ఆనందం ఆదాయం మనకు చాలా ఆలోచనలు ఉంటాయి. ఏదో చేయాలని అనుకుంటాం. అది అందుబాటులో ఉండదు. అందరికి అందుబాటులోనిది పెరటి తోటల పెంపకం.మనసు ఉంటే ఇది చాలా సులభం.ఆదాయం,అనందం కూడా. మునగ, కరివేపాకు, సీతాఫలం, జామ అందరూ పెంచగలవి. వీటిని వేసే ముందు మంచి జాతి మొలకలు ఎంచుకోవాలి. అరటి కూడా సులభంగా బతుకుతుంది. నాలుగు కూరపాదులు వేసుకోలేమా? వంగ, టమేటా మొలకలు బాగా పెరుగుటాయి. బెండ తొందరగా పెరుగుతుంది. బీర, కాకర తీగలయితే పైకి పాకుతాయి, దొండ రెండో ఏడు కూడా ఉంటుంది. ఆకు కూరలు రోజూ తినగలిగినా మంచిదే. పాలజకూర, గోంగూర, తోటకూర, కొతిమేర, పుదీనా బాగా పెరుగుతాయి. ఆకు కూరలు, కూరగాయలు నవనవలాడు తుంటాయి. మనం పండించినవే మనం తినడం ఎంతో ఆనందం. ఎంతో ఆదాయం. బొప్పాయి గొప్పతనం బొప్పాయి సులభంగా పెరిగే చెట్టు. దీనికి పెద్ద చోటు అవసరం లేదు. ఇంటి ముందు పెంచుకోవచ్చు. ఇది ఆరు నెలల లోపే కాపుకు వచ్చే చెట్టు. చెట్టు నిండా కాయలుంటాయి. వారానికి ఒక పండు తప్పకుండా పండుతుంది. బొప్పాయి పండు తినడానికి రుచిగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కాయలతో కూరలు వండు కోవచ్చు. పచ్చడి కూడా చేసుకోవచ్చు. బొప్పాయి కాయ, గింజలు, పాలు చాలా జబ్బులు పోగొడతాయి. కంటి జబ్బులకు బొప్పాయి పండు మంచి మందు. బొప్పాయి తింటే రేజీకటి దగ్గరకు రాలేదు. ఆడవాళ్ళు కడుపుతో వుంటే బొప్పాయి తినగూడదంటారు. ఇది నిజంగాదు. పైగా బిడ్డకు ఎంతో మంచిది. మల బద్దజకానికి బొప్పాయి పాలు, నీళ్ళు, తేనె కలిపి తాగండి. కడుపులో పురుగులు కూడా చచ్చిపోతాయి. బొప్పాయి గింజలు నూరి పాలలో కలిపి తాగండి. ఏలిక పాములు పడి పోతాయి. బొప్పాయి కాయ లోపలిగుజ్జు రోజూ పూ యండి. కురుపులు మాడి పోతాయి. చూడండి! బొప్పాయి ఎంత గొప్పదో! మునగ మాలచ్చిమి ఇంటి ముందు మునగ, కుండలో కూర అంటారు పెద్దలు. ఒక మునగచెట్టు ఉంటే చాలు. కూరకోసం వెతికేపని ఉండదు. మునగ చేసే మనలో చాలామందికి తెలియదు. మునగకాయలు రుచికి రుచి. ఆదాయానికి ఆదాయం. మునగాకు కూర కళ్ళకు ఎంతో మంచిది. పూత కూడ కూరలో వేసుకోవచ్చు. మునగలు చాలారకాలు. వీటిలో బెంగుళూరు రకం చాలా మంచిది. కాయలావుగా పొడవుగా వుంటుంది. లోపల గుజ్జు బాగా ఉంటుంది. ముదిరినా తగ్గని రుచి దీనిది. మంచి రకం మునగ ఏడాదిలో కాపుపడుతుంది. మునగ కాచేది కాయలుకాదు రూపాయలే. పాల దిగుబడి పెరగాలంటే మనం చాలా మందిమి పాడి మీద బతికే వాళ్ళం. పాలు దిగుబడి పెరిగితే మన ఆదాయం పెరుగుతుంది. మెళకువగా