మయ్య!" అనుకున్నాడు నరసయ్య. చేతిలో ఉన్న చెట్టు పడేసాడు. పట్టీలో ఇరుక్కున్న కాలుని పైకి తీసాడు. కిందకు దిగి, పారిపోవాలని అనుకున్నాడు. ఇంతలో రాజుగారి సైనికులు అక్కడికి చేరుకున్నారు. జరిగింది వాళ్లు కూడా చూశారు. "నరసయ్యకు జై! కుమ్మరి నరసయ్యకు జై! మహవీరుడు కుమ్మరి నరసయ్యకు జై!!" అని అందరు అరిచారు. నరసయ్యను ఊరేగిస్తూ రాజు దగ్గరకు తీసుకెళ్ళారు. పగరాజు పారిపోయాడని తెలిసి రాజు గారు సంతోషించారు.ఆయన సంతోషం ఇంతా అంతా కాదు. నరసయ్యకు గొప్పగా సన్మానం చేశారు. దండిగా డబ్బు, బంగారం ఇచ్చి ఊరికి పంపించారు.