ఊరు మేలు కొనింది సీతకూ వసంతకూ మంచి సావాసం.వారిది గంగవరం.సీత పసితనంలో చదువుకోలేదు.వసంత చదువుకుంది. వసంత ఇపుడు సాయిపేటలో ఉంది.వాలంటీరుగా సెంటరు నడుపుతూవుంది.సీత గంగవరంలో వుంది.అక్షరదీపం సెంటరులో చదువుకొనింది. ఈ జూబులు సీతా వసంతలవి. గంగవరం, 1-6-92 వసంతా! నేను కులాసా.నీ సంగతులు ఏమిటి? నీ జాబు చేరింది.కూడి కూడి సొంతంగా చదివాను. నేను చదివిన మొదటి జాబు నీదే.నేను రాసే మొదటి జాబు కూడా ఇదే.దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆరు నెలల ముందు నాకు అక్షరాలు రావు.వాచకం అంటే ఏమిటో తెలియదు.చదువంటే భయం.ఈరోజు నేను చదవగలను.కొంచెం రాయగలను.ఇదంతా మా వలెంటీరు చలవే. నీతో పాటు మీ ఆయన కూడా వలంటీరు అని రాసావు.నీ సెంటరులలో మూడవ వాచకం ఎంత మంది ముగించారు. పరీక్షలు ఎంత మంది రాసారు.అందరూ బాగా చదవగలరా?పేపరులో విషయాలు చదవగలరా? నాకు ఇంకా చదవాలని ఉంది.సంగతులు తెలుసుకోవాలని ఉంది. అపుడపుడూ మంచి సంగతులు రాసేది. ఉంటాను. నీ సీత సాయిపేట, 4-6-92 సీత! నేను కులాసా.నీజాబు ఈరోజే చేరింది.సంగతులు తెలిసాయి.నీ జాబు చూడగానే ఎంతో సంబరపడిపోయాను.చూచావా! చదువంటే ఎంత తేలికో! కొంచెం ఓపిక ఉండాలి.అలవాటు పడాలి.అంతే! ఎవరైనా చదవగలరు.రాయగలరు,దీనికి నీవేసాక్షివి. నీకు ఏది దొరికినా చదువు.లేకుంటే మరిచిపొతావు.చదువుతూ ఉంటే అది అలవాటుగా మారుతుంది.నీకూతురి సంగతి జాబులో ఏమీరాయలేదు.ఎలా ఉంది?చూచి చాలారోజులు అయింది.దానికి అయిదో ఏడుదాటిందా? ఇవిబడులు తెరిచే రోజులు.నీ కూతురిని బడికి పంపించు. పసితనంలో నీవు బడికి పోలేక పోయావు.నీకూతురికి ఇలా జరగకూడదు.నీవు చెపితే మీ ఆయన కూడా కాదనడు.చాలా మంది కొడుకును బడికి పంపుతారు.కూతిరిని పంపరు.ఆడదానికి చదువు దేనికి అంటారు.మగవాడి కంటె మనం ఎందులోనూ తీసిపోము.ఈ సంగతి మనం రుజువు చేయాలి.సరేనా? ఉంటాను. నీ వసంత. గంగవరం, 20-6-92 వసంతా! నేను కులాసా.నీజాబు పది రోజుల కిందట చేరింది.చాలా మంచి సంగతులు రాసావు.నీజాబు అందరికీ చూపించాను. నాకూతురిని బడికి పంపమని రాసావు.దానికి ఆయిదో ఏడు నిండింది.బడిలో చేరింది.వారం రోజులు అయింది. దానికి చదువంటే ఎంత సంబరమో! రోజూ నా వెంటబడుతుంది. సెంటరుకు బయలుదేరుతుంది. పలకంతా గీతలతో నింపుతుంది.అక్షరాలు రాకపోయినా వాచకం లొడలొడా చదువుతుంది. బడికి పంపటంలో మన ఊరిలో ఇపుడు ఆడా మగా తేడా చూడడం లేదు. అందరినీ బడికి పంపడం మొదలైంది. మా టీచరు చాలా మంచివాడు. వాలెంటీరు దళంతో ఆయనకు మంచి సావాసం. అందరినీ కూడేసాడు. ఆయనా వారూ కలిసి ఇంటింటికీ తిరిగారు. బడి ఈడు వారినందరినీ బడికి పంపమని అడిగారు.దీంతో చాలా మంది బడిలో చేరారు. ఆరు నెలలలో మేము ఎంతమారి పోయామో! మీ ఊరి సంగతులు ఏమిటి? ఉంటాను. నీ సీత సాయిపేట, 24-7-92 సీతా! నేను కులాసా!నీ కూతురిని బడికి పంపి మంచిపని చేసావు. నీ జాబుచేరి చాలా రోజులైంది.మా ఊరిలో ఒక సంగతి జరిగింది.దాంతో ౩౦ రోజులుగా తీరిక లేదు. మా ఊరిలో సారాయి బెడద మితి మీరింది.సారాయి తాగని మగవాడు లేడు. చితికిపోని సంసారం లేదు. చేతిలో పైసలు లేకపోతే దొరికింది కుదువ పెడతారు. తాగుతారు. తాగినవారు ఊరుకోరు. ఆలిని తంతారు. దీంతో ఆడవారిబతుకు దినదిన గండమై పోయింది. ఈ సారాయి రాక్షసిని ఎలా వదిలించుకోవాలి? అందరూ అనుకొనేవారే. అయినా ఇంతకాలం ఏమీ చేయ లేక పోయారు. ఇంతలో అక్షరదీపం చదువులు మొదలైనాయి. మూడవవాచకంలో సారాయి గురించి వుంది.అది చదివారు. ఏదో ఒకటి చేయాలనే ఆలోచన కలిగింది.నాతో మాటాడారు. మేము ఊరిలో అందరిని కలిసాము.కూడేసాము. "మనమంతా ఒకటిగా నిలబడదాం.సారాయి అంగడి మూసేయమని చెపుదాం. వినకపోతే బలవంతంగా మూయించుదాం." అనుకొని బయలుదేరాం. మాతో పాటు కొందరు మగవారు కూదా బయలుదేరారు. ఊరేగింపుగా 200 మందిమి ఊరంతా తిరిగాము. సారాయి అంగడికిపోయాము.అంగడి మూసేయమని అడిగాం. వాడు అదిరిపోయాడు. ఆ రోజు అంగడి మూసేసాడు. పాటపాడినాయన మరునాడు రాయబారం పంపాడు.బెదిరించాడు.మేము వినలేదు.బెదిరించాడు.మేము వినలేదు.బెదిరిపోలేదు.ఆ రోజుకూడా ఊరేగింపు చేసాము.సారాయి జీపును తరిమేసాం. ఆ రోజు నుంచి సారాయి అంగడి మూతపడిపోయింది. మాఊరికి పీడ విరగడైపోయింది. ఈ సంగతి పేపరులో కూడా వేసారు.నీవు చూచావా? శనివారం ఈనాడు పేపరు చూడు. అందరికి చూపించు. ఉంటాను. నీ సీత గంగవరం, 31-7-92. వసంతా! నేను కులాసా.నీజాబు చేరింది.అందరం చదివాము.ఒకసారిగాదు.పదిసారులు చదివాము.కలా నిజమా అనిపించింది. 'ఈనాడు' పేపరు కూడా చదివాము.ఊరేగింపు ఫోటో కూడా చూసాము.మాకు అందరికీ అంతులేని ఆనందం కలిగింది. నిజంగా పేదల పాలిట సారాయి రాక్షసి లాంటిది.ఎందరి సంసారాలు దీంతో చితికి పోయాయో.ఎందరి బతుకులు బూడిద పాలైనాయో! రాక్షసిలాంటి ఈ సారాయిని మీరు ఊరి నుంచి తరిమేసారు.మనం ఏకమైతే ఎదురులేదని రుజువుచేసారు.అందరికీ దారిచూపించారు.ఇదంతా మన చదువుల చలవేగదా! చదువంటే ఏమిటో నాకిపుడు తెలిసింది. చదువు లేకుంటే నీకు జాబులు రాయగలిగే దానినా? నీజాబులు చదవగలిగేదానినా? ఈసంగతులు తెలుసుకోగలిగేదానినా? చదువులేకుంటే నాకూతురిని బడికి పంపేదానినా? చదువంటే వెలుతురు.చదువంటే ఆయుధం. ఈ ఆయుధం అందరికీ అందే రోజు రావాలి.అందరూ మీ ఊరిబాటలొ నడిచే రోజు రావాలి. ఉంటాను. నీ, సీత.