పాడి చేసుకుంటే దిగుబడి బాగా పెంచుకోవచ్చు. పచ్చి గడ్డి మేత వేసేటప్పుడు కుంది వేయాలి. దీని వలన అర లీటరు పాలు దిగుబడి పెరుగుతుంది. పశువును బాగా కడగాలి. కొట్టంలో పేడ, ఈగలు, దోమలు లేకుండా చూచుకోవాలి. పాలిచ్చేటాప్పుడు గొడ్డును భయ పెట్టగూడదు. అది సంతోషంగా ఉండాలి. దీని వలన కూడా పాల దిగుబడి పెరుగుతుంది. దూడకు మొదట పాలు తాపాలి. తరువాత పాలు పిండాలి. చివరి పాలు దూడకు వదల కూడదు. పాలు రోజూ ఒకే సమయంలో పిండాలి. తొందర తొందరగా పిండాలి. అప్పుడప్పుడు మాని వేయ గూడదు. పశువు జబ్బుతో ఉంటేపాలు పిండగూడదు. అరటి చెట్టు అరటి సులభంగా పెరిగే చెట్టు. దీనికి కొద్ది చోటు చాలు. ఇంటిలో ఒక పిలక నాటు కుంటే చాలు. ఏళ్ళ తరబడి వుంటుంది. అరటి చెట్టు చుట్టూ పిలకలు పెరుగుతుంటాయి. ఒకటి రెండు పిలకలు వుంచి మిగిలిన వాటిని తీసి వేయాలి. గెల కోసిన తరువాత చెట్టును నరికి వేయాలి. వీటిలో పచ్చరటి తొందరగా కాపుకు వచ్చే రకం. ఈ చెట్టు పొట్టిగా వుంటుంది. దీని గెలకు. డెబ్బై ఎనభ్భై దాకా కాయలు వుంటాయి. అరటికి పచ్చి పేడ మంచి ఎరువు. పూతకు వచ్చినప్పుడు యూరియా వాడడం మంచిది. పెద్దగెల దిగుతుంది. కాయ సైజు పెరుగుతుంది. అరటికి తడి ఆరకుండా నీరు వుండాలి. మనం వాడిన నీళ్ళు చెట్టుకు పారేటట్టు చేసుకుంటే చాలు. ఈ సంగతి మీకు తెలుసా మూడు ఆపిలు పళ్ళలో వుండే బలం ఒక అరటి పండులో వుంది. కొబ్బరి చెట్టు అదనంగా సంపాదించాలని అందరికీ వుంటుంది. ఏదో చేయాలను కొంటాం. కాని అందుబాటులో వుండే పనులు మనకు కనబడవు. ఇంటి ముందు కొంచెమయినా చోటు వుంటుంది. కూరగాయలు పండించలేం. కాని రెండు కొబ్బరి మొలకలు నాటుకో వచ్చుగదా! చెట్ట్టు పెరిగి పైకి పోతుంది. మనకు అడ్డంరాదు. ఆదాయంలో దీనికి మించింది లేదు. కొబ్బరిలో సంకరజాతివి నాటుకొంటే మంచిది. తొందరగా కాపు పడతాయి. కొబ్బరి చెట్టు బాగా కాయాలంటే నీళ్ళు బాగా వుండాలి. చెట్టు మొదట తడి ఆరకుండా చూచుకోవాలి. మనం వాడుకునే నీళ్ళు చెట్టుకు అందేటట్టు చేసుకుంటే చాలు. దీనికొక ఉపాయం వుంది. చెట్టుకూ చెట్టుకూ నడుమా ఒక గుంట తీయాలి. గుంటను ఒక బండతో కప్పివేయాలి. మనం వాడిన నీళ్ళు ఈ గుంటలో పడేటట్టు చేయాలి. ఎండాకాలం గూడా గుంటలో తడి ఆరదు.చెట్టు తొందరగా పెరుగుంది. చెట్టుమొదట కూరలు, ఊరగాయల వంటివి పడవేయకూడదు. ఒక కొబ్బరి చెట్టు సుమారుగా కాపు పడితే అయిదు వందల రూపాయల వరకు ఆదాయం వుంటుంది. ఇంతకంటే సులభమైన సంపాదన వుంటుందా! రెండు కొబ్బరి మొలకలు నాటండి చాలు